అన్నాడీఎంకేలో అలాంటి పరిస్థితా?

జయ ఉన్నప్పుడు పార్టీ ఖజానా నిండు కుండలా కళకళ లాడేది. కాని జయ మరణానంతరం ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడంలేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సినీ పరిశ్రమ నుంచి జయలలిత జీవించి ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు విరాళాల రూపంలో అందేవి. ఏదైనా ఎన్నికలు వస్తే జయ అడగకపోయినా విరాళాలిచ్చేందుకు పారిశ్రామికవేత్తలు క్యూకట్టేవారు. కాని జయ మరణానంతరం సీన్ పూర్తిగా మారిపోయింది. అన్నాడీఎంకే కు విరాళాలిచ్చే వారి సంఖ్య దాదాపుగా లేదనే చెప్పాలి. అధికారంలో ఉండి కూడా పార్టీకి విరాళాలను సేకరించడం ఆ పార్టీకి సవాల్ గామారిందంటున్నారు. లోక్ సభ ఎన్నికలు వస్తుండటంతో ఆ పార్టీ నేతలు దీనిపై కసరత్తు చేస్తున్నారు.

ఖజానా కళ…కళ…..

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నా, అన్నాడీఎంకే ప్రతిపక్షంలో ఉన్నా సరే కాసుల కోసం వెదుక్కోవాల్సిన పనిలేదు. జయపై అంత నమ్మకం ఉండేది. జయ తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకంతో కోట్లాది రూపాయలు స్థానిక సంస్థల ఎన్నికలకే వచ్చేవని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి చెప్పక్కర్లేదు. తమిళనాడులో ప్రస్తుతం తిరువాయూరు, తిరుప్పరకుండ్రం ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో పాటు లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు.

విరాళిచ్చేందుకు…..

అయితే ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా విరాళిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలియడంతో ఇద్దరు నేతలు కంగుతిన్నారు. జయలలిత మరణం తర్వాత శశికళ ఉంటే పార్టీకి పారిశ్రామిక వర్గాల్లో కొంత పట్టు ఉండేదంటున్నారు. శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించడం, శశికళ మేనల్లుడు దినకరన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో అన్నాడీఎంకే కు విరాళిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. అన్నాడీఎంకే కంటే దినకరన్ పార్టీకే ఎక్కువ విరాళాలు వస్తున్నాయన్న విషయం వీరికి మింగుడు పడకుండా ఉంది.

సభ్యత్వాలు కూడా తగ్గుతూ…..

అధికారంలో ఉన్న తమకు సహకరిచకుంటే ఇబ్బందులు తప్పవని పారిశ్రామిక వేత్తలకు సంకేతాలు పంపాలని ఈ సందర్భంగా కొందరు నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు సూచించినట్లు సమాచారం. పన్నీర్, పళని స్వామి ఏకమైన తర్వాత పార్టీని గాడిలో పెట్టే ఏ ప్రయత్నమూ పెద్దగా చేయలేదు. పాలనపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ ఇద్దరూ పార్టీని పూర్తిగా పట్టించుకోవడం మానేశారన్నది పార్టీలోనే విన్పిస్తున్న అభిప్రాయం. అందుకే పార్టీ సభ్యత్వాల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతుందన్న ఆందోళన కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వీరిద్దరూ ఇలాగే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకంటే ముందుగానే ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఇతర పార్టీలోకి జంప్ అవ్వక తప్పనిసరి పరిస్థతి అంటున్నారు. మొత్తం మీద జయలేని లోటు అన్నాడీఎంకేలో స్పష్టంగా కన్పిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*