వారికి ఆ “ఫిగర్”…..ఫియర్….!!

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. జరగనున్న ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించకుంటే ఇంటికి పోక తప్పుదు. త్వరలోనే తమిళనాడులో 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇందులో కరుణానిధి మరణంతో ఖాళీ అయిన తిరువారూర్ నియోజకవర్గం తప్ప మిగిలిన వన్నీ అన్నాడీఎంకేకు చెందినవే. ఇందులో 18 మంది దినకరన్ గూటికి చేరగా వారిపై అనర్హత వేటు పడింది. మరొక ఎమ్మెల్యే ఎ.కె.బోస్ మరణంతో ఈ ఖాళీ ఏర్పడింది.

బలం సరిపోతుందా….?

తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు 111 మంది సభ్యుల బలం ఉంది. ఇప్పటి లెక్క ప్రకారం ఆ బలం సరిపోతుంది. ఉప ఎన్నికలు జరిగితే మాత్రం బలం సరిపోదు. మరో 8 మంది సభ్యులు అవసరమవుతారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కనీసం ఎనిమిది స్థానాల్లో గెలవకుంటే పళని ప్రభుత్వం కుప్ప కూలి పోవడం ఖాయం. అందుకే అన్నాడీఎంకే ముందుగా ఇరవై నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించింది. అందరినీ రంగంలోకి దింపింది. ఎలాగైనా కనీసం పది స్థానాలకు మించి కైవసం చేసుకోవాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

ఇంటలిజెన్స్ సర్వేలో……

ఇంటలిజెన్స్ సర్వేలు అందించిన నివేదిక ప్రకారం 18 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారికే సానుభూతి ఉందని తెలిసింది. అయితే కొద్దిగా కష్టపడితే వీటిలో ఏడు నుంచి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడం పెద్దగా సులువు కాదని పళనిస్వామి అభిప్రాయపడుతున్నారు. ఎకే బోస్ మరణంతో ఖాళీ అయిన తిరుప్పకుండ్రం మాత్రం తిరిగి అన్నాడీఎంకే గెలిచే అవకాశాలున్నాయని తేలడంతో పది స్థానాల్లో గట్టిగా గెలిచేందుకు పళని, పన్నీర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు.

దినకరన్ ఫెయిల్ అయితే…..

మరోవైపు టీటీవీ దినకరన్ కు ఈ ఉప ఎన్నికలు సవాల్ అని చెప్పక తప్పదు. తన పంచన చేరిన ఎమ్మెల్యేలు 18 మందిని తిరిగి గెలిపించుకోకుంటే టీటీవీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉత్సాహంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇరవై స్థానాల్లో తమ పార్టీకి ప్రెజర్ కుక్కర్ గుర్తు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను కోరనున్నారు. అన్ని స్థానాల్లోనూ ఒకే గుర్తు ఉంటే గెలుపు సాధ్యమని దినకరన్ నమ్ముతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే  అధినేత స్టాలిన్ కూడా కూటమిగా ఏర్పడి ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. మొత్తం మీద పళని, పన్నీర్ సెల్వానికి ఫిగర్ ఫియర్ పట్టుకుందనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*