ఒకరు కబాలి…మరొకరు కాలా…!

ఒకే ఒర లో రెండు కత్తులు ఇమడవన్న సామెత అక్షరాలా వీరికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. వేదికలపై తామిద్దరమూ ఒకటేనంటారు. పైకి నవ్వుకుంటారు. లోపల కత్తులు దూసుకుంటున్నారు. పార్టీపై ఆధిపత్యం కోసం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ ఎటువైపునకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇద్దరు నేతలూ అమ్మ నీడన ఎదిగిన వారే. స్వయం ప్రకాశకులు కానే కాదు. అమ్మ మరణంతో వీరికి మహర్దశ పట్టింది. అయినా పార్టీని కాపాడుకోవాల్సిన సమయంలో కక్ష్యలు పెంచుకుంటున్నారు. ఒకరి వెనక ఒకరు గుంతలు తవ్వుకుంటున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితి ఇది. ఆ ఇద్దరు నేతలు ఒకరు ముఖ్యమంత్రి పళనిస్వామి కాగా మరొకరు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.

గత కొద్ది రోజులుగా….

ఈ ఇద్దరు గత కొద్ది రోజులుగా ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. కీలక నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రినైన తనకు చోటు కల్పించడం లేదన్నది పన్నీర్ సెల్వం వాదన. అలాగే అన్నాడీఎంకేను కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి పార్టీలో తన ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తున్నారన్నది ఆయన ఆందోళన. అయితే గుంభనంగా ఉన్న్ పన్నీర్ సెల్వం తెరచాటు మంత్రాంగం జరుపుతున్నారు. పళనిస్వామిపై ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. పళని ఒంటెత్తు పోకడలతో పాటు తమను పట్టించుకోవడం లేదని, తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని కూడా ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై మంది వరకూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అసంతృప్త ఎమ్మెల్యేలతో…..

అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రి పదవే. అమ్మ జయలలిత బతికుండగానే ఆయనకు రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి లభించింది. అమ్మకు నమ్మకమైన వ్యక్తిగా ఉన్న పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రెండు వర్గాలు కలిసినప్పుడే ఆ వర్గం నేతలు డిమాండ్ చేశారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని రెండు వర్గాలకు సంధి కుదిర్చింది. ప్రభుత్వంలో నెంబర్ వన్ గా పళనిస్వామి ఉంటారని, పార్టీలో నెంబర్ వన్ గా పన్నీర్ సెల్వం కొనసాగుతారని బీజేపీ పెద్దలు రూపొందించిన ఫార్ములాకు ఇద్దరూ ఒకే చెప్పి ఒక్కటయ్యారు.

ఆయన కు ఫిర్యాదు చేస్తే…..

అయితే ఇద్దరూ కలసి ఏడాదికి పైగానే అవుతున్నప్పటికీ మనసులు కలవలేదన్నది వాస్తవం. ఎందుకంటే తాజా సంఘటనలే ఇందుకు ఉదాహరణ. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు కలిసి పోవడానికి ప్రధాన కారణం కమలం పార్టీయేనన్నది అందరికీ తెలిసిందే. అందులోనూ ఈ రెండు వర్గాలు కలిసేందుకు అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారట. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు వెంకయ్యనాయుడికే పన్నీర్ సెల్వం వర్గం పళనిస్వామి పై ఫిర్యాదు చేసింది. పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ ఇటీవల చెన్నైకు వచ్చిన వెంకయ్యను కలసి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తమ వర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేశారు. ప్రభుత్వంలో, పార్టీలో పళనిస్వామి అనుసరిస్తున్న తీరు గురించి వెంకయ్యతో చెప్పారని వార్తలు వచ్చాయి. పన్నీర్ సెల్వం వెంకయ్య నాయుడిని స్వయంగా కలవాలనుకున్నా, అది పార్టీకి మంచిది కాదని భావించి ఆయన తన కుమారుడిని పంపినట్లు తెలిసింది. మొత్తం మీద అధికార అన్నాడీఎంకేలో లుకలుకలు లోక్ సభ ఎన్నికల సమయానికి మరింత ముదిరే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*