అటు బాబు.. ఇటు ప‌వ‌న్‌…!

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు ప‌లు చిత్రాల్లో హీరోగా రాణించి మెప్పించిన హీరో సుమ‌న్‌.. ఇప్పుడు వ్యూహాత్మ‌క రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. ప్ర‌స్తుతం అడ‌పా ద‌డ‌పా చిత్రాల్లో చిన్న‌పాత్రలు వేస్తున్న ఆయ‌న దాదాపు ఖాళీగానే ఉన్నాడ‌ని చెప్పాలి. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న కూడా రాజ‌కీయంగా దూసుకుపోవాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. ఫిలిం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి.. దాదాపు 40 ఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఇటు ఏపీలోను, అటు తెలం గాణ‌లోనూ ప‌లు సంస్థ‌లు ఆయ‌న‌ను స‌త్క‌రించాయి. ఇక‌, ఇదే స‌మ‌యంలో ప‌లు టీవీ ఛాన‌ళ్లు ఆయ‌న‌తో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించాయి. ఈ క్ర‌మంలోను, విజ‌య‌వాడ‌లో జ‌రిగిన స‌భ‌లోనూ సుమ‌న్ రాజ‌కీయాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

బాబును ప్రశంసలతో……

ఏపీలో మ‌రో ఆరేడు మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశార‌ని ఈ వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది. త‌న రాజ‌కీయ గురువు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబేన‌ని ఆయ‌న ఏపీలో జ‌రిగిన ఓ కార్య క్ర‌మంలో సుమ‌న్ వెల్ల‌డించారు. బాబు నుంచి తానుఎంతో నేర్చుకున్నాన‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు బాబు మారు పేర‌ని కొనియా డారు. అయితే, తాను రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించేదీ లేనిదీ ఆయ‌న బ‌హిరంగ ప‌ర‌చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఆయ‌న పార్టీలోకి వ‌చ్చే విష‌యంలో మాత్రం విల్లింగ్ గానే ఉన్నాడ‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. కానీ, త‌నంత‌ట తానుగా కాకుండా బాబు ఆహ్వానిస్తే.. వెళ్లాల‌నేది సుమ‌న్ ప్లాన్‌. ఇక‌, బాబు సైడ్ నుంచి చూసినా.. ఆయ‌న‌కు కూడా టాలీవుడ్ నుంచి స‌హ‌కారం త‌ప్ప‌నిస రిగా కావాల్సిందే.

కొందరు జగన్ కు మద్దతు……

ఇప్ప‌టికే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను దూరం చేసుకున్నారు బాబు. అదేవిధంగా అందివ‌స్తాడ‌ని భావించిన ప‌వ‌న్ కూడా సైడ్ అయ్యాడు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు గెలిచి న‌వ్యాంధ్ర సీఎం అయ్యేందుకు ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున అందించిన స‌హాకారం అమూల్యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఒంట‌రి పోరుకు రెడీ అవుతున్నాడు. దీంతో పాటు టాలీవుడ్ నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు అయిన పోసాని, మోహ‌న్‌బాబు, కృష్ణుడు, రాజా, పృథ్వి లాంటి వాళ్లు జ‌గ‌న్‌కు ఓపెన్‌గానే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో సుమ‌న్ లాంటి వాళ్ల అవ‌సరం టీడీపీకి ఉంది.

రేపల్లె నియోజకవర్గం నుంచి…..

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచే సుమ‌న్ పేరు గుంటూరు జిల్లాలోని రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ రేసులో ప్ర‌ముఖంగా వినిపించింది. సుమ‌న్ త‌ర‌చూ రేప‌ల్లెలో ప‌ర్య‌టించేవారు. ఒకానొక‌ద‌శ‌లో రేప‌ల్లె టీడీపీ సీటు సుమ‌న్‌కే అన్న ప్ర‌చారం బ‌లంగా వినిపించింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సుమ‌న్ సామాజిక‌వ‌ర్గ‌మైన గౌడ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు 42 వేల మంది ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో సుమ‌న్ అక్క‌డ టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్టు మ‌ళ్లీ వార్త‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అయితే అక్క‌డ టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ ఉన్నారు. బాబు ఆయ‌న్ను త‌ప్పించే సాహ‌సం చేస్తారా ? అన్న‌ది డౌటే.

పవన్ కు కూడా గాలం……

ఇక‌, సుమ‌న్ రాజ‌కీయంగా మ‌రో వ్యూహాత్మ‌క అడుగు వేశాడు. త‌న‌ను ఒక వేళ చంద్ర‌బాబు పిల‌వ‌క‌పోయినా.. ప‌వ‌న్ పంచ‌న చేరేందుకు రెడీ అనే వ్యాఖ్య‌లు చేశాడు. హీరోగా ఇండస్ట్రీని ఏలి ఇప్పుడు జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సుమన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయని.. ముఖ్యంగా యువతలో పవన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్నారు. పవన్ ను చాలా మంది యువత ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల ద్వారా సుమ‌న్‌.. ప‌వ‌న్‌కు గాలం వేస్తున్నాడ‌నే అభిప్రాయం అటు టాలీవుడ్ వ‌ర్గాల్లోనూ, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ కూడా క‌లుగుతుండ‌డం గ‌మ‌నార్హం. సుమన్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటే టీడీపీ సీటు రాని ప‌క్షంలో జ‌న‌సేన‌లోనూ ఆప్ష‌న్ ఉంచుకునేలాగానే ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి ఎన్నిక‌లు స‌మీపించే నాటికి సుమ‌న్ ఎటు ట‌ర్న్ అవుతాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*