ఆ ఇద్దరూ….ఆ…రెండు…?

అందరూ ఆ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. ఆ ఒక్క నియోజకవర్గం చేతిలో నుంచి జారిపోతే ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ల పునాదులు కదలిపోయినట్లే. త్వరలోనే తమిళనాడులో తిరువారూర్, తిరుప్పకుండ్రం ఉప ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే అధినేత కరుణానిధి మృతితో తిరువారూర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతుండగా, అన్నాడీఎంకే సభ్యుడు ఏకే బోస్ మరణంతో తిరుప్పకుండ్రం ఉప ఎన్నిక జరగనుంది. ముఖ్యంగా అధికార అన్నాడీఎంకే కు తిరుప్పకుండ్రం ఎన్నిక సవాల్ గా నిలవనుంది. ఈ ఉప ఎన్నికలో ఓటమి చవిచూస్తే అన్నాడీఎంకే అధినేతలిద్దరి నాయకత్వంపై నీలినీడలు కమ్ముకుంటాయన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు.

తిరుప్పరకుండ్రంలో…..

అందుకే ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ నియోజకవర్గంలో పెద్దయెత్తున పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అసలే ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓటమితో కుదేలైపోయిన అన్నాడీఎంకే తిరుప్పరకుండ్రంలో కూడా అదే జరిగితే కార్యకర్తల నుంచే కాకుండా ఎమ్మెల్యేల నుంచి కూడా ఇద్దరూ ఒత్తిడి ఎదుర్కొనే అవకాశముంది. అందుకోసమే ఈ నియోజకవర్గానికి బాధ్యులుగా మంత్రులు ఉదయ్ కుమార్, సెల్లూరు రాజులను పళనిస్వామి నియమించారు. వీరిద్దరూ గత వారం రోజుల నుంచి తిరుప్పకుండ్రంపైనే దృష్టి పెట్టారట. అంతేకాదు నియోజకవర్గంలో బూత్ కమిటీలతో నిన్న సమావేశమైన మంత్రులు ఉదయ్ కుమార్, సెల్లూరు రాజులు ఆర్కే నగర్ తప్పిదం మరోసారి జరగకూడదని నేతలకు గట్టిగా చెప్పారు.

ఎంత ఖర్చయినా……

ఈ నియోజకవర్గంలో ఎంత ఖర్చయినా సరే విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో తిరుప్పరకుండ్రం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన ఏకే బోస్ కు 46 వేల పైచిలుకు మెజారిటీ లభించింది. బోస్ మరణంతో వస్తున్న ఎన్నిక కావడంతో కొంత సానుభూతి కూడా తమకు వర్క్ అవుట్ అవుతుందని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. బోస్ కుటుంబంలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇచ్చేందుకు అన్నాడీఎంకే సిద్ధమయింది. ఈ ఎన్నికలో విజయం సాధించి నాయకత్వంపై నమ్మకం పెంచాలన్నది పన్నీర్ సెల్వం, పళనిస్వామిల లక్ష్యంగా కన్పిస్తోంది.

తిరువారూర్ లో ఓట్ల చీలిక……

ఇక తిరువారూర్ నియోజకవర్గం కరుణానిధి సొంత నియోజకవర్గం. అక్కడ కరుణ కుటుంబానికి పట్టు ఎక్కువగా ఉంది. కరుణానిధి అభిమానులు, బంధు బలగమే ఆ పార్టీకి అక్కడ శ్రీరామరక్ష. కాని డీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తమకు కలసి వస్తాయని ఈపీఎస్, ఓపీఎస్ లు భావిస్తున్నారు. తిరువారూరు నియోజకవర్గంలోనూ బలమైన అభ్యర్థిని నిలపాలన్న యోచనలో ఉన్నారు. అక్కడ డీఎంకే తరుపున అభ్యర్థి ఉండటమే కాకుండా కరుణానిధి పెద్దకుమారుడు ఆళగిరి పోటీ చేస్తారన్న వార్తలతో డీఎంకే ఓట్లలో చీలిక తమ విజయానికి కారణమవుతుందని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. పళని, పన్నీర్ లు మాత్రం తిరువారూర్ కంటే తిరుప్పరకుండ్రం లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.