ఎలా గట్టెక్కాలి….?

అధికార అన్నాడీఎంకేకు ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి పార్టీలో తిరుగుబాట్లు తలెత్తకుండా కాపాడుకోవడం. రెండు తిరువారూర్, తిరుప్పకుండ్రం ఎన్నికల్లో విజయం సాధించడం. ఇందుకోసమే అన్నాడీఎంకే ప్రత్యేకంగా ఇటీవల జే న్యూస్ ఛానల్ ను ప్రారంభించింది. జయలలిత జీవించి ఉన్నంత కాలం జయ న్యూస్ అన్నాడీఎంకేకు అండగా ఉండేది. జయ మరణానంతరం జయ న్యూస్ శశికళ కుటుంబం చేతుల్లోకి వెళ్లడంతో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే గొంతును విన్పించేవారే కరువయ్యారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమికి తమకు తగిన ప్రచారం లభించలేదని భావించిన అన్నాడీఎంకే సొంతంగా తమ వాయిస్ ను విన్పించేందుకు జే న్యూస్ ను ఇటీవల ప్రారంభించింది.

అసమ్మతి బెడత……

ఈ న్యూస్ ఛానల్ కూడా దివంగత జయలలిత పేరు మీదనే పెట్టడం విశేషం. అయితే ఇప్పుడు అన్నాడీఎంకేలో అసమ్మతి మళ్లీ తలెత్తుతోంది. గతంలో తిరుగుబాటు చేసి దినకరన్ వెంట వెళ్లి మళ్లీ అన్నాడీఎంకే గూటికి చేరిన మాజీ మంత్రి తోప్పు వెంకటాచలం రహస్య సమావేశం పెట్టడం అన్నాడీఎంకేలో కలకలం రేపుతోంది. వెంకటాచలం వెంట ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు అప్రమత్తమయ్యారు. వెంకటాచలంకు మంత్రి పదవి ఇస్తామంటేనే దినకరన్ గూటి నుంచి తిరిగి పార్టీలో చేరారు. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీనికితోడు మంత్రులు కేఏ సెంగొట్టియన్, కేసీ కరుప్పణన్ ల వ్యవహారశైలి నచ్చని వెంకటాచలం సీక్రెట్ మీటింగ్ లతో దడ పుట్టిస్తున్నారు. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వెంట వెళ్లారు. ఈ ఎనిమిది మంది కూడా తోడయితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై కోర్టు ఏ క్షణంలోనైనా తీర్పు చెప్పే అవకాశముండటంతో ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు.

ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ…..

అయితే తిరువారూర్, తిరుప్పకుండ్రంలో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి కూడా స్వయంగా పళని, పన్నీర్ లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. డీఎంకే రెండు వర్గాలుగా చీలడం, దినకరన్ పార్టీ కూడా పోటీ చేస్తుండటంతో ఈ రెండు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎ.కే.బోస్ హఠాత్ మరణంతో తిరుప్పకుండ్రం ఎన్నిక అనివార్యమైంది. ఇది అన్నాడీఎంకే సిట్టింగ్ సీటు. ఈసీటును ఎలాగైనా కాపాడుకోవాలని, లేకుంటే సొంతపార్టీలోని ప్రత్యర్థులు మరింత రెచ్చిపోయే అవకాశముందని భావించిన పన్నీర్, పళనిలు అందుకు అవసరమైన కార్యాచరణను ప్రకటించారు. కార్యకర్తలను, నేతలను కార్యోనుఖులను చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

నలుగురు మంత్రులకు……

ఈ రెండు ఉప ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతను నలుగురు మంత్రులకు అప్పగించారు. కరుణానిధి మృతితో ఏర్పడిన తిరువారూర్ లోనూ గెలుస్తామని అన్నాడీఎంకే ధీమా వ్యక్తం చేస్తోంది. కరుణానిధి కుటుంబంలో అక్కడ ఇద్దరు పోటీ పడే అవకాశం ఉండటం తమకు కలసి వస్తుందని భావిస్తున్నారు. ఈ రెండు ఉప ఎన్నికల కోసం మంత్రులు సెల్లూరు కె.రాజు, ఆర్.కామరాజ్, దిండుగల్ శ్రీనివాస్, ఆర్.బి. ఉదయకుమార్ లు పనిచేయాలని పార్టీ ఆదేశించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ మొత్తం వీరే చూడాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో గెలుపోటములే తమ అధికారాన్ని శాసిస్తాయని పళని, పన్నీర్ సెల్వంలకు తెలియంది కాదు. అందుకోసం ఇప్పటి నుంచే ఆ రెండు ఎన్నికలపై వీరిద్దరూ దృష్టి పెట్టారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*