ప‌ద‌వుల రారాజు ప‌ల్లంరాజు.. ఇప్పుడు ఎక్క‌డ‌..?

కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజు పేరును దాదాపు ఏపీ ప్ర‌జ‌లు మ‌రిచిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అంతేకాదు, చాలా వ‌ర‌కు మ‌రిచిపోయారు కూడా. అయితే, తాజాగా ఆయ‌న పేరు మ‌ళ్లీ తెర‌మీదికి రావడం గ‌మ‌నార్హం. దీంతో మ‌ళ్లీ ఆయ‌న గురించి చ‌ర్చ మొద‌లైంది. విష‌యంలోకి వెళ్తే.. తూర్పు గోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ‌కు చెందిన మ‌ల్లిపూడి మంగ‌ప‌తి ప‌ళ్లం రాజు.. త‌న తండ్రి మ‌ల్లిపూడి శ్రీరామ సంజీవ‌రావు వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. నేరుగా గాంధీ ఫ్యామిలీతోనే స‌న్నిహిత సంబంధాలు ఉన్న వ్య‌క్తిగా ఆయ‌న‌కు పేరుంది. ఆయ‌న తండ్రి కాకినాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1971 నుంచి 1984 వ‌ర‌కు వ‌రుస‌గా మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు.

తండ్రి వారసత్వాన్ని…….

ఆయ‌న త‌న‌యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు ప‌ళ్లంరాజు. ఉన్న‌త‌విద్యావంతుడైన ప‌ళ్లంరాజు ఇదే నియోజ‌కవ‌ర్గం నుంచి 1989లో ఒక‌సారి, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గాను విజ‌యం సాధించారు. 2004లో ప‌ళ్లంరాజు నేటి కాపు ఉద్య‌మ‌నేత‌గా ఉన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో ముద్ర‌గ‌డ 57 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక 2009లో ముక్కోణ‌పు పోటీలో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన చ‌ల‌మ‌లశెట్టి సునీల్‌పై ఆయ‌న 34 వేల ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. అయితే, 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న తెర‌మరుగయ్యారు.

గత ఎన్నికల్లో పోటీ చేసి…….

అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్‌కు సీన్ లేద‌ని తెలిసినా కేంద్ర‌మంత్రి హోదాలో ఆయ‌న కాకినాడ‌లో పోటీ చేసి 19 వేల ఓట్ల‌తో స‌రిపెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ప‌ద‌వులు అనుభ‌వించిన ప‌ళ్లం రాజు ఆ త‌ర్వాత పార్టీ క‌ష్టాల్లో ఉండ‌గా నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా మౌనంగానే ఉండిపోయారు. తాజాగా మ‌ళ్లీ ఆయ‌న పేరు తెర‌మీదికి వ‌చ్చింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ.. ఆధ్వ‌ర్యంలో పాత నేత‌ల‌ను యాక్టివ్ చేయాల‌నే పాల‌సీ పెట్టుకున్న క్ర‌మంలో ప‌ళ్లంరాజు ను మ‌ళ్లీ తెర‌మీదికి తెచ్చారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాకినాడలో కాంగ్రెస్ ఒంట‌రి అయిపోయింది. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు టీడీపీ పుంజుకుంది. కొంద‌రు నేత‌లు వైసీపీలోకి జంప్ చేశారు.

పార్టీ బాధ్యతలను…..

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ యాక్టివ్ అవ్వాల‌ని భావిస్తున్న ప‌ళ్లంరాజుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌క‌త్వం కాకినాడలో, తూర్పు గోదావ‌రి జిల్లాలో పార్టీని పున‌ర్‌నిర్మించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కాకినాడ డీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న పంతం నానాజీ పార్టీ మార్పుతో ఇక్క‌డ నాయ‌క‌త్వ లోపం, నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం బాహాటంగానే క‌నిపించింది. ఇక, కాకినాడ ప‌ట్ట‌ణ కాంగ్రెస్ ఇంచార్జుగా ఆకుల వెంక‌ట‌ర‌మ‌ణ‌ను నియ‌మించ‌డంతో వ‌ర్గ పోరు పెరిగింద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. దీంతో ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది.. జిల్లా ఇంచార్జును నియ‌మించే బాధ్య‌త‌ను కాంగ్రెస్ నాయ‌క‌త్వం ప‌ళ్లంరాజుకు అప్ప‌గించింది.

బలమైన ప్రత్యర్థులను…..

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఆయ‌న ఇత‌ర పార్టీల్లోకి వెళ్లే ప‌రిస్థితి లేదు. కాకినాడ‌లో టీడీపీ, వైసీపీల‌కు బ‌ల‌మైన అభ్య‌ర్థులే ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని ప‌ళ్లంరాజు భావిస్తున్నారు. అయితే, పార్టీకి కేడ‌ర్ లేక‌పోవ‌డం, ఉన్న‌వారిలో వ‌ర్గ పోరు వంటివి పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. దీంతో ఆయ‌న గెలుపు అంత ఈజీ కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప‌ళ్లంరాజు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*