నా టార్గెట్ చంద్రబాబే…!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకాస్త దూకుడు పెంచారు. ఇప్పటి వరకూ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ నేరుగా ముఖ్యమంత్రిపైనే అవినీతి విమర్శలు చేయడం విశేషం. పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ పోరాట యాత్రకు జన స్పందన బాగా ఉంది. అంతేకాదు జనసేనలో కూడా చేరికలు మొదలయ్యాయి. విశాఖ జిల్లాలోని గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేన పార్టీలో చేరారు.

చంద్రబాబుపైనే…..

అయితే పవన్ తన దాడిని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ప్రారంభించడం విశేషం. విశాఖ భూ కుంభకోణం ప్రస్తావనను పవన్ తీసుకొచ్చారు. విశాఖలో భూకుంభకోణాలకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. విశాఖలో వేలాది ఎకరాలను కైంకర్యం చేశారన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నేతల పేర్లున్నా వాటిని బయటపెట్పేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదన్నారు. సిట్ దర్యాప్తు పూర్తయి నివేదిక ఇచ్చినప్పటికీ ఎందుకు దానిని బహిర్గతం చేయలేదని పవన్ ప్రశ్నించడం విశేషం.

భూకుంభకోణంలో…..

విశాఖ భూకుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర ఉందని పవన్ స్పష్టం చేశారు. అందుకే నివేదికను బయటపెట్టడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ఏపీ ప్రజలను వంచిస్తున్నారనడానికి మరో ఉదాహరణ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల జోకులేనన్నారు. ఐదు కేజీల బరువు తగ్గడానికి ఆమరణ దీక్ష చేస్తారా? విశాఖ రైల్వే జోన్ లేదు ఏమీ లేదని మరో ఎంపీ అంటారా? వీరి చిత్తశుద్ధి ఏంటో అందరికీ వారి వ్యాఖ్యల ద్వారానే అర్థమయిందన్నారు పవన్.

జగన్ ను నమ్మొద్దు……

ప్రతిపక్ష నేత జగన్ పైనా పరోక్షంగా విమర్శలు చేశారు పవన్. ఒకాయన అధికారంలోకి వస్తే అన్నీ చేస్తానని చెబుతున్నారని, అవన్నీ బూటకపు మాటలేనన్నారు. అధికారం కోసమే అలివికాని హామీలు ఇస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్లు ప్రజాసమస్యలను పట్టించుకోరన్నారు. ప్రజాసమస్యలను పట్టించుకునేవారికే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ టీడీపీనేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న పవన్ నేరుగా చంద్రబాబు పై చేయడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*