హోం ఇలాకాలో జనసేన హవా …?

కాపు సామాజిక వర్గం అత్యధికంగా వున్న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం లో జనసేన హవా బాగా ఉందన్న టాక్ అధికార పార్టీని కలవరపెడుతుంది. సంక్లిష్టమైన ఈ నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు దశాబ్దాలుగా పార్టీకి వెన్నెముకగా వుంటూ వచ్చారు. అయితే ఆయన గత ఎన్నికల్లో వైసిపి లో చేరడం ఆ తరువాత ఆ పార్టీ అధికారం లోకి రాకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నా మునుపటి ప్రాధాన్యత పార్టీ లో దక్కలేదు. అందుకు ప్రధాన కారణం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. గత ఎన్నికల్లో కోనసీమ నుంచి పెద్దాపురం వచ్చి అసెంబ్లీ స్థానానికి పార్టీ ఆదేశాలపై పోటీ చేసిన రాజప్ప బొడ్డుకు ఏకుకుమేకుగా మారిపోయారు.

పెద్దాపురం నుంచే రాజప్ప …

వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి మరో సేఫ్ ప్లేస్ కి మారాలని రాజప్ప భావించినా అధిష్టానం వున్నచోటు నుంచే పోటీ చేయాలని చెప్పినట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో రాజప్ప ప్రస్తుత పరిస్థితి కొంత ఇబ్బందిగానే వుంది. ఒక పక్క సొంత పార్టీలో బొడ్డు నుంచి వ్యతిరేకతకు తోడు సొంత సామాజిక వర్గం అండగా నిలబడే పరిస్థితి జనసేన తో పోయింది. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు దాదాపు 35 వేలు ఉండటంతో అటు టిడిపి సంప్రదాయ ఓటు బొడ్డు ఎటు చెబితే అటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో రాజప్ప కు ముందు నుయ్యి వెనుక గొయ్యిగా తన నియోజకవర్గంలో రానున్న కష్టాలు కళ్ళముందే కనిపిస్తున్నాయి.

ఒక్క ఫ్లెక్సీ లేదు ….

ఇప్పుడు పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనసేన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి గా కీలక స్థానంలో అధికార పార్టీలో ఉండి కూడా రాజప్ప ప్రచారంలో ఇప్పటికే వెనుకబడటం టిడిపి క్యాడర్లో ఆందోళన కలిగిస్తుంది. గతంలో 2009 లో ప్రజా రాజ్యం పార్టీ జిల్లాలో గెలుచుకున్న నియోజకవర్గాలు నాలుగింటిలో పెద్దాపురం ఒకటి. నాటి ఎన్నికల్లో పంతం గాంధీమోహన్ ప్రజారాజ్యం నుంచి వైఎస్ హవాను టిడిపి పోటీని ఓడించి గెలిచి నిలిచారు. ఆ ఊపే ఇప్పుడు జనసేన లో కనిపిస్తుంది. కాపు యువత అంతా పెద్దాపురం లో జనసేనకు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అదే ఇప్పుడు అటు అధికార టిడిపి కి ఇటు విపక్ష వైసిపికి నిద్రపట్టకుండా చేస్తుంది. మరి ఈ హావాను బ్రేక్ చేసేందుకు రెండు ప్రధాన పార్టీలు అనుసరించబోయే వ్యూహాలు ఎలా వుండబోతాయన్న చర్చ జోరుగా సాగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*