ఆ ఛాన‌ళ్లపై నిషేధ‌మా.. నియంత్రణా!

మీడియా ఛాన‌ళ్లపై `మెగా` కంట్రోల్ మొద‌లైందా? జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసిన‌ట్లు భావిస్తున్న ఆ నాలుగు మీడియా ఛాన‌ళ్లపై నిషేధం విధించే క్రమంలో మెగా ఫ్యామిలీ తొలి అడుగు నుంచే ప‌డిందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం సినీ ప‌రిశ్రమలో జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా ఇందుకు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. న‌టి శ్రీ‌రెడ్డి ద‌గ్గర మొద‌లైన ఈ వివాదం అనేక మ‌లుపులు తిరుగుతూ చివ‌ర‌కు మీడియా చాన‌ల్స్‌ వ‌ర్సెస్ ప‌వ‌న్‌గా మారింది. మొన్నటివ‌ర‌కూ డైరెక్ట్ గానే వార్ న‌డిచినా.. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా వార్ కంటిన్యూ చేసేస్తున్నారు మెగా హీరోలు. ఇందులో భాగంగానే `నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా` సినిమా ఇంట‌ర్వ్యూకు ఆ ఛాన‌ళ్లను దూరం పెట్టారనే టాక్ సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప‌వ‌న్ చెప్పిన‌ట్టే ఆ నాలుగు ఛాన‌ళ్లను బాయ్‌కాట్ చేస్తున్నారని, దీనిని ఎంత వ‌ర‌కూ కొన‌సాగిస్తార‌నే కొత్త చ‌ర్చ మొద‌లైంది.

ఒకతాటిపైకి వచ్చి…..

కొన్ని మీడియా ఛాన‌ళ్లకు మెగా హీరోల‌కు మ‌ధ్య దూరం పెరుగుతోంది. ముఖ్యంగా తన‌పై కుట్ర చేస్తున్నాయంటూ కొన్ని మీడియా సంస్థల‌ను ప‌వ‌న్ టార్గెట్ చేయ‌డంతో వ్యవ‌హారం మెగా కాంపౌండ్‌కు చేరింది. అంతేగాక వాటిని బాయ్‌కాట్ చేయాల‌ని ప‌వ‌న్ బ‌హిరంగంగానే పిలుపునిచ్చారు. అంతేగాక ఫిల్మ్ ఛాంబర్‌లో పవన్ నిలదీతతో పరిణామాలు వేగంగా మారాయి. అప్పటివ‌ర‌కూ రెండు వ‌ర్గాలుగా ఉన్న మెగా ఫ్యామిలీ ఒక్క తాటిపైకి వచ్చింది. అక్కణ్ణుంచి వివాదం కొత్త మలుపు తీసుకుంది. మీడియా విష‌యంలో ఎలా వ్యవ‌హ‌రించాల‌న్న అంశంపై మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత‌న ఇత‌ర‌ సినీ హీరోలు సమావేశ‌మ‌వ్వడం.. అందులో భాగంగా కొన్ని సంస్థల‌పై ఇండస్ట్రీ నిషేధం విధించాల‌ని అందులో నిర్ణయించిన‌ట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇది నిజం కాద‌ని ప‌లువురు చెప్పినా.. చివ‌ర‌కు ప‌వ‌న్ మాట‌నే వీరంతా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

కొన్ని ఛానళ్లకు ఇవ్వకుండా….

మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` టీమ్ ఇంటర్వ్యూ కొన్ని ఛానళ్లకు ఇవ్వక‌పోవ‌డం చ‌ర్చనీయంశంగా మారింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, దర్శకుడు వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ఒక ఇంటర్వ్యూ రికార్డు చేశారు. ప‌వ‌న్ బాయ్‌కాట్‌ చేయమని పిలుపు ఇచ్చిన నాలుగు ఛానళ్లకు తప్ప మిగతా అన్ని ఛానళ్లకు ఆ ఇంటర్వ్యూ పంపారు. అన్నింటికీ పంపి ఆ ఛాన‌ళ్లకే ఎందుకు పంప‌లేద‌నే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణకు తీసుకుంటున్న, తీసుకోబోయే చర్యలు వివరించడానికి ఇటీవల అధికార ప్రతినిధులుగా నియమితులైన సభ్యుల్లో కొంతమంది ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అందులో మీడియా నియంత్రణ‌పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ జెమిని కిరణ్ స్పందించారు.

ఇది ఆ సినిమాకేనా?

`తమ కంటెంట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారనేది నిర్మాతల ఇష్టమని, రెండు మూడు ఛానళ్లకు ప్రకటనలు ఇచ్చి మిగతా ఛానళ్లకు ఇవ్వనప్పుడు ఈ విధంగా ఎందుకు అడగలేద‌`ని ఎదురు ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ కోసమే ఇదంతా చేయ‌డం లేద‌ని, మెగా ఫ్యామిలీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అని తెలిపారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహానటి సినిమా ఈవెంట్స్ అన్ని ఛానళ్లకు లైవ్ ఇచ్చార‌ని గుర్తు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, హీరోలు మీటింగుల్లో ఏం మాట్లాడుకున్నారనే విష‌య‌ల‌ను చెప్పాల్సిన సమయంలో చెబుతామన్నారు. రెగ్యులర్ ప్రెస్‌మీట్స్ అన్ని ఛానళ్లకు ఇచ్చి, స్పెషల్ ఇంటర్వ్యూల విషయంలో నాలుగు ఛానళ్లను పక్కన పెట్టాలనేది ఇండస్ట్రీ నిర్ణయంగా కనిపిస్తోందంటున్నారు సినీ ప్రముఖులు. ఇది కేవ‌లం ఒక్క బ‌న్నీ సినిమాకేనా త‌ర్వాత రాబోయే సినిమాల‌కు నియంత్రణ పరిమితం అవుతుందా? అనేది వేచిచూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*