జనసేనాని అలా ఎందుకన్నారో…?

స‌మ‌యానికి త‌గిన విధంగా మాట్లాడ‌మ‌న్నారు పెద్ద‌లు! అది రాజ‌కీయాలైనా.. ఏవిష‌య‌మైనా స‌రే ఈ సూత్ర‌మే వ‌ర్తిస్తుంది. కానీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను తాను మేధావిగా చెప్పుకొంటున్నా.. ఎప్పుడు, ఎక్క‌డ ఏం మాట్లాడాలో తెలియ‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తు న్నాయి. తాజాగా విశాఖ జిల్లా అర‌కులోయ ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావును మావోయిస్టులు కాల్చి చంపారు. అదే స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే సివేరీ సోమ‌ను కూడా త‌మ తూటాల‌కు బ‌లి తీసుకున్నారు. ఇది నిజంగా పార్టీల‌కు అతీతంగా సానుభూతి చూపించాల్సిన విష‌యం. ర‌క్తం రుచి మ‌రిగిన మావోయిస్టులకు వారు వీరు అనే తేడా లేదు. పార్టీల‌తోనూ సంబంధం లేదు. త‌మను ధిక్క‌రించిన వారిని చంపేయ‌డ‌మే వారి ల‌క్ష్యం. ఈ క్ర‌మంలో కిడారు, సోమ హ‌త్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది.

జగన్ సయితం……

వారు త‌ప్పులు చేసి ఉండొచ్చు. కానీ, చంపేయ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకుంటే.. ఈ దేశంలో ఏ ఒక్క‌రూ మిగ‌ల‌రు. ఎందుకంటే.. దేశంలో త‌ప్పులు చేయ‌ని వారంటూ ఎవ‌రూ లేరు. మావోయిస్టులు చెబుతున్న విష‌య‌మే తీసుకుంటే.. కిడారు, సోమ కంటే ఎక్కువ‌గానే ప్ర‌జాధ‌నాన్ని దోచేస్తున్న‌వారు ఎంతో మంది ఉన్నారు. వారంద‌రినీ చంపేయ‌డ‌మేనా.. ముందున్న ప్ర‌త్యామ్నాయం?! కాదు! సో.. జ‌రిగిన దానికి వ‌ర్గాల‌కు అతీతంగా పార్టీల‌కు అతీతంగా ముక్త‌కంఠంతో ఖండిస్తున్నారు. అంతెందుకు, టీడీపీ అన్నా.. ఆ పార్టీ నేత‌ల‌న్నా ఎంతో ఎగిరిప‌డే వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం ప్ర‌జాస్వామ్యంలో హ‌త్యల‌కు, హింస‌కు తావులేద‌ని క్ష‌ణాల్లోనే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి, సానుభూతి ప్ర‌క‌టించారు. నాయ‌కుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. నిజానికి ఆయ‌న మౌనంగా ఉన్నా,.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసినా.. ఎవ‌రూ ఏమీ అన‌లేరు.

ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ…..

ఎందుకంటే.. డ‌బ్బు ఎర వేసి వైసీపీ త‌ర‌ఫున గెలిచిన కిడారిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న పార్టీలోకి తీసుకున్నారు. ఇలాంటి నాయ‌కుడిపైన కూడా జ‌గ‌న్ ఒక్క‌మాటంటే ఒక్క‌మాట కూడా వివాదాస్ప‌దంగా స్పందించ‌లేదు. కానీ, ప‌వ‌న్ మాత్రం తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. అంద‌రి నోళ్లలో నానారు. ఎప్ప‌టిక‌ప్పుడు సంయ‌మ‌నం, అంటూ సుద్దులు చెప్పే ప‌వ‌న్‌.. కిడారు, సోమ హ‌త్య‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వారిద్దరి మరణానికి టీడీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(పీఏసీ) ఆరోపిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతూ చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకొని ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని జనసేన పీఏసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని ఆరోపించింది.

సరైన సందర్భం లేదా?

అక్రమ మైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉండాల్సిందని ప్రకటన విడుదల చేసిన జనసేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పక్క మృతులకు అందరూ సంఘీభావం తెలుపుతుంటే…ఈ సమయంలో కూడా రాజకీయాలు చేసేలా ఈ ప్రకటన ఏమిటని పలువురు మండిపడుతున్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి చాలా స‌మ‌యం ఉంటుంద‌ని, మావోయిస్టుల చేతిలో బ‌లైన వారి మృత‌దేహాల‌కు ఇంకా అంతిమ సంస్కారాలు చేయ‌కుండానే ఇలా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ‌డం అటు రెండు కుటుంబాల్లోనూ అశ‌నిపాత‌మేన‌ని అంటున్నారు ప్ర‌జ‌స్వామ్య వాదులు. సాధార‌ణంగా ఏదైనా జ‌రిగిన‌ప్పుడు ప్ర‌భుత్వం త‌ర‌ఫునో… పోలీసుల త‌ర‌ఫునో వైఫ‌ల్యాలు ఉండ‌కుండా ఉండ‌వు. కానీ, విమర్శించేందుకు స‌రైన సంద‌ర్భం అంటూ ఒక‌టి ఉంటుంద‌నే విష‌యం ప‌వ‌న్‌కు తెలియ‌దా? ఆమాత్రం విజ్ఞ‌త లేకుండానే ఆయ‌న పార్టీ పెట్టారా? అనేది నెటిజ‌న్ల మాట‌. మ‌రి దీనికి జ‌న‌సేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*