అన్న అదృష్టం త‌మ్ముడికి క‌లిసొస్తుందా!

ఒక నియోజ‌క‌వ‌ర్గమా లేక రెండు నియోజ‌క‌వ‌ర్గాలా? ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ.. రెండో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే ఆలోచ‌నే లేదు అని ఒక‌సారి.. కాదు కాదు రెండింటి నుంచి పోటీ ఈసారి ప‌క్కా అని మ‌రోసారి!! ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? అదేనండీ… జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కడి నుంచి బ‌రిలోకి దిగుతారో.. ఎన్ని నియోజక‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తార‌నే అంశంపై ఎడ‌తెగ‌ని చ‌ర్చ విప‌రీతంగా జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని జ‌న‌సేనాని ఇప్పటికే ప్రక‌టించేశారు.

పక్కా ప్రణాళికతో…

ఒక ప్రణాళిక‌తో ఎన్నిక‌ల ముందుకు వెళుతున్న ఆయ‌న‌.. ఎక్కడి నుంచి పోటీచేస్తార‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వక‌పోవ‌డంతో అభిమానుల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. గ‌తంలో అనంత‌పురం నుంచి పోటీచేస్తాన‌ని ప్రక‌టించిన ప‌వ‌న్‌.. ఇప్పుడు తిరుప‌తి నుంచి కూడా బ‌రిలోకి దిగాల‌ని నిర్ణయించుకున్నార‌ని తెలుస్తోంది. స‌స్పెన్స్‌కు తెర‌ప‌డిందా? ఒక నియోజ‌క‌వ‌ర్గం కాదు రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ అని తేలిపోయిందా? అన్న సెంటిమెంట్ త‌న‌కూ క‌ల‌సి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ డిసైడైపోయారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

ఎక్కడి నుంచి పోటీకి…..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కడి నుంచి బ‌రిలోకి దిగుతార‌నే అంశంపై కొన్ని రోజులుగా ఎడ‌తెగ‌ని చర్చ జ‌రుగుతోంది. తాను అనంత పురం నుంచి పోటీ చేస్తాన‌ని జ‌న‌సేనాని ప్రక‌టించేశాడు. అయితే జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేస్తాడ‌నే విష‌యం మాత్రం ఇంత వ‌ర‌కూ చెప్పలేదు. ఎన్నిక‌లు ద‌గ్గర‌పడుతున్న కొద్దీ అభిమానుల్లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. ప‌వ‌న్ తిరుప‌తి నుంచి కూడా బ‌రిలోకి దిగుతాడ‌నే ప్రచారం జోరందుకుంది. సెంటిమెంట్ ప్రకారం మెగా ఫ్యామిలీకి తిరుప‌తి క‌లిసొస్తుంద‌ని ప‌వ‌న్ అభిమానులు స్పష్టంచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు పార్టీ నాయ‌కులు.

రెండు స్థానాల్లో…..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అనంతపురం టౌన్ నుంచి పోటీ చేయాలనుకున్న పవన్ .. ఆధ్యాత్మిక న‌గ‌రి తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచనలు ఇవ్వడమే కాకుండా తనను గెలిపించే బాధ్యత పార్టీ శ్రేణులే తీసుకోవాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు ప‌వ‌న్‌. తాను నిలబడే ప్రాంతంలో భారీ మెజారిటీతో గెలవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అందుకే అన్న చిరంజీవి తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న తిరుపతినే ఎంచుకున్నారు.

భారీ మెజారిటీ వస్తుందన్న నమ్మకంతో…..

2009లో చిరంజీవి.. పాల‌కొల్లు, తిరుప‌తి నుంచి పోటీచేసిన విష‌యం తెలిసిందే. ఇందులో సొంత నియోజ‌క‌వ‌ర్గమైన పాలకొల్లులో ఆయ‌న ఓడిపోగా.. తిరుప‌తి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. పవన్ తిరుపతిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం కూడా ఉందంటున్నారు జనసేన నేతలు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే తిరుపతిలో నిలబడితే క‌చ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానన్నది పవన్ నమ్మకం. ఇటు అన్న గెలిచిన సెంటిమెంట్ ఎలాగూ ఉంది. ఒకవైపు సినీ నటుడిగా తనకున్న చరిష్మా, మరోవైపు కాపు కులంతో ఓట్లు బాగా పడతాయన్న ధీమాతో ఉన్నారట‌. ఒకవేళ పవన్ కళ్యాణ్‌ తిరుపతిలో నిలబడితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిచే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*