కాటమరాయుడు సీటు మారుతుందా.. !

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాను పోటీ చేసే విషయంలో యూటర్న్‌ తీసుకున్నాడా ? గతంలో అనంతపురంలో జరిగిన సభలో తాను వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఖ‌చ్చితంగా అసెంబ్లీకి పోటీ చేసి తీరుతానని నొక్కి వక్కాణించిన పవన్‌ ఈ మాటపై యూటర్న్‌ తీసుకున్నాడా ? అంటే అవుననే జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ టీడీపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాపుల్లో మెజార్టీ వ‌ర్గాలు టీడీపీ వైపు మొగ్గడంతో గత ఎన్నికల్లో చంద్రబాబు సులువుగానే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో పవన్‌ టీడీపీకి దూరం అవ్వడంతో గత ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపిన కాపుల్లో ఇప్పుడు మెజార్టీ వర్గాలు, నాయకులు క్రమక్రమంగా జనసేన వైపు కదులుతున్నాయి.

అనంతపురం నుంచి……

ఇక వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న పవన్‌ తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత పవన్‌ పోటీ చేసే సీటుపై రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి.శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పశ్చిమగోదావరి జిల్లాల్లో తాను ఓటు హక్కును నమోదు చేసుకుంటానని చెప్పిన ఏలూరుతో పాటు పాలకొల్లు, నరసాపురం ఇలా పలు నియోజకవర్గాల‌ పేర్లు పవన్‌ పోటీ చేసే లిస్ట్‌లో చేరాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో కొత్త నియోజకవర్గం చేరింది. పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో జనసేన బలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని… ఈ క్రమంలోనే ఆ నియోజకవర్గంపై పవన్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.

కాకినాడ రూరల్ పైన…..

ఆ నియోజకవర్గంలో తన సామాజికవర్గంతో పాటు ఇతర కులాలకు చెందిన ఓటర్లలో మెజార్టీ వర్గాలు జనసేన వైపు చూస్తుండడంతో పవన్‌ ఆ సీటుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంపై తాజాగా పవన్‌ కళ్యాణ్‌ కాన్‌సంట్రేషన్‌ చేస్తున్నట్టే తెలుస్తోంది. ప్రస్తుతం తూర్పులో జనసేనకు అనుకూల పరిణామాలు వీస్తున్నట్టే వాతావరణం కనిపిస్తోంది. కాపులు అధికంగా ఉన్న గోదావరి జిల్లాలపైనే పవన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాల్లో పలువురు కీలకనేతలు జనసేనలోకి వరస పెట్టి జంప్‌ చేసేస్తున్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ట, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజ‌బాబు రాజమహేంద్రవరం నుంచి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పంతం నానాజీ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి అశోక్‌, కోనసీమలో మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసద్‌రావు, పాముల రాజేశ్వరీదేవితో పాటు మాకినీడి శేషుకుమారి వంటి నేత‌లు కూడా జనసేన వైపు అడుగులు వేస్తుండడంతో తూర్పులో ఆ పార్టీ క్రమక్రమంగా బలోపేతం అవుతోంది.

జెండా ఎగరవేయవచ్చని……

ఏపీలోనే 13 జిల్లాల్లో చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు ఉన్న బలం కీలక నాయకులు ఏ జిల్లాల్లో లేరని చెప్పాలి. ఇక్కడ అధికార టీడీపీ విపక్ష వైసీపీలో బలంగా ఉన్న నేతలు నియోజకవర్గ సమన్వయకర్తలుగా చేసిన వారు సైతం జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు. ముమ్మడివరం మాజీ వైసీపీ సమన్వయకర్త పితాని బాలకృష్ణ జనసేనలోకి జంప్‌ చెయ్యడమే ఇందుకు ఉదాహరణ. ఇక కాకినాడపై జనసేన ప్రభావం చాలా ఎక్కువ కనిపిస్తోంది. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణతో పాటు కాపు వర్గానికి చెందిన పంతం నానాజీ ఇద్దరు కలిస్తే కాకినాడ సిటీతో పాటు రూరల్‌ నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగరవేయవచ్చు అన్నదే ఆ పార్టీ లక్ష్యంగా తెలుస్తోంది.

గత ఎన్నికల్లో…..

ఇక రూరల్‌ నియోజకవర్గంలో నుంచి పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తే గెలుపు చాలా సులువు అవుతుందని లెక్కలు కూడా జనసేన వర్గాలు వేస్తున్నాయి.గతంలో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కాపు వర్గానికి చెందిన మాజీ జర్నలిస్ట్‌ కురసాల కన్నబాబు విజయం సాధించారు. గతంలో ఇక్కడ ప్రజారాజ్యం గెలవడంతో ఇప్పుడు పార్టీ అధినేతగా స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తే ఎందుకు ? గెలవరని కూడా జనసేన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. స్టార్‌ ఇమేజ్‌తో పాటు కాపుల ఓట్లు, నియోజకవర్గంలో బలంగా ఉన్న శెట్టిబలిజల్లో మెజార్టీ ఓటర్లు పవన్‌కు సపోర్ట్‌ చేస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీటు మార్పు అంశంపై ప‌వ‌న్ కూడా ఓ నిర్ణయానికి వ‌చ్చార‌ట‌. ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌ అనంతపురం నుంచి కాకినాడ రూరల్‌కు షిఫ్ట్‌ అవుతారని జనసేనలో ఇంటర్న‌ల్‌ చర్చలు నడుస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*