పార్టీ మారాలనుకున్న పనబాక…?

ఒక‌ప్పుడు రాజసం ఉట్టిప‌డిన ప‌న‌బాక ఫ్యామిలీలో ఇప్పుడు నిర్వేదం క‌నిపిస్తోంది. ఒక‌ప‌క్క సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం, అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌తో పెన‌వేసుకున్న ఎడ‌తెగ‌ని అనుబంధం! దీంతో కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ఫ్యామిలీ త‌మ రాజ‌కీయ ప్ర‌స్తానంలో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌, కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేక‌.. నానా తంటాలు ప‌డుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప‌న‌బాక ఫ్యామిలీ రాజ‌కీయాలపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. కేంద్రంలో మంత్రిగా కాంగ్రెస్ హ‌యాలో చ‌క్రం తిప్పిన ప‌న‌బాక ల‌క్ష్మి ఆమె భ‌ర్త ప‌న‌బాక కృష్ణ‌య్య ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి ఆమె వ‌రుసగా 1996 నుంచి 1999 వ‌ర‌కు రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు.

నియోజకవర్గం మారి……

ఆ త‌ర్వాత కూడా ఆమె నెల్లూరు నుంచి 2004లో కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఇక‌, 2009లో నెల్లూరు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం కాస్తా జ‌న‌ర‌ల్‌కు మార‌డంతో ఆమె గుంటూరు జిల్లా బాప‌ట్ల నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఇలా వ‌రుస‌గా ఎంపీగా ఆమె గెలుస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఆమె భ‌ర్త కృష్ణ‌య్య కూడా నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 2009లో పోటీ చేసినా స్వ‌ల్ప తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ఇక‌, 2014 విష‌యానికి వ‌స్తే.. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించిన వారిలో ల‌క్ష్మీ కూడా ఉన్నారు. అయితే, ఆమె ఇత‌ర నాయ‌కుల మాదిరిగా త‌మ మాట విన‌ని కాంగ్రెస్‌ను వ్య‌తిరేకించి బ‌య‌ట‌కు రాలేదు. అందులోనే ఉండిపోయారు. ప‌న‌బాక ల‌క్ష్మి గ‌త ఎన్నిక‌ల్లో బాప‌ట్ల‌లో కాంగ్రెస్ ప‌క్షాన పోటీ చేసి ఓడిపోతే, ఆమె భ‌ర్త కూడా తిరిగి కాంగ్రెస్ నుంచే గూడూరులో పోటీ చేసి కేవ‌లం 9 వేల ఓట్ల‌తో స‌రిపెట్టుకున్నారు. ఇక‌, కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితిలో లేద‌ని గ్ర‌హించి ఏడాదిన్న‌ర కింద‌ట వైసీపీలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, టికెట్ విష‌యంలో స‌రైన హామీ ల‌భించ‌ని కార‌ణంగా ఆమె మౌనం వ‌హించిన‌ట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పుంజుకుంటుందని….

ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ నేత‌లు పాత‌కాపుల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్ప‌డంతో ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి ఉంద‌ని తెలిసి.. ఇక‌, కాంగ్రెస్‌లోనే ఉండిపోవాల‌ని ప‌న‌బాక ఫ్యామిలీ డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. అయితే, మ‌ళ్లీ కాంగ్రెస్‌కు మామూలు ప‌రిస్థితే ఉంటుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అది గ‌ట్టి పోటీ ఇవ్వ‌క‌పోగాపుంజుకునే ప‌రిస్తితి క‌నిపించ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో మ‌ళ్లీ ఈ ఫ్యామిలీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.

పొత్తు ఉంటుందని…..

పార్టీ మారాలా లేక కాంగ్రెస్‌లోనే కొన‌సాగాలా? అనే నిర్ణ‌యాన్ని తేల్చుకోలేక పోతోంది. పైనుంచి కాంగ్రెస్ నాయ‌కులు మాత్రం ప‌న‌బాక ఫ్యామిలీపై తీవ్ర‌మైన ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ మారొద్ద‌ని, తామంతా చ‌క్క‌బెడ‌తామ‌ని, కేంద్రంలో కాంగ్రెస్ అదికారంలోకి వ‌స్తే.. మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని చెబుత‌ున్నారు. ఇక ప‌న‌బాక‌తో పాటు ఏపీలో కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు టీడీపీతో పొత్తు ఉంటుంద‌న్న ఆశ‌లు కూడా వారి భ‌విష్య‌త్తును చిగురించేలా చేస్తున్నాయి. దీంతో ప‌న‌బాక ఫ్యామిలీ ఫ్యూచ‌ర్ తెలియ‌క అల్లాడుతోంది. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*