పవన్ పై సర్కార్ కత్తికట్టిందా …?

ఆయన వస్తే రెడ్ కార్పెట్…. మాట్లాడితే జేజేలు… చెప్పిన పని అల్లా చేయడమే తమ ధ్యేయం. ఇలా ఎలాంటి పదవి లేకపోయినా జనసేన అధినేత పవన్ కు మోకరిల్లింది తెలుగుదేశం ప్రభుత్వం. కట్ చేస్తే గుంటూరు సభ తరువాత సీన్ పూర్తిగా మారింది. పవన్ తనకు కేటాయించిన పోలీస్ సెక్యూరిటీని నిఘాకు వినియోగిస్తున్నట్లు గుర్తించి తిప్పి పంపారు. నాకు మీరిచ్చే భద్రత అవసరం లేదన్నారు. ఆ తరువాత ప్రజా పోరాట యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. ఇప్పుడు సర్కార్ పవన్ సభకు అరకొర బందోబస్తు ఏర్పాటు చేసింది. అదుపు చేయలేని అభిమానుల నడుమ పవన్ పోరాట యాత్ర భద్రత లేకుండా సాగుతుంది. దీనిపై జనసేన ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత …

ప్రజాక్షేత్రంలోకి దిగిన పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయి భద్రత ఎందుకు కల్పించడం లేదని జనసేన ప్రశ్నిస్తుంది. తమ నేతకు ఏమి జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తుంది. ఇచ్ఛాపురం లో కానీ ఇతర ప్రాంతాల్లో జనసేనాని తలపెట్టిన కార్యక్రమాల్లో అనేక చోట్ల ఘర్షణలు, గందరగోళం. ఆయన కవాతు కార్యక్రమంలో పవన్ పై దూసుకొస్తున్న అభిమానులను అదుపు చేయడం జనసైనికులకు సాధ్యం కావడం లేదు. పోలీస్ బందోబస్తు అయితే ప్రత్యేకంగా ఉంటుంది. టిడిపి కి మద్దతుగా ఉన్నంత కాలం జెడ్ క్యాటగిరి తరహాలో భద్రత కల్పించి ఇప్పుడు ఒక ఎమ్యెల్యే కు ఉండే భద్రత కూడా ఏర్పాటు చేయకపోవడంతో పవన్ అభిమానులు రగిలిపోతున్నారు.

ఇస్తే వద్దు పొమ్మన్నారుగా …

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ స్పందించినప్పటికీ టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భద్రత కల్పిస్తే వద్దు పొమ్మన్నది వారే నని తిరిగి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలకోసం అల్లరి చేస్తుంది వారే నంటూ విమర్శిస్తున్నారు. భద్రత విషయంలో పవన్ కి క్లారిటీ లేదని ఎదురుదాడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం సమయం దగ్గర పడటంతో ఇక ప్రతి అంశం వివాదంగానే మారేలా వుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*