ఎర్ర కండువాతో పవన్ కి మేలేనా..?

pawan-kalyan-alliance-with-cpi-cpm

పొత్తులపై ఉన్న అనుమానాలన్నింటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ తో కలిస్తే జగన్ కి నొప్పేంటి’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పవన్ కళ్యాణ్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వామపక్షాలు తప్ప రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. వివిధ జిల్లాల నేతలతో ఆయన వరసగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లోనూ ఈ మేరకు ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. జనసేన అవసరం టీడీపీకి లేదా వైసీపీకి ఉందేమో కానీ వారి అవసరం జనసేనకు లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో ఇక పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు ఖాయంగానే కనిపిస్తున్నా… సీపీఐ, సీపీఎంని కూడా కలుపుకుని వెళ్లనున్నారు.

కమ్యూనిస్టుల బలం ఎంత..?

పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. తర్వాత ఆయన ఈ రెండు పార్టీలకు దూరమయ్యాక కమ్యూనిస్టులు పవన్ పై కన్నేశారు. వివిధ సందర్భాల్లో జనసేన పార్టీతో కలిసి కవాతులు, ఇతర ఆందోళన కార్యక్రమాల్లో కమ్యూనిస్టులు చురుగ్గా పాల్గొన్నారు. అయితే, కమ్యూనిస్టులతో పవన్ పొత్తు ఖాయమని తెలిపోయింది. మరి, కమ్యూనిస్టులతో పొత్తు పవన్ కి ఏమేరకు లభిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ కమ్యూనిస్టులు గెలిచే సీట్లు తెలంగాణ ప్రాంతంలోనివే ఉండేవి. ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా అంతోఇంతో సీపీఐ, సీపీఎంకి బలం ఉన్నదంటే కేవలం తెలంగాణలోనే. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నడూ లేని విధంగా ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక ప్రాభావాన్ని పూర్తిగా కోల్పోయింది.

ఒంటరి పోరు చేశామనే పేరైనా..

కొంతైనా పట్టున్న తెలంగాణలోనే కమ్యూనిస్టుల పరిస్థితి ఇలా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీలు మరింత బలహీనంగా ఉన్నాయి. అయితే, అన్ని జిల్లాలో కమ్యూనిస్టులకు క్యాడర్, కార్యవర్గాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే జనసేన పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నా కార్యవర్గాలు మాత్రం లేవు. ఇక, ఏపీలో పూర్తిగా బలం కోల్పోయిన కమ్యూనిస్టులతో పొత్తు పవన్ కళ్యాణ్ కి కలిసివస్తుందని చెప్పలేం. ఉద్యమాల్లో ముందుండే కమ్యూనిస్టులు ఓట్లను సాధించలేరు. పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా ఎన్నో కొన్ని స్థానాలను ఆ రెండు పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్థానాల్లో వారు గెలిచే అవకాశాలు తక్కువే.

ప్రయోజనం ఉంటుందా…?

ఇక, ఈ స్థానాలు పోయినా మిగతా స్థానాల్లో మాత్రం జనసేనకు కమ్యూనిస్టు క్యాడర్ మద్దతు ఇస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉండవచ్చు కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనం అయితే ఉండదు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని కూటమి అనే పేరు తెచ్చుకోవడం కంటే ఒంటరి పోరు చేసి మొదటి ఎన్నికల్లోనే ఒంటరిగా బరిలో ఉన్నామనే గుర్తింపైనా వస్తుంది కదా అని కొందరు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో జనసేనకు క్యాడర్ నిర్మాణం పూర్తి కానందున ఎన్నికలకు సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి కమ్యూనిస్టులతో పొత్తే మేలనే వాదన కూడా ఉంది. మొత్తానికి ఎర్ర కండువా పవన్ కి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*