సాంబారు, వడ వేర్వేరు అయితే….?

అసలే నాయకత్వ లేమితో బాధపడుతున్న అధికార పార్టీ అన్నాడీఎంకేను ఆధిపత్య పోరు మాత్రం వదలడం లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు కలసి కట్టుగా పార్టీని ముందుకు తీసుకెళతారన్న నమ్మకం లేదు. వచ్చే ఎన్నికల వరకూ మ…మ అనిపించే రీతిలోనే ఇద్దరి వ్యవహారం సాగుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అన్నాడీఎంకేలో ఎంజీ రామచంద్రన్, జయలలిత తర్వాత అంతటి ఛరిష్మా కలిగిన నేతలు లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందని చెప్పక తప్పదు. ఇద్దిరిలో కొంత పన్నీర్ సెల్వం మాత్రమే ప్రజలను ఆకట్టుకుంటారని కొందరు నమ్ముతున్నారు.

పన్నీర్ పై అమ్మ నమ్మకం……

తాను బతికుండగానే పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవిని జయలలిత ఇచ్చారు. అంటే ఆయనపై అమ్మకు ఎంత నమ్మకమో అన్నది పన్నీర్ పై కురుస్తున్న సానుభూతికి నిదర్శనమని చెప్పకతప్పదు. అమ్మ మరణించిన వెంటనే పన్నీర్ సెల్వాన్ని తప్పించి, ఆమె ఆశయాలను తుంగలో తొక్కారని అన్నాడీఎంకేలో ఒక వర్గం అభిప్రాయపడుతుంది. అయితే పళనిస్వామి వర్గం మాత్రం అమ్మకు విశ్వాసపాత్రుడన్న దాంట్లో నిజం ఉందని, అయితే సమర్థత విషయంలో పళనికి మించిన వారు లేరని వారు చెబుతున్నారు.

పళనిస్వామి ఫోకస్ అయ్యేందుకు…..

ముఖ్యమంత్రిగా పళనిస్వామి, పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం ఉన్నారు. ఇద్దరూ కలసి పనిచేయాల్సిన తరుణంలో పంతాలకు పోతున్నారు. ముఖ్యంగా పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామి కావాలని పక్కన పెడుతున్నారన్న అనుమానాలు ఆయన వర్గంలో వ్యక్త మవుతున్నాయి. ఒకవైపు తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ పార్టీలు వస్తుండటం, టీటీవీ దినకరన్ కొత్త పార్టీతో ప్రజల్లోకి వెళుతున్న సమయంలో పార్టీలో నెలకొన్న విభేదాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెడతాయన్నది విశ్లేషకుల అంచనా.

పన్నీర్ ను పక్కన పెట్టి……

ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పన్నీర్ ను పూర్తిగా పక్కన పెట్టేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎంజీఆర్, జయలలిత తర్వాత తానే పార్టీ అగ్రనేత అంటూ ఫోకస్ అయ్యే ప్రయత్నం చేశారు పళనిస్వామి. ఎంజీఆర్ శతజయంతి వేడుకల్లో పన్నీర్ సెల్వం ఫొటోయే కన్పించకపోవడాన్ని ఆయన వర్గం బహిరంగంగానే తప్పుపడుతోంది. పైకి పళనిస్వామి తమ మధ్య విభేదాలు లేవని చెబుతున్నప్పటికీ ఆయన చేస్తున్న ప్రతి చర్యా పన్నీర్ కు వ్యతిరేకంగా జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి. దీంతో పన్నీర్ ఎప్పటికైనా పళనిపై తిరుగుబాటు చేసే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*