ఊగిసలాట..తర్జనభర్జన….!!

ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. పేరుకు అధికార పార్టీ అయినా నాయకత్వం, చరిష్మాకలిగిన లీడర్ లేరు. జయలలిత మరణం తర్వాత రెండాకులు రెండుగా చీలిపోయిన తర్వాత తొలిసారిగా లోక్ సభ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. కమలం పార్టీతో పొత్తుతో వెళదామని తొలుత భావించినా పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం వారిని ఆలోచనలో పడేసింది. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పరిస్థితి ఇది. ఈ పార్టీకి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం లు మాత్రమే రధసారధులు. ఇద్దరూ ఒక్కటేనన్నట్లు బయటకు కన్పిస్తున్నా లోపల మాత్రం విభేదాలు అలాగే ఉన్నాయి.

అమ్మ బొమ్మ పెట్టుకున్నా…..

అమ్మ బొమ్మ పెట్టుకుని వెళితే ఎన్నికల్లో నెగ్గుతామా? అన్నదే ఆ పార్టీ నేతల్లో కలుగుతున్న సందేహం. త్వరలో జరగనున్న 20 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని తొలుత పన్నీర్, పళనిలు ఇద్దరూ భావించారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమికి బీజం పడింది. ఇందులో కమల్ హాసన్ కొత్త పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కూడా చేరే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలసి వెళితే కొంత సానుకూల ఫలితాలు ఉంటాయిని భావించారు.

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో…..

కాని క్రమేపీ బీజేపీ గ్రాఫ్ పడిపోవడం, పొరుగు రాష్ట్రం కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకత తమకు సెగ తగులుతుందని భావించిన పన్నీర్, పళనిస్వామిలు ఒంటరిగానే బరిలోకి దిగే యోచనలో ఉన్నారు. అయితే రజనీకాంత్ కొత్త పార్టీ ఎప్పుడు వస్తుంది? ఆయన ఎటు వైపు మొగ్గు చూపుతారన్న ఆలోచనలో అన్నాడీఎంకే ఉంది. రజనీకాంత్ కమలం పార్టీకి కొంత దగ్గరగా ఉన్నారు. ఆయన కమలం పార్టీతో దోస్తీ కడితే తాము కూడా కలసి ప్రయాణించవచ్చన్నది పళని, పన్నీర్ ఎత్తుగడగా తెలుస్తోంది.

డీెెఎంకే బలోపేతం కావడంతో…..

ఇప్పటికే తమిళనాడులో డీఎంకే స్ట్రాంగ్ అయింది. కాంగ్రెస్ తో పాటు చిన్నా చితకా పార్టీలను కలుపుకుని ఉప ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనాలని వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. అయితే ఇదే సమయంలో అన్నాడీఎంకే బీజేపీతో అంటకాగుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతుండటంతో ఆ పార్టీ కొంత ఇబ్బందుల్లో పడింది. తమిళనాడులో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాలంటే కత్తిమీద సామేనని చెప్పక తప్పదు. దీంతో రజనీ రాజకీయ ప్రవేశం, ఆయన తీసుకోబోయే నిర్ణయాల తర్వాతనే పొత్తులపై ఆలోచించాలని వారు నిర్ణయించుకున్నారు. మొత్తం మీద అధికార అన్నాడీఎంకే ఒంటరిగా వెళ్లాలా? లేక కలసి వెళ్లాలా? అన్నదానిపై తర్జనభర్జన పడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*