
అవును! నెటిజన్లు ప్రశ్నిస్తున్న ప్రధాన విషయం ఇదే! తన మాటలకు ప్రభుత్వం విలువ ఇస్తుందని, హుటా హుటిన తరలి వస్తుందని భావించిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు సర్కారు మొండి చేయి చూపింది. ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లేని వారితో జనసేనాని విషయంపై స్పందించిలా చంద్రబాబు వెనుక ఉండి డైరెక్షన్ చేశారు. ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర ప్రారంభించిన పవన్.. అక్కడ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. ఇప్పటికైనా పరిష్కరించాలని పవన్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు.
ప్రభుత్వానికి గడువు పెట్టి…..
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చాడు. కృష్ణా, గోదావరి పుష్కరాలకు రెండు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలు పడుతున్న అవస్థలు కనిపించడం లేదాని ప్రశ్నించాడు. అదే సమయంలో చంద్రబాబు చేస్తున్న వృథా ఖర్చుకు అంతుపంతు లేకుండా పోతోందని చెప్పుకొచ్చాడు. వివిధ రూపాల్లో ప్రభుత్వ సొమ్మును ధర్మ పోరాటాలు, పోలవరం సందర్శన పేరుతో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారని, అయితే, కిడ్నీ సంబంధిత సమస్య, తాగునీరు సమస్యలను పరిష్కరించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శించాడు పవన్. ఈ క్రమంలోనే ప్రభుత్వం గడువు ఇచ్చి .. వెంటనే స్పందించాలని కోరారు.
అచ్చెన్నను రంగంలోకి దింపి…..
అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం లైట్‌గా తీసుకుంది., ప్రస్తుతం పవన్‌కు, బాబుకు చెడిన నేపథ్యంలో ఆయన మాటలకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకులే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోపక్క, ప్రభుత్వం కూడా పవన్ దీక్ష చేస్తోన్న శ్రీకాకుళం జిల్లాకే చెందిన మంత్రి అచ్చన్నాయుడిని రంగంలోకి దింపి పవన్‌పై ఎదురు దాడి చేయించింది. ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారని, తాము కూడా ప్రజల పక్షాన శ్రీకాకుళానికి ఎంత చేయాలో అంత చేస్తున్నామని, ఈ విషయంలో గడువులు కేవలం గందరగోళాన్ని సృష్టించేందుకు మాత్రమేనని విమర్శించారు.
ప్రభుత్వం లొంగకపోవడంతో…..
దేశంలో కిడ్నీ రోగులకు పింఛన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. సో.. మొత్తంగా పవన్ పెట్టిన గడువుకు ప్రభుత్వం లొంగలేదు. దీంతో పవన్ శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు దీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ.. చంద్రబాబు ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. పైగా పట్టించుకోవాల్సిన అవసరం కూడాలేదని అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పవన్ వేసే తదుపరి అడుగు.. చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేదిగా ఉండాలని ఆయన అభిమానులు కోరుతుండడం గమనార్హం.
Leave a Reply