పవన్‌ పోటీ.. క్యాస్ట్‌నే నమ్ముకున్నాడా..?

pawan-kalyan-janasenaparty

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది. ఏడాది క్రితం అనంతపురం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ రాయలసీమలోనూ వెనకబడిన అనంతపురం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతానని ఆవేశంగా ప్రకటన చేశారు. పవన్‌ ఈ ప్రకటన చేసిన తర్వాత ఆయన అనంతపురం జిల్లా నుంచే బరిలోకి దిగుతారన్న వార్తలు బలంగా వినిపించాయి. పవన్‌ తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పినా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నది క్లారిటీ ఇవ్వలేదు. అనంతపురం జిల్లాల్లో పవన్‌ సామాజికవర్గం అయిన బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న అనంతపురం అర్బన్‌ లేదా కదిరి నుంచి పోటీ చేస్తారని ముందు వార్తలు వచ్చాయి.

ఎక్కడికి వెళితే అక్కడ….

ఒకానొక దశలో అదే జిల్లాలోని గుంతకల్లు పేరు సైతం పవన్‌ పోటీ చేసే సీటంటూ సోషల్‌ మీడియాలో హల్చల్‌ జరిగింది. పవన్‌ అనంతపురం జిల్లాల్లో చేసిన ప్రకటన తర్వాత ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఎక్కడకు వెళ్లినా తాను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న ప్రకటన చేసి అందరిని గందరగోళంలో పడేశారు. చివరకు పాడేరు, పాయకరావుపేట లాంటి ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాల్లో సైతం తాను అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పడాన్ని బట్టి చూస్తుంటే అసలు పవన్‌కు రాజకీయ పరిపక్వత ఉందా ? ఈ గందరగోళం ప్రకటనలు ఎందుకు చేస్తున్నారన్నది ఎవ్వరికి అంతుపట్టడం లేదు. కాపు సామాజికవర్గానికి చెందిన పవన్‌ పాడేరు లాంటి ఎస్టీ, పాయకరావుపేట లాంటి ఎస్సీ నియోజకవర్గాల్లో ఎలా పోటీ చేస్తారన్నది ఆయ‌న‌కే తెలియాలి.

తూర్పు నుంచే……

అసలు సగటు రాజకీయ పరిజ్ఞానం ఉండే పవన్‌ ఈ ప్రకటన చేస్తున్నారా ? అన్న సందేహాలు కూడా కలిగాయి. ఓవర్‌ ఆల్‌గా పవన్‌ ఇప్పటికే తాను పోటీ చేస్తానంటు ఏడెనిమిది నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే అత్యంత విశ్వసనీయ వర్గాలు, జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి చాప కింద నీరులా వ్యూహాలు సిద్ధం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ అయ్యింది. ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో జనసేన అత్యంత బలంగా ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న జిల్లా తూర్పుగోదావరి. 2009లో పవన్‌ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడుకూడా ఈ జిల్లా నుంచి నాలుగు సీట్లు గెలుచుకుంది. ఇక పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో తన తొలి అభ్యర్థిని సైతం ఇదే జిల్లా నుంచి ప్రకటించిన సంగతి తెలిసిందే.

పవన్ ఫ్యాన్స్ కూడా…..

ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణ జనసేన తొలి సీటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ సామాజికవర్గం ఓటర్లతో పాటు పవన్‌ వీరాభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్‌ ప్రధానంగా తూర్పుగోదావరితో పాటు పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లాను సైతం టార్గెట్‌ చేస్తున్నారు. జనసేన రాష్ట్ర పొలిటికల్‌ ఎఫెర్స్‌ కమిటి సభ్యులు ముత్తా గోపాలకృష్ణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ జిల్లాలోని కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌ లేదా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వ్యాఖ్యానించారు. ముత్తా గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ కేంద్రంగా జనసేన చేస్తున్న గ్రౌండ్‌ వర్క్‌ చూస్తుంటే పవన్‌ ఇక్కడ నుంచే ఖ‌చ్చితంగా పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కాపు సామాజికవర్గం ప్రాబ‌ల్యం ఎక్కువ.

కాపు ఓటు బ్యాంకు……

కాకినాడ సిటీలో కాపులతో పాటు ఇతర సామాజికవర్గాలకు ఓటు బ్యాంకు బలంగానే ఉంది. కాకినాడ రూరల్‌, పిఠాపురంలో కాపు సామాజికవర్గం ఓటర్లే ఇక్కడ నేతల తలరాతను డిసైడ్‌ చేస్తుంటారు. ఇదే క్రమంలో గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఓ నేత కొద్ది రోజుల క్రితం టీడీపీలోకే వెళ్లాలని ప్రయత్నాలు చేశారు. అదే టైమ్‌లో పవన్‌ కళ్యాణ్‌ నుంచి ఆయన బలమైన హామీ రావడంతోనే ఆయన టీడీపీ ఎంట్రీ ఆగినట్టు తెలుస్తోంది. సదరు నేత టీడీపీలోకి జంప్‌ చేసి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. అదే టైమ్‌లో పవన్‌ కళ్యాణ్‌ తాను కాకినాడ లోక్‌సభ సెగ్మెంట్‌లో ఎక్కడో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మీరు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మనం ఆ సీటును సులువుగా గెలుచుకోవచ్చు అని చెప్పడంతోనే సదరు నేత టీడీపీ ఎంట్రీ ఆగినట్టు తెలుస్తోంది.

జిల్లా మొత్తం మీద ఉంటుందని….

పవన్‌ కాకినాడ లోక్‌సభ సెగ్మెంట్‌లోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లా మొత్తం మీద ఉంటుంది. ఈ క్రమంలోనే కాకినాడ లోక్‌సభ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో త‌న‌ ప్రభావం ఎక్కువగా ఉండి… కాకినాడ ఎంపీ సీటును సులువుగా గెలుచుకోవచ్చన్నదే పవన్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాకినాడ కేంద్రంగా ఇప్పుడు జనసేన పెద్ద వర్కే చేస్తుంది. తాజా పరిణామాలు బట్టి చూస్తే పవన్‌ కళ్యాణ్ పైన చెప్పిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌ర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చెయ్యడం ఖాయంగా కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*