ఇక కష్టంగానే ఉన్నట్లుంది….!

బంధం తెగిపోయేటట్లుంది. ఏడాది కాలం కలసికట్టుగా ఉన్నట్లు నటించినా తాజా పరిణామాలతో వారిద్దరూ ఇక కలసి ప్రయాణించడం కష్టమేనని చెబుతున్నారు విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో వీరి మధ్య అంతర్గత పోరు ఎటు వైపునకు దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఒకరి వెనక మరొకరు గోతులు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పన్నీర్ సెల్వానికి ఆగ్రహం తెప్పించింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు తెలపడం మరింత అగ్గిరాజేసింది.

ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు…..

పన్నీర్ సెల్వం 2001 లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు పెద్దయెత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రతిపక్ష డీఎంకే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ ఎందుకు చేయరని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించినట్లు కోర్టుకు తెలపడంతో పన్నీర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పళనిస్వామితో పంచాయతీని తేల్చుకోలేక ఢిల్లీ వెళ్లిన పన్నీర్ సెల్వానికి అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురయింది. అక్కడ బీజేపీ నేతల అపాయింట్ మెంట్ లభించడంతో నిరాశతో వెనుదిరిగారు. పళనిస్వామి తమ నేతపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని పన్నీర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

కక్ష సాధింపు చర్యలంటున్న….

శశికళ జైలు కెళ్లిన తర్వాత పన్నీర్ సెల్వం, పళని స్వామి కలసిపోయారు. శశికళ కుటుంబాన్ని పక్కనపెట్టడమే కాకుండా, పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఆర్కే నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లోనూ పన్నీర్ సెల్వం తన మద్దతుదారుడైన మధుసూదనన్ కు అన్నాడీఎంకే టిక్కెట్ ఇప్పించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లోనూ పళనివర్గం తమకు సహకరించలేదని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. అలాగే పన్నీర్ సెల్వం అక్రమ ఆస్తుల పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడాన్ని తప్పు పడుతున్నారు. నిజాయితీ, విలువలతో ఉండటమే కాకుండా, అమ్మ జయలలిత మెచ్చిన తమ నేతపై ఎందుకు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ అన్నాడీఎంకే లోని ఒక వర్గం ఆందోళనకు కూడా దిగింది. పన్నీర్ సెల్వం వర్గం ఉప్పందించడం కారణంగానే తమ నేతలపై ఐటీ దాడులు జరిగాయని పళనిస్వామి వర్గం ఆరోపిస్తుంది.

విశ్వాస పరీక్ష జరిగితే…..

మరోవైపు పన్నీర్ సెల్వం సహకారం పళనిస్వామికి అవసరమవుతుంది. 18 మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటు ఈ నెల 27వ తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశముంది. మూడో న్యాయమూర్తి తన తీర్పు చెప్పేదాన్ని బట్టి పళని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరోసారి విశ్వాస పరీక్షకు పళనిస్వామి దిగాల్సి వస్తే పన్నీర్ సెల్వం చేయూత నివ్వాల్సి ఉంటుంది. పన్నీర్ సెల్వం వద్ద 11 మంది ఎమ్మెల్యేలున్నారు. పళనిస్వామి చెంత 105 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇలా ఇద్దరూ కలసినా మ్యాజిక్ ఫిగర్ కు ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కలహాలు టీటీవీ దినకరన్ కు కలసి వచ్చేలా కన్పిస్తున్నాయి. కేంద్రం పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప సమసిపోయేలా కన్పించడ లేదు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*