మళ్లీ ఒక్కటవుతారా?

తెలుగుదేశం పార్టీ, జనసేన మళ్లీ కూటమిగా ఏర్పాటు కానుందా? వామపక్ష పార్టీల వ్యూహంతో ఈ కలయిక జరుగుతుందా? అవును. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అయితే ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ లో కాదు. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రమే. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న నేపథ్యంలో వామపక్ష పార్టీలు వేగం పెంచాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయాలన్నది కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఉద్దేశ్యం. బీజేపీకి వ్యతిరేకంగా సీపీఐ కూడా ఉంది. అయితే సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో కలసి నడవాలని నిర్ణయించుకుంది.

వామపక్షాల నిర్ణయంతో…..

ఈనేపథ్యంలో తెలంగాణలో సీపీఎం పార్టీకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు సీపీఐ నేతలతో మంతనాలను ప్రారంభించింది. సీపీఎం ఈ సంద్భంగా మూడు షరతులను పెట్టింది. 1. తెలంగాణలో టీడీపీ, జనసేన, సీపీఐ కలసి పోటీ చేస్తేనే తాము కూటమిలో చేరతాం. 2. కాంగ్రెస్ తో కలిస్తే తాము కలవబోం. 3. కాంగ్రెస్ తో సీపీఐ కలసి పోటీ చేసినా సీపీఐ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తాము అభ్యర్థులను నిలబెట్టం. ఈమూడు షరతులతో సీపీఎం నేతలు సీపీఐతో చర్చలు ప్రారంభించారు.

సీపీఎం కూటమి అయితే…..

అయితే ఈ మేరకు పవన్ కల్యాణ్ కు కూడా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. సీపీఎం ప్రతిపాదనలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించినట్లు సమాచారం. సెప్టంబరు 2వ తేదీన సీపీఎం నేతలను కలవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. సీపీఎం ఆలోచన ప్రకారం తెలంగాణలో సీపీఎం, సీపీఐ, టీడీపీ, జనసేనలు కలసి పోటీ చేయాలన్నది. అయితే ఇందుకు పవన్ అంగీకరిస్తారా? అన్నది తెలియకున్నా తెలంగాణలో పొత్తుకు పవన్ అంగీకరించే అవకాశముందని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.

ఏపీలో పరిస్థితి ఏంటి?

ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ టీడీపీ నేతలను ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మీద పదే పదే విమర్శలు చేస్తున్నారు. కొద్దికాలం వరకూ పవన్ విమర్శలకు స్పందించని టీడీపీ నేతలు ఇప్పుడు పవన్ పై ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో టీడీపీ ఉన్న కూటమిలో జనసేన చేరితే ఆంధ్రప్రదేశ్ లో తప్పుడు సంకేతాలు వెళతాయి. ఇదే జరిగితే ఖచ్చితంగా ఇది జగన్ కు లాభమంటున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ లో అవగాహనతో వెళదామని ఆలోచిస్తున్నారు. తెలంగాణలో పవన్, చంద్రబాబులు ఒక్కటయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈక్వేషన్స్ మారే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*