అజ్ఙాతవాసి ఆపద్భాందవుడయ్యాడే….!

పవన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదు. ప్రజారాజ్యం వాసనలు జనసేనలో ఉండవని, అందరినీ కొత్త వారిని, నవతరానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన పవన్ అచ్చు పొలిటికల్ లీడర్ లా మారిపోయారు. జనసేన పార్టీ పెట్టినప్పుడే తాను ప్రశ్నించేందుకే వచ్చానన్నారు. అధికారం కోసం కాదని, ప్రజల గొంతుకగా మారతానని పవన్ పదే పదే చెప్పారు. పార్టీలో కూడా కొత్త వాళ్లకే చోటు ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లోకి యువత రావాలని గట్టిగానే పిలుపునిచ్చారు. ఇంకేముంది పవన్ యువతరానికి, నవ నాయకత్వానికి పెద్ద పీట వేస్తారని అందరూ భావించారు.

మాటలన్నీ ఉత్తుత్తివేనా?

అయితే తాజా పరిస్థితులను చూస్తుంటే పవన్ కల్యాణ్ గతంలో చెప్పిన మాటలు ఉత్తుత్తివేనన్నది తేలిపోయింది. తొలుత జనసేన కార్యకర్తల ఎంపిక విన్నూత్నంగా జరిపారు. ఆన్ లైన్లో అప్లికేషన్లు తీసుకుని, వాళ్లకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి జనసేనకు కార్పొరేట్ సంస్థ లుక్ తెచ్చారు. జనసేన కార్యకర్తల్లో నుంచే లీడర్లుగా ఎదుగుతారని పవన్ చెప్పడంతో పవన్ అభిమానులు జనసేనలో చేరేందుకు క్యూ కట్టారు. చొక్కాలు చింపుకుని మరీ పవన్ వెంట నడిచారు. కాని ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని జనసేనలోకి చేర్చుకునేందుకు సిద్ధమయినట్లు కన్పిస్తోంది.

ఆయన చేరిన తర్వాతే….

కాంగ్రెస్ లో దశాబ్దాలపాటు కొనసాగిన మాదాసు గంగాధరాన్ని పార్టీలోకి చేర్చుకుని పవన్ తన పక్కన పెట్టుకున్నారు. ఆయన కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం కొనసాగారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ నేత వచ్చిన తర్వాత పార్టీ రూపురేఖలు, పవన్ ఆలోచనలు మారిపోయాయంటున్నారు. అందుకే ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు పవన్ సిద్ధమయ్యారు. విశాఖ జిల్లాలో ఇటువంటి సంఘటనే జరిగింది. విశాఖలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యకు జనసేన కండువాను కప్పేశారు. చింతలపూడి వెంకట్రామయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

మూడు పార్టీలు మారిన నేతను…..

ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలపడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చింతలపూడి వెంకట్రామయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. మూడు పార్టీలను మారిన నేతను జనసేనలో చేర్చుకోవడంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఆలోచనలకు, తన అభిప్రాయాలకు చాలా తేడా ఉందని చెప్పే పవర్ స్టార్ అలాంటిదేమీ లేదని తేల్చేశారు. అందుకే పవన్ పక్కా పొలిటీషియన్ గా మారాడని, రానున్నకాలంలో ఇతర పార్టీల నుంచి కూడా జనసేనలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనిచెబుతున్నారు. మరి నవతరం, యువతరం మాటేమిటో ఆయనకే తెలియాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*