బంగారమూ…బహుపరాక్

అభిమానం కొంపలు ముంచేస్తోంది. అనవసర హడావిడి, హంగామా, వార్తలను తప్పుదారి పట్టించడం, మార్పులు చేర్పులు చేయడం అభిమానం అనిపించుకోదు. అసలు వార్తలకు కల్పనలు జోడించడం మొదటికే మోసం తెస్తుంది. పార్టీకే ఎసరు పెడుతుంది. నాయకునికి నగుబాటు తెస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జనసైనికులు చాలా బిజీగా ఉన్నారు. తమ నేత పవన్ కల్యాణ్ పై ఈగవాలనివ్వడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఏ ప్రసార మాధ్యమాలు వాటికి ప్రాముఖ్యం ఇచ్చినా సహించేట్లు కనిపించడం లేదు. వారి అంతుచూడాలన్నంత కసి వారిలో తొంగి చూస్తోంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీకి ఇదో పెనుప్రమాదంలా పరిణమిస్తోంది. అప్రమత్తం కాకపోతే అరాచకత్వం అధినేతకు తలనొప్పులు కల్పించవచ్చు. ఒక సినీ నటునిగా పవన్ పై అభిమానం చూపడం వేరు. కటౌట్లకు పాలాభిషేకాలు చేయవచ్చు. రక్త తిలకాలు దిద్దవచ్చు. సమీప హీరోని దుమ్మెత్తి పోయవచ్చు. అదంతా ఫ్యాన్స్ కే పరిమితం. వాళ్ల కొట్లాటలూ పరిమిత సర్కిల్ లో కుదించుకుపోతాయి. కానీ రాజకీయ పార్టీ విషయానికొచ్చేసరికి విస్తృత ప్రజాశ్రేణులతో ముడి పడి ఉంటుంది. ఆపార్టీకి చెందిన ఒక చిన్ననేత చేసిన పొరపాటు పార్టీమొత్తంపై ప్రభావం చూపుతుంది. ఈ తేడాను జనసైనికులు ఇంకా గుర్తించడం లేదు.

ఫ్యాన్స్.. పార్టీ…

జనసేన ఇంకా ఒక రాజకీయ పార్టీగా రూపు సంతరించుకోలేదు. అభిమానులే అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఏవో కొందరు అధికారప్రతినిధులు, అక్కడక్కడా అడపాదడపా కార్యకలాపాలు తప్ప రాజకీయ క్రియాశీలత కనిపించడం లేదు. తన ట్విట్టర్ లో చేసే వ్యాఖ్యలు, అవి సృష్టించే సంచలనం మీడియాకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో యాక్టివిటీ కరవు అవుతోంది. వామపక్షాలతో కలిసి జనసేన ఒకటి రెండుకార్యక్రమాల్లో భాగస్వామిగా మాత్రమే పాల్గొంది. తనంతతానుగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. చిత్తూరు, గుంటూరు వంటి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పెట్టుకున్న పర్యటనలు వాయిదా పడ్డాయి. సంఘ వ్యతిరేక శక్తులు చొరబడే ప్రమాదం ఉందని అనుమానించి కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లుగా జనసేన ప్రకటించింది. అనుమానాలు , సందేహాలకే రాజకీయ కార్యకలాపాలు, ఆందోళనలను వాయిదా వేసుకుంటూ పోతే ఒక్క కార్యక్రమం చేపట్టడం కూడా సాధ్యం కాదు. దీనిని పార్టీ గుర్తించి నిర్దిష్టమైన నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి పూనుకోకపోతే ట్విట్టర్ రూపంలో పార్టీ పొట్టిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. అభిమానులు పార్టీకి అండగా ఉంటే మంచిదే. వారిని రాజకీయ కార్యకర్తలుగా, నాయకులుగా మార్చడం అంత సులభం కాదు. తమ హీరోని చూస్తే చాలు పూనకం వచ్చినట్లు ప్రవర్తించే ఫ్యాన్స్ పార్టీకి నష్టం చేస్తున్నారనేది ఇప్పటికే రుజువైంది. తమ నాయకుడిపై ఎవరేని ఒక వ్యాఖ్య చేస్తే చాలు ఏదో ఉపద్రవాన్ని ఊహించుకుంటూ కౌంటర్లతో రెచ్చిపోతున్నారు. అవసరమైతే కృత్రిమంగా కొన్ని వీడియోలు సృష్టించి మార్ఫింగ్ చేసేందుకు పూనుకుంటున్నారు. ఇది పార్టీకి తీవ్రమైన డ్యామేజీ చేస్తోంది. అధినాయకుడైన పవన్ జవాబుదారీగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కత్తి ..శ్రీ ..ఉదంతాలే గుణపాఠం…

కత్తి మహేశ్, శ్రీ రెడ్డి ఉదంతాలు జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్ కు గుణపాఠాలుగా చెప్పుకోవాలి. సినీ విమర్శకునిగా ఉన్న కత్తి మహేశ్ కు ఈరోజున ఇంత పాప్యులారిటీ రావడానికి పవన్ అభిమానులే కారణం. రాజకీయ అంశాలు మొదలు సామాజిక పరిణామాల వరకూ మహేశ్ ను ఈరోజున మీడియా వాడేసుకుంటోంది. దానికి ప్రధాన కారణం అతనికున్న రేటింగు. ఆ రేటింగు రావడానికి ముఖ్య పాత్రధారులు పవన్ అభిమానులు. అతనేదో పవన్ కు సంబంధించి ఒక ట్వీట్ చేస్తేనో, ఒక చర్చలో వ్యాఖ్య చేస్తేనో దానిని సీరియస్ గా తీసుకుని అతని రేటింగు పెంచేశారు. మసాలా జోడించారు. పవన్ పేరు చెబితే పాజిటివ్, నెగటివ్ ఏదైనా ఫర్వాలేదు ప్రజలు చూస్తారనే కోణంలో మీడియా కత్తి ని సాకుగా చేసుకుంటూ రోజులతరబడి చర్చలు, సంవాదాలు నిర్వహించింది. అంతిమంగా నష్టపోయింది పవన్. టీవీ చర్చల్లో ఎదిగిపోయింది మహేశ్. అలాగే శ్రీరెడ్డి ఉదంతంలో సైతం అభిమానులు అతి చేశారు. పవన్ స్పందించకుండా ఉంటే సరిపోయేది. దారినపోయే విషయాన్ని తలకు చుట్టుకున్నట్లయింది. మీడియాకు వ్యతిరేకంగా మారాల్సి వచ్చింది. రాజకీయ నాయకులకు ప్రధానంగా ఉండాల్సిన సంయమనం , వ్యూహం, సందర్భోచిత ఎత్తుగడలు నాయకునితోపాటు జనసైనికులకూ కరవయ్యాయి. ఫలితంగా బలమైన మాధ్యమాలు ప్రతికూలంగా మారాయి.

కరివేపాకు కథనాలు…

మీడియాకు ఒక సహజ లక్షణం ఉంది. ఆరోజు ఏం నడుస్తుందన్న అంశమే చూసుకుంటుంది. దానిని ఫాలో అయిపోతుంది. రాజకీయనాయకులు, సెలబ్రిటీలు ఎవరైనా సరే కరివేపాకు పాత్రకే పరిమితమవుతారు. తమ పని ముగిసిన తర్వాత తీసి పాడేస్తుంది మీడియా. ఈరోజున శ్రీరెడ్డి మళ్లీ మీడియాలో కనిపించకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించుకుంటే తత్వం బోధ పడుతుంది. శ్రీ రెడ్డి ప్రేక్షకుల్లో పాత పడిపోయింది. వ్యూయర్ షిప్ రేటింగు కోల్పోయింది. అందువల్ల మీడియాకు ఆమెతో పని తీరిపోయింది. పక్కనపెట్టేసింది. ఆమె లేవనెత్తిన అంశాలపైన మీడియాకు ఆసక్తి ఏమీ లేదు. శ్రీ రెడ్డి అనే స్టోరీని వారం పాటు ఉత్కంఠ భరితంగా నడిపి పీక్ రేటింగు సాధించడంపైనే దృష్టి పెట్టారు. ఆమె లేవనెత్తే అంశానికి ఉండే ఉద్వేగం, పవన్ అనే మాస్ స్టార్ కుండే రేటింగుతో ముడిపెట్టి టీవీ చానళ్లు యాగీ చేశాయి. సంయమనం కోల్పోయిన జనసేనాని మీడియా వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా తొందరపడ్డారు. క్షణభంగురమైన సంచలనాలను నమ్ముకునే మాధ్యమాలు అంతే తొందరగా ఆ ఇష్యూలను గాలికొదిలేస్తాయి. ఒక రాజకీయ పార్టీగా మీడియాను అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిషేధాల వరకూ వెళ్లాల్సిన అవసరమూ లేదు. వేటిని ఎంతవరకూ ప్రోత్సహించాలో, నియంత్రించాలో తెలుసుకునే కామన్సెన్స్ ఉంటే చాలు. పరిధులు, పరిమితులు దాటడం రాజకీయ ఔచిత్యం కాదు. అందులోనూ జనసేనాని స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేస్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చే అభిమాన హనుమంతులు తమ పర భేదం లేకుండా చర్యలకు దిగే ప్రమాదం ఉంది. ఇది జనసేన నిర్మాణానికి ఆటంకంగా పరిణమిస్తుంది. ప్రజల్లో పార్టీ పట్ల సీరియస్ థృక్పథం పోతుంది. అందువల్ల మీడియాను చూసి కంగారు పడకుండా తన పార్టీ యాక్టివిటీస్ పై దృష్టి సారిస్తేనే జనసేనకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*