పవన్ ధైర్యం అదేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ప్రారంభించిన జ‌న‌సేనలోకి మెగా ఫ్యామిలీ ఏంటీ!- తాజాగా ఈ విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం గా మారింది. బాబాయి ర‌మ్మంటే.. నేను ప్ర‌చారం చేస్తా- అంటూ మెగా స్టార్‌.. చ‌ర‌ణ్ చేసిన ప్ర‌క‌ట‌నే ఈ సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది. దీంతో ఇప్పుడు అంద‌రూ ప‌వ‌న్ వ్యూహంపై చ‌ర్చిస్తున్నారు. నిజానికి నాలుగేళ్ల కింద‌టే పార్టీ ప్రారంభించినా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌లోకి త‌న ఫ్యామిలీని ఎంట‌ర్ చేస్తాన‌ని ఎక్క‌డా ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌లేదు. అదేవిధంగా మెగా ఫ్యామిలీ కూడా ఎలాంటి ప్ర‌క‌ట‌నలూ చేయ‌లేదు. దీంతో ప‌వ‌న్ ఒంట‌రిగానే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు.

ప్రజారాజ్యంలో మాత్రం…..

గ‌తంలో 2007లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్తాపించిన స‌మ‌యంలో అతి త‌క్కువ స‌మ‌యంలోనే మెగా ఫ్యామిలీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్ప‌టి 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో మెగా బావ‌మ‌రిది.. అల్లు అర‌వింద్ టికెట్ల కేటాయింపులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా ప‌వ‌న్ కూడా రాజ‌కీయ ఎంట్రీ ఇచ్చి.. యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఇక‌, గుంటూరు కేంద్రంగా అప్ప‌ట్లో ఆయ‌న యువ‌రాజ్యానికి దాదాపు వెయ్యి మంది సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్టుగా కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున నాగ‌బాబు కూడా ప్ర‌చారం చేశారు.

జనసేనలో మాత్రం….

ఇలా మెగా ఫ్యామిలీ అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం బ‌రువు బాధ్య‌త‌లను నెత్తినేసుకుంది. దీనికి డిఫరెంట్‌గా ఇప్పుడు జ‌న‌సేన‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు. కీల‌క‌మైన నాగ‌బాబు సైతం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ప్ర‌స్తుతం మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో ఇప్పుడు జ‌న‌సేన‌లోకి తాను ఎంట్రీ ఇస్తాన‌ని ప‌రోక్షంగా చెర్రీ చెప్ప‌క‌నే చెప్పాడు. దీంతో ఒక్క‌సారిగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల క‌ళ్లు చెర్రీపై మ‌ళ్లాయి. ఈయ‌న వ‌స్తే.. పార్టీ రేటింగ్ పెరుగుతుంద‌ని, టీడీపీకి ప్ర‌ధానంగా దెబ్బ‌త‌గులుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఇదే ఫ్యామిలీపై ప్ర‌జారాజ్యం తాలూకు ఆన‌వాళ్లు ఇప్ప‌టికీ క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

విఫలమైన నాయకులుగా….

విఫ‌ల‌మైన నాయ‌కులుగా అల్లు అర‌వింద్‌, నాగ‌బాబు బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అంతేకాదు, టికెట్ల కేటాయింపులో అల్లు అర‌వింద్ బాగానే సంపాయించార‌ని, ఆయ‌న వ‌ల్లే పార్టీ నాశ‌న‌మైంద‌నే టాక్ కూడా అప్ప‌ట్లో వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ వ‌రుస పెట్టివీళ్లు జ‌న‌సేన‌లోకి వ‌స్తే.. ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. జ‌న‌సేన‌లో కీల‌క‌మైన అధికార ప్ర‌తినిధుల పోస్టులు ఇప్ప‌టికీ భ‌ర్తీ కాలేదు. అదేవిధంగా ఎన్నిక‌ల క‌న్వీన‌ర్ పోస్టు కూడా భ‌ర్తీ కాలేదు. ఈ నేప‌థ్యంలో అన్నీతానై వ్య‌వ‌హ‌రించ‌డం ప‌వ‌న్‌కు కూడా క‌ష్ట‌మే. అలాగ‌ని ప్ర‌జారాజ్యంలో విఫ‌ల‌మైన కుటుంబ స‌భ్యుల‌కు జ‌న‌సేన ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న కూడా వ‌స్తోంది.

ఎంట్రీకి ఒప్పుకుంటారా?

ముఖ్యంగా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్‌కు, లోపాయికారీగా ఉండే మెగా ఫ్యామిలీకి పొస‌గ‌డం కూడా క‌ష్ట‌మే. ఈ నేప‌థ్యంలో అస‌లు వారి ఎంట్రీనే క‌ష్ట‌మ‌నే టాక్ కూడా న‌డుస్తోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ రాజ‌కీయంగా ఏ మాత్రం ప‌రిణితి లేడ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీలో నియ‌మించిన మూడు నాలుగు పోస్టుల్లో కూడా కాపులే ఉండ‌డంతో ఆ ముద్ర ఇప్ప‌టికే ప‌డిపోయింది. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్లు కూడా జ‌న‌సేన‌లో చేరి వేలు పెట్టేస్తుంటే అది ప‌వ‌న్‌కు ఇంకా మైన‌స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత వ్యూహంపైనే ఆ పార్టీ ఫ్యూచ‌ర్ అంతా ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*