వారి ఆప్షన్ జనసేన మాత్రమే…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఒంట‌రిగా పోటీచేస్తారా ? లేక ఎవ‌రితోనైనా జ‌త క‌డ‌తారా ? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌ప‌క్క సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టిసారిస్తూనే.. మ‌రోప‌క్క పొత్తుల‌పైనా స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మూడు ప్ర‌ధాన పార్టీల కంటే ప‌వ‌న్‌.. వామ‌ప‌క్షాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వ‌స్తున్నాయి. వాళ్ల‌తో చ‌ర్చించి ప్ర‌తి అడుగు వేస్తున్నారు. అయితే వామ‌పక్షాల‌తో క‌ల‌సి ప్ర‌యాణించ‌డం వ‌ల్ల ప‌వన్‌కు వ‌చ్చే లాభం కంటే సీపీఐ, సీపీఎంకే అంతో ఇంతో ల‌బ్ధి చేకూరుతుంద‌నే చ‌ర్చ మొద‌లైంది.

వామపక్షాలకు క్షేత్రస్థాయిలో…..

ఒక‌వేళ వామ‌ప‌క్షాల‌ను వ‌ద్ద‌నుకుని ముందుకెళితే మాత్రం.. ప‌వ‌న్‌కు గడ్డు రోజులు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు స్ప‌ష్టంచేస్తున్నారు. అందుకు స‌రైన కార‌ణాలు కూడా లేక‌పోలేద‌ట‌.. అవేంటంటే.. జ‌న‌సేన స్థాపించి నాలుగేళ్ల‌యినా ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ మిన‌హా పార్టీ నాయ‌కులెవరూ ఇంత వ‌ర‌కూ లేనేలేరు. అంతేగాక కొంత‌మందిని ప‌వ‌న్ నియ‌మించుకున్నా వీరు.. సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మ‌వుతున్నారు. త‌న చ‌రిష్మాతోనే నాలుగేళ్లుగా ఒంటి చేత్తో పార్టీని లాక్కొస్తున్నాడు ప‌వ‌న్‌. మ‌రి ఎన్నిక‌ల్లో పోటీచేయాలంటే అందులోనూ 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ ప‌డాలంటే అందుకు త‌గిన క్యాడ‌ర్ చాలా అవ‌స‌రం. మ‌రి ప‌వ‌న్‌కు పార్టీ ప‌రంగా ప్ర‌స్తుతం ఉన్న స్టామినా చూస్తే షాకే అవ్వాల్సిందే.

రాష్ట్ర కమిటీకే దిక్కులేదు…..

ఇప్పటిదాకా రాష్ట్ర కమిటీకే జనసేన పార్టీలో అతీగతీ లేదు. ఈ నేప‌థ్యంలో సరికొత్త పంచాయతీలను చక్కబెట్టుకుంటూ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, కిందిస్థాయిలో బూత్ కమిటీ వరకు వారు సంస్థాగత నిర్మాణం చేపట్టడం అనేది అంత సులభమూ కాదు. ప‌వ‌న్ నిర్వ‌హించే స‌మావేశాల‌కు అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చినా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్ప‌డం కష్ట‌మైన‌దే! ఇప్ప‌టికే సంస్థాగ‌త క‌మిటీలు లేకుండానే లుక‌లుక‌లు స్టార్ట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ సొంతంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థుల‌ను పోటీ పెట్టడం అంటే అది హాస్యాస్ప‌ద‌మే అవుతుంది.

లెఫ్ట్ క్యాడర్ తోనే….

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోక త‌ప్పింది కాద‌ని విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు. వామ‌పక్షాల‌కు రాష్ట్రంలో అంతోఇంతో క్యాడ‌ర్ ఉంది. వీరికి ప‌వ‌న్ తోడ‌యితే ఇరు పార్టీల‌కు కొంత ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు. అందుకే ఈసారి వామపక్షాలకు ఉన్న నెట్ వర్క్ ను వాడుకుని.. ఎన్నిక‌ల్లో పోటీకి దిగాల‌ని చూస్తున్నారట‌. `మేం ఏపీలో 175 స్థానాల్లోనూ పోటీచేయబోతున్నాం` అని ప‌వ‌న్ చెప్ప‌డం వెనుక ఉద్దేశం.. జనసేన.. వాపక్షాలతో కలిసిన కూటమి అన్నిస్థానాలకు పోటీచేస్తుందని మాత్రమే అని పలువురు విశ్లేషిస్తున్నారు. పవన్ ప్రకటన తర్వాత కొన్నిరోజులకు సీపీఐ రామకృష్ణ.. తాము కూటమిగా పోటీచేయనున్నట్లు చేసిన ప్రకటన గురించి పవన్ ప్రమేయం లేకుండా చేసిన ప్రకటనగా కొన్ని వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. అది కూడా నిజం కాదని.. ఇరువురి ప్రకటన భావం ఒకటే అని.. కూటమిగానే అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వామ పక్షాలకు లాభమే…..

జనసేనతో కలిసి పోటీచేయడం వల్ల‌ వామపక్షాలకు లాభం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం రాష్ట్రంలో ఒకటిరెండు స్థానాల్లో అయినా వారు ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ వామపక్షాల సాయం లేకపోతే పవన్ కల్యాణ్ కుమాత్రం గడ్డు రోజులు తప్పవు అని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస‌వంగా చూస్తే ఏపీలో 2009 నుంచే వామ‌ప‌క్షాల ప‌త‌నం స్టార్ట్ అయ్యింది. తెలంగాణ‌లో వామ‌ప‌క్షాలు సొంతంగా ఒక‌టో రెండు సీట్లు గెలుచుకుని తాము కూడా అసెంబ్లీలో ఉన్నాం అని అనిపించుకుంటున్నాయే త‌ప్ప ఏపీలో ఆ పార్టీల‌కు ప‌దేళ్లుగా ప్రాథినిత్య‌మే లేదు. దీనిని బ‌ట్టి ఇక్క‌డ ఆ పార్టీలు ఎంత ప‌త‌నావ‌స్థ‌కు చేరుకున్నాయో ? తెలుస్తోంది.

జోష్ ఉన్న పార్టీతో……

ఈ టైంలో ఇప్పుడు ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీల‌కు జ‌న‌సేన లాంటి జోష్ ఉన్న పార్టీల‌తో వెళ్ల‌డ‌మే బెస్ట్ ఆప్ష‌న్‌. అందుకే వాళ్లు ప‌వ‌న్‌తో పొత్తు కోసం ఎంత‌గానో త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అయితే ప‌వ‌న్ తీరుపై మాత్రం వామ‌ప‌క్షాల నేత‌లు కొంత అనుమానంతో ఉన్నార‌ట‌. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఒక స్థాయిలో ఉద్యమిస్తున్నాయి. వీటిలో మాత్రం పవన్ భాగం పంచుకోవడం లేదు. కేంద్రాన్ని ఇరుకున పెట్టే పెట్రో ధరల పెంపు వంటివి పట్టించుకోవడం లేదు. మరి ఇలాంటి అనుమానాలు ముదిరితే.. వీరి కూటమి బంధం ఎంతదూరం మనగలుగుతుందో వేచిచూడాల్సిందే!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*