ఇదే జరిగితే పళనికి పచ్చడే…!!

తమిళనాడులో అధికార అన్నాడీఎంకేను దెబ్బతీసేందుకు అందరూ ఒక్కటయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేతుల్లో ఉన్న అధికారాన్ని ఊడగొట్టేందుకు ఐక్యత ఒక్కటే మార్గమని అన్ని పార్టీలూ విశ్వసిస్తున్నాయి. తమిళనాడులో త్వరలోనే 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించనప్పటికీ ఇప్పటికే తమిళనాడులోని అన్ని పార్టీల్లో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఇందులో భాగంగా పళని, పన్నీర్ ను దెబ్బతీసే యత్నంలో విపక్ష సభ్యులున్నారు.

స్ట్రాంగ్ అయిన డీఎంకే…..

ముఖ్యంగా డీఎంకే ఇప్పుడు కొంత తమిళనాడులో స్ట్రాంగ్ గా ఉంది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురై వేరు కుంపటి పెట్టుకున్న టీటీవీ దినకరన్ పార్టీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుంది. సభ్యత్వ నమోదు కొనసాగుతున్నప్పటికీ దినకరన్ వెంట ఎంతమంది నిలబడతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయంతో ఉత్సాహం మీదున్న దినకరన్ ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం అంత ఈజీ కాదన్నది తెలిసిందే. ఆర్కే నగర్ ఉప ఎన్నికలంటే స్వయంగా తాను పోటీ చేయడంతోనే విజయం సాధ్యమయింది. కానీ ఈసారి ఆ పరిస్థితులు లేవు.

18 నియోజకవర్గాలు…..

ఇక తమిళనాడులో జరగనున్న 20 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో 18 మంది దినకరన్ వర్గానికి చెందిన వారివే. 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరడంతోనే వారిపై అనర్హత వేటు పడింది. దీంతోనే ఉప ఎన్నికలు వచ్చాయి. వీరందరిని గెలిపించుకోకుంటే దినకరన్ ఇమేజ్ డ్యామేజీ కావడం ఖాయం. అంతేకాకుడా మేనత్త శశికళ పరువు తీసిన వారు కూడా అవుతారు. ఈ విష‍యం తెలిసే దినకరన్ డీఎంకేతో జట్టుకట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం.

స్టాలిన్ తో జట్టుకట్టాలని…..

18 మంది తమ వర్గానికి చెందిన వారే కావడంతో వారిపై పోటీకి నిలపవద్దని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను కోరారని తెలిసింది. స్టాలిన్, దినకరన్ లు ఇటీవలే సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి. ప్రధానంగా వీరి మధ్య ఉప ఎన్నికలపైనే చర్చ జరిగిందని చెబుతున్నారు. తిరువారూర్, తిరుప్ప కుండ్రం నియోజకవర్గాలను డీఎంకే కు వదిలేసి, మిగిలిన 18 నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉండేలా చూడటమే దినకరన్ లక్ష్యంగా కన్పిస్తుంది. తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యలు గెలిస్తే డీఎంకే సర్కార్ ఏర్పాటుకు తాను సహకరిస్తానని కూడా దినకరన్ సంకేతాలు పంపుతున్నారు. మరి స్టాలిన్ దీనికి ఏ మేరకు అంగీకరిస్తారో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*