పవన్ కు ఆ ఫీవర్ పోనట్లుందే…??

pawan-kalyan-janasena-prajarajyam-party

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రజారాజ్యం పార్టీ ఫీవర్ పోయినట్లు లేదు. ఆయన పార్టీ ప్రారంభించిన నాటినుంచే ప్రజారాజ్యం పార్టీ జపం చేస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం భయం తొలినాటి నుంచి పట్టుకునే ఉంది. ప్రజారాజ్యం పార్టీలో తన అన్న చిరంజీవి ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆయన మర్చిపోలేకపోతున్నారు. చిరంజీవి అంటే పవన్ కల్యాణ‌ కు ఎనలేని గౌరవం.. అభిమానం. ప్రేమ. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ క్రియాశీల పాత్రను పోషించారు.

ప్రజారాజ్యంలో కీలకంగా….

ప్రజారాజ్యంలో యువజన విభాగం అయిన యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచారంలో అనేక చోట్ల పాల్గొన్నారు. అన్న చిరంజీవికి అండగా నిలిచారు. అయితే ఆనాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవిని తొలినాళ్లలోనే అనేకమంది మోసం చేశారన్నది పవన్ అభిప్రాయం. కేవలం సీట్లు, పార్టీలో ఆధిపత్యం చెలాయించేందుకు నేతలు చేరారు తప్ప పార్టీ కోసం కాదని పవన్ కల్యాణ్ ఆనాడే గుర్తించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి విలీనం చేయడానికి గల కారణాలు సయితం పవన్ ఆనాడే గుర్తించారు.

తప్పులు జరగకుండా….

ఆయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో జరిగిన లోటుపాట్లు, తప్పులను నిత్యం మననం చేసుకుంటూనే ఉన్నారు. పరకాల ప్రభాకర్ లాంటి వారు తన అన్నను మోసం చేసి వెళ్లిపోయారని పవన్ ఇప్పటికీ పలు సమావేశాల్లో దెప్పిపొడుస్తూనే ఉన్నారు. అందుకే జనసేన పార్టీ పెట్టినప్పుడు అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త వారికే అవకాశమిస్తానన్న పవన్ వ్యాఖ్యల వెనక కూడా ప్రజారాజ్యం గుర్తొచ్చేనంటారు. నాటి ఎదురుదెబ్బలు తగలకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను కూడా పవన్ చేశారు.

క్యాడర్ లో భరోసా నింపేందుకు….

అందుకే అధికారంలోకి వస్తామని పవన్ చెప్పడం లేదు. పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, మార్పు కోసం ఖచ్చితంగా ఏనాటికైనా జనసేనను ప్రజలు ఆదరిస్తారని పవన్ నమ్ముతున్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఎన్నికల ఫలితాలను పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులుగా ప్రకటించే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. పార్టీని గ్రామస్థాయిలో పటిష్టం చేసే పనిలోనే పవన్ ఉన్నా ప్రజారాజ్యం పార్టీని మాత్రం ఇప్పటికీ మర్చిపోవడం లేదు.

Ravi Batchali
About Ravi Batchali 15990 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*