ఇద్దరిదీ ఒకే రూటు…!

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ ఒకే రూట్లో ప్రయాణం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో మూడో వంతు పూర్తి చేశారు. రెండు వేల కిలోమీటర్లకు చేరువలో ఉన్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేయాల్సి ఉంది. మొత్తం 13 జిల్లాల్లో ఈ పాదయాత్ర సాగాల్సి ఉండగా ఇప్పటికే ఎనిమిది జిల్లాలను పూర్తి చేసుకున్నారు జగన్. జగన్ వచ్చే ఎన్నికలకు పూర్తిగా రెడీ అయిపోయారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్న తర్వాత పాదయాత్రకు ప్లాన్ చేశారు జగన్.

పీకే టీంతో సర్వేలు….ఒంటరిగానే….

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రెండు దఫాలు సర్వే పూర్తి చేసి నివేదికలను కూడా సిద్ధం చేసింది. గెలిచే అవకాశాలున్న ఇద్దరు అభ్యర్థుల జాబితాను జగన్ కు అందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలలోపు మరో మూడుదఫాలు ఈ టీం సర్వేలు చేస్తుంది. పక్కాగా గెలిచే అవకాశమున్న వాళ్లకే టిక్కెట్లు ఇవ్వనున్నారు. జగన్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఒంటరిగానే బరిలోకి దిగనుంది.బీజేపీతో పొత్తు వార్తలను ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఖండించారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి కూడా ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

పార్టీకి నేతలు లేకున్నా…..

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించి నాలుగేళ్లు అవుతున్నా పార్టీని పటిష్టం చేయడానికి నియోజకవర్గాల వారీగా క్యాడర్ ను నియమించలేదు. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం,బీజేపీకి మద్దతుగా నిలిచిన పవన్ ఈసారి ఒంటరిగానే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా స్పష్టం చేశారు. అయితే వామపక్షాలతో కలసి పోటీ చేస్తారా? లేక ఒంటరిగానే పోటీ చేస్తారా? అన్నది పవన్ క్లారిటీ ఇవ్వలేదు. జనసేనతో కలిసే వామపక్షాలు పోటీకి దిగుతాయని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దేవ్ రాకతో….

అంతేకాకుండా జగన్ లాగానే పవన్ కల్యాణ్ కూడా తనకు ఒక వ్యూహకర్తను నియమించుకున్నారు. దేవ్ ను తన ఎన్నికల వ్యూహకర్త అని ఆయన ప్రకటించారు. గతంలో బీజేపీలో పనిచేసినట్లు దేవ్ పై ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆయన సలహాలు, సూచనలు పార్టీకి మంచి చేస్తాయని పవన్ విశ్వసిస్తున్నారు. ఆయనకు దాదాపు 1200 మందితో కూడిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీమ్ ను పవన్ అప్పగించారు. ఈ టీమ్ అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సర్వేలు చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు దేవ్ సూచనల మేరకే తర్వలో పవన్ బస్సు యాత్రను కూడా ప్లాన్ చేస్తన్నారు. ఇలా జగన్, పవన్ ఒకే రూట్లో పయనిస్తున్నారన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*