
పశ్చిమ గోదావరి జిల్లా.. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబానికి కీలకమైన జిల్లా. ఇక్కడ నుంచి వారి ప్రస్థానం ప్రారంభమైంది. అయితే, రాజకీయంగా ఇక్కడ ఆ కుటుంబానికి ఘోరమైన అవమానం జరిగింది. 2007లో ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి పెట్టిన పార్టీ గుర్తుండే ఉంటుంది. ఈ పార్టీ జెండాపై ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో తన సొంత ప్రాంతమైన పాలకొల్లు నుంచి పోటీ చేశారు. అయితే.. ప్రజలు మాత్రం చిరును ఆదరించలేదు. ఇక్కడ నుంచి పోటీ చేసిన మహిళా నేత, కాంగ్రెస్ కీలక నాయకురాలు.. బంగారపు ఉషారాణిపై చిత్తుగా ఓడిపోయారు. దీంతో సొంత జిల్లాలోనే ఘోర ఓటమిని చవిచూసిన నాయకుడిగా చిరు మిగిలిపోయారు. ఆ ఎన్నికల్లో చిరు పాలకొల్లులో ఓడిపోగా, తిరుపతిలో మాత్రం 10 వేల ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఇక, ఇప్పుడు ఇదే జిల్లాపై ఆయన సోదరుడు.. జనసేన అధినేత పవన్ దృష్టి పెట్టారు.
ఆ ఓటు బ్యాంకుపైనే….
పార్టీ స్థాపించి నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ.. ఇప్పటి వరకు రెండు సార్లు ఇక్కడ పర్యటించిన పవన్ తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సొంత జిల్లాలో పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఏకం చేయాలని భావిస్తున్నారు. పైకి కులం పేరు లేదంటూనే కాపు ఓట్లను తన ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరు తున్నారు. ఈ క్రమంలోనే ఈయన పర్యటనపై అనేక చర్చలు వస్తున్నాయి. అదే సమయంలో చిరు సాధించని విజయాన్ని సొంత జిల్లాలో పవన్ సాధిస్తాడా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇక్కడ పవన్ సక్సెస్ అయితే చిరు కన్నా పవన్ బెస్ట్ అని అనిపించుకోవడంలో సందేహం లేదు.
అప్పట్లో ఒకే సీటు….
2009 ఎన్నికల్లో చిరు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన స్వయంగా పాలకొల్లులో ఓడిపోగా జిల్లాలో ప్రజారాజ్యం ఒక్క తాడేపల్లిగూడెం సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక డెల్టాలో పాలకొల్లు, నరసాపురం, భీమవరంతో పాటు తాడేపల్లిగూడెం, ఏలూరు నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం రెండో స్థానంలో నిలిచి గట్టి పోటీ ఇచ్చింది. కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం బలంగా ఓట్లు చీల్చి టీడీపీని రెండో ప్లేస్‌లోకి నెట్టేసింది. ఇక ఇప్పుడు పశ్చిమపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకున్నారు.
పర్యటనకు రెడీ…..
కృష్ణా జిల్లా అప్పనవీడు వద్ద అభయాంజనేయ స్వామి దర్శించుకుని పశ్చిమలోకి ప్రవేశించిన ఆయన రోడ్డు మార్గాన నారాయణపురం, గణపవరం, ఉండి ప్రాంతాలు మీదగా భీమవరం చేరుకున్నారు. నేటి నుంచి జిల్లా సమస్యలపై పవన్ సమీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఆచంట వంటి నియోజకవర్గాలలోని సమస్యలపై నివేదికలు తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తన సోదరుడు నాగబాబును వీలును బట్టి తూర్పులో కాకినాడ ఎంపీ సీటు లేదా పశ్చిమలో పాలకొల్లు లేదా నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయించే వీలున్నట్టు కూడా తెలుస్తోంది.
ప్రధాన సమస్యలపై…..
ఇక పవన్ తన తాజా పర్యటనలో కొల్లేరు, యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యం, ఆక్వా రంగం సంక్షోభం, గరగపర్రు ఘటన, గోదావరి మెగా ఫుడ్ పార్క్ వివాదం, ఓడరేవు, వశిష్టవారధి తదితర సమస్యలపైౖ ఆయన సమీక్షించే అవకాశం ఉంది. ఇవెలా ఉన్నా.. గత 2009లో జరిగిన చిరు పరాభవాన్ని ఈయన ఏమేరకు సమసిపోయేలా చేయగలడు … వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పవన్ జెండా ఎగురుతుందా ? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply