
రాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకు వస్తారు? ఏంటి ఈ పిచ్చి ప్రశ్న? అంటారా.. అక్కడికే వద్దాం.. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా.. రీజన్ ఒక్కటే పదవుల కోసం, తర్వాత అధికారం కోసం. కానీ, జనసేన వైఖరి మాత్రం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. తన పార్టీలోకి ఎవరు వచ్చినా వారు మాత్రం మాజీలు మాత్రం కారాదు.. అని ఒకప్పుడు తనకు తానే లక్ష్మణ రేఖలు గీసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ఎక్కడికక్కడ యువతకు పెద్ద ఎత్తున పరీక్షలు పెట్టారు. యువతను పెద్ద ఎత్తున సమీకరించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. ట్రైనింగ్ ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. వివిధ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున పేపర్ ప్రకటనలు గుప్పించి మరీ యువతను అక్కున చేర్చుకుంటామని, రాజకీయంగా వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. అయితే, ఏమైందో ఏమో మళ్లీ మౌనం వహించారు.
ఇతర పార్టీల నేతలను…..
ఇక, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాతే ముద్దు.. కొత్త వద్దు! అన్న చందంగా వైసీపీ, కాంగ్రెస్ నేతలను చంద్రబాబు కన్నా ముందుగానే జనసేనాని పార్టీలోకి ఆహ్వానించి పదవులు కట్టబెడుతున్నారు. సరే! ఇది ఆయన సొంత వ్యవహారం అనుకుందాం. అయితే, ఇతర పార్టీల నాయకులు పక్కన పెట్టిన నేతలను తన పార్టీలోకి చేర్చుకుని వారికి ఆశ్రయం ఇస్తున్న పవన్.. వీరితో తాను లక్ష్యంగా నిర్ణయించు కున్న సీఎం సీటుకు చేరుకోగలరా? అనేది ప్రధానంగా తెరమీదికి వస్తున్న ప్రశ్న. ఇటీవల తూర్పు గోదావరిలో భారీ ఎత్తున వివిధ పార్టీల నేతలకు పవన్ కండువా కప్పారు. జిల్లా నుంచి ఎక్కువగా వైసీపీ నుంచే జనసేనకు వలసలు వెళ్తున్నారు.
టిక్కెట్ల కోసమే చేరికలు….
మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ముమ్మిడివరం మాజీ వైసీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, వైసీపీ మాజీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్.. ఇలా అనేకమంది వైసీపీ నుంచే జనసేనలో చేరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంతం నానాజీ కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో జాయినయ్యారు. మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయ్రెడ్డి.. ఇలా పలువురు మాజీ ప్రజాప్రతినిధులూ జనసేనలో చేరారు. వీరిలో చాలామంది టికెట్ల కోసం ఆశపడే చేరినట్టు ప్రచారం ఉంది.
ఎవరికీ హామీ లేదని…..
అయితే జనసేనలో చేరాలనుకునేవారు ఎటువంటి షరతులు ఉండవని, టిక్కెట్ల హామీ అసలు ఉండదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టంగా చెప్తున్నారనే విషయం ఇప్పుడు గరంగరంగా మారింది. ఈ విషయంపైనే నాయకులు చర్చించుకుంటున్నారు. తామున్న పార్టీలో తమకు గుర్తింపు లేదని అందుకే పార్టీ మారామని నాయకులు చెబుతున్నారు. తమకు ఏదో జరుగుతుందని, తమకు ఓ గుర్తింపు వస్తుందని భావించామని అంటున్నారు. అయితే, పవన్ వైఖరి మాత్రం వారిలో తీవ్ర నిరాశను పెంచుతోంది. తాము వచ్చి సాధించేది లేనప్పుడు ఇంకెందుకు? అనే ధోరణి కూడా ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో తూర్పులో ఇప్పుడు నాయకులు ఉండి కూడా జనసేనలో అయోమయం నెలకొంది. మరి దీనిని పవన్ ఎలా క్లియర్ చేస్తారో చూడాలి.
Leave a Reply