పవన్ బస్సు టార్గెట్ అదేనా ..?

ఏపీలో జనసేన క్యాడర్ ను ఉత్సహపరిచేందుకు లీడర్ పవన్ కళ్యాణ్ బస్సు ఎక్కబోతున్నారు. ఈనెల 15 నుంచి పవన్ ఏపీలోని 13 జిల్లాల్లో చేపట్టనున్న బస్సు యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైందని జనసేన వర్గాల నుంచి సమాచారం. బస్సు యాత్ర విజయవంతానికి కోఆర్డినేటర్ లను ఇప్పటికే జనసేన ఖరారు చేసింది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు లకు రాఘవయ్యను, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం నెల్లూరు జిల్లాలకు భానును, అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు పార్ధసారధి ని ఇప్పటికే పవన్ నియమించారు. ఇక నియోజకవర్గాలవారీగా జిల్లాల వారీగా సబ్ కమిటీలను జనసేన సిద్ధం చేసింది.

గ్రామస్వరాజ్యం స్లోగన్ వెనుక ..?

పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రను గ్రామస్వరాజ్యం పేరుతో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జులై లో పంచాయితీ ఎన్నికల నగారా మోగించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన తన క్యాడర్ ను పటిష్టం చేసుకోవాలంటే గ్రామీణ స్థాయినుంచి తయారు చేసుకోవాలని గుర్తించడంతో బాటు పంచాయితీ ఎన్నికల్లోనూ జనసేన బరిలో నిలిచేలా తన యాత్ర ఉపయోగపడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలో క్యాడర్లో లీడర్లను జనసేన గుర్తించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. గ్రామీణ స్థాయిలో జనసేన బలోపేతం కావాలంటే పికె బస్సు యాత్ర పనికొస్తుందని పార్టీ వ్యూహకర్త దేవ్ దిశా నిర్దేశం చేశారని చెబుతున్నారు.

పవన్ ఎలాంటి విమర్శల దాడి చేస్తారో …?

గుంటూరు సభలో అధికార టిడిపి కి షాక్ ఇచ్చిన పవన్ తన బస్సు యాత్రలో చేసే విమర్శలు ఎలా వుండబోతాయన్న చర్చ బాగా నడుస్తుంది. శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ సమస్యలు, పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా సమస్య, రాజధాని భూములపై పోరాటం, చేనేత కార్మికుల సమస్యలపై గతంలో జనసేనాని స్పందించారు. ఈసారి తన బస్సు యాత్రలో స్థానికంగా ఆయా జిల్లాలు నియోజకవర్గాల్లో వున్న సమస్యలు ప్రస్తావిస్తూ దూసుకుపోవాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తొలుత పాదయాత్ర చేపట్టాలని పవన్ భావించినా అభిమానులతో తంటాలు పడాలిసివస్తుందని బస్సు యాత్రకే మొగ్గుచూపారు. యాత్ర కోసం ఇప్పటికే రెండు స్కా ర్పియో వాహనాలు ,ఒక బస్సును జనసేన కొనుగోలు చేసి సిద్ధం చేసింది. ఇక జనసేనుడు పవన్ రధం ఎక్కి యుద్ధం మొదలు పెట్టడమే ఆలస్యం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*