ఆ ఇద్దరు చేరితే జనసేనకి మరింత ఊపొస్తుందా… !

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన ఊపు మాములుగా లేదు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీలోకి జంప్‌ చేసేశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉండి టిక్కెట్లు రాని వారు సైతం జనసేనలోకి వెళ్లిపోయారు. ఇంకా చెప్పాలంటే ఏపీలోనే జనసేన తమ తొలి అభ్యర్థిని సైతం తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి వర‌కు వైసీపీ సయన్వయకర్తగా ఉన్న పితాని బాలకృష్ణను ఆ పార్టీ నియోజకవర్గ పగ్గాల‌ నుంచి తప్పించిన వెంటనే ఆయన జనసేనలోకి జంప్‌ చేసేయడం… పవన్‌ తమ పార్టీ తొలి అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

హర్హకుమార్ కూడా……

ఇదిలా ఉంటే వైసీపీ, టీడీపీతో పాటు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు సైతం ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలోకి జంప్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముత్తా శశిధర్‌, పితాని బాలకృష్ణ లాంటి కీలక నేతలు ఇప్పటికే జనసేన తీర్థం పుచ్చుకోగా పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఓ వెలుగు వెలిగిన అమలాపురం మాజీ ఎంపీ జి.వి హర్ష కుమార్‌తో పాటు రాజమహేంద్రవరంకు చెందిన ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శీకాకుళ‌పు శివరామ సుబ్రహ్మణ్యం సైతం జనసేనలోకి చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక అమలాపురం నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తర‌పున వరసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన హర్ష కుమార్‌ ఆ పార్టీ దళిత లీడర్లలో ఓ ఫైర్‌ బ్రాండ్‌గా ఎదిగారు.

రీ ఎంట్రీ కోసం……

దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సైతం కొన్ని సందర్భాలో హర్ష కుమార్‌ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. ఇక రాజకీయంగా కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉన్న ఆయన పొలిటికల్‌ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలోకి వెళ్తారని, టీడీపీలోకి వెళ్లారని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన జనసేనలోకి వేళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. జనసేనలోని కొందరు కీలక నేతలు సైతం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపారని వచ్చే ఎన్నికల్లో ఆయన అమలాపురం నుంచి జనసేన తర‌పున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌ పాలనలో మాజీ ముఖ్య మంత్రి రోశ‌య్యకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజమహేంద్రవరంకు చెందిన మాజీ ఏపీ ఐఐసీ చైర్మన్  శివరామ‌సుబ్రహ్మణ్యం సైతం జనసేనలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది.

చేరినా సీటు డౌటే……..

ఆయన జనసేనలో చేరినా టిక్కెట్‌ వస్తుందా ? రాదా అన్నది మాత్రం సందేహమే. జనసేన నుంచి ఇప్పటికే రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌తో పాటు పక్కనే ఉన్న రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల‌ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే  శివరామ‌సుబ్రహ్మణ్యంకు సీటు విషయంలో అయితే క్లారిటీ లేకపోయినా ఆయన కూడా జనసేనలో చేరేందుకు ఉత్సాహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటికే పలువురు కీలక నేతల చేరికతో మంచి జోష్‌లో ఉన్న జనసేనకు వీరిద్దరి చేరిక మరింత ప్లస్‌ అవుతుండడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*