వారిపైనే పవన్ గురి….!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో భూ కబ్జాల ను ముఖ్య సమస్యగా గుర్తించిన పవన్ కల్యాణ్ దానిపై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ ప్రతి జిల్లా నుంచి ప్రత్యేకంగా భూకబ్జాల విషయంలో నివేదికలు తెప్పించుకుని మరీ గళమెత్తనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో భూకబ్జాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో హైదరాబద్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను కలసి బాధితులు తమ గోడును విన్పించుకుని వెళుతున్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో భూకబ్జాలనే ప్రధాన అంశంగా తీసుకుని పోరాట బాట పట్టాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

భూకబ్జాల్లో తెలుగు తమ్ముళ్లు….?

ముఖ్యంగా విజయవాడ, విశాఖ, తిరుపతి పట్టణాల్లో జరుగిన, జరుగుతున్న భూ కబ్జాల్లో తెలుగుదేశం పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారని తెలుసుకున్న పవన్ పేర్లతో సహా ధ్వజమెత్తడానికి రెడీ అయిపోయారు. బాధితుల నుంచి కొన్ని పత్రాలను కూడా తీసుకున్న పవన్ ఇకపై తన సభల్లో ఇదే ప్రధాన అంశంగా ప్రస్తావించనున్నారని జనసేన పార్టీ నేత ఒకరు చెప్పారు. అధికారం, డబ్బుతో బెదిరించి అమాయకుల నుంచి భూములను కాజేస్తున్న నేతల చిట్టాను పవన్ విప్పేందుకు సిద్ధమయ్యారు.దీన్ని తొలుత విజయవాడ నుంచే ప్రారంభించనున్నారు పవన్.

విజయవాడలో సమావేశం…..

పవన్ కల్యాణ్ ఈ నెల 23వ తేదీన విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ తొలుత రాజధాని అమరావతిలో ఉన్న రైతులతో సమావేశం కానున్నారు. కావాల్సినంత భూమి ఉన్నా ఇంకా ప్రభుత్వం భూ సేకరణ పేరిట తమ భూములను అక్రమంగా తీసుకుంటుందని పలువురు రైతులు ఇప్పటికే పవన్ కలసి విన్నవించారు. న్యాయస్థానాల ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా తమ భూములను ప్రభుత్వ పెద్దలు కాజేయాలని చూస్తున్నారన్నది వారి ఆరోపణ. దీనిపై పవన్ విజయవాడలో వారితో భేటీ తర్వాత స్పందించనున్నారు.

తిరిగి పర్యటన ప్రారంభం…..

ఇక ఉత్తరాంధ్ర పర్యటనకు విరామమిచ్చిన పవన్ కల్యాణ్ ఈ నెల 26 నుంచి అక్కడి నుంచే పోరాట యాత్రను ప్రారంభించనున్నారు. విశాఖ జిల్లాలో ఉన్నప్పుడు జనసేనలో ఉన్న ముస్లింల కోసం యాత్రకు విరామమిచ్చారు. దీంతో పాటు పవన్ కల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స కూడా చేయించుకోవాల్సి ఉంది. పవన్ కల్యాణ్ కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నెల 24న పవన్ కల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స జరగనుంది. ఆతర్వాత ఉత్తరాంధ్ర పర్యటనను పవన్ చేయనున్నారు. విశాఖ జిల్లాలో పోరాటయాత్ర ముగిసిన తర్వాత దానికి కొనసాగింపుగా తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుందని జనసేన పార్టీ కార్యాలయం తెలిపింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*