వలసల ఆశలు లేనట్లేనా….!!

pawan kalyan ysrcongress party, telugudesam party

ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా పోరాట యాత్రకు అప్పట్లో మంచి స్పందన లభించింది ఎక్కడికి వెళ్ళినా జనం బాగా హాజ‌రుకావడంతో ఈ జిల్లాలో పవన్ పార్టీ ఊపేస్తుందని ఓ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తం 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లు కలిగిన ఈ మూడు జిల్లాల్లో పవన్ సామాజిక వర్గంతో పాటు, మెగాభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దాంతో బలీయమైన శక్తిగా జనసేన నిలుస్తుందని అనుకున్నారు. అయితే జగన్ పాదయాత్ర మొదలయ్యాక వైసీపీ వైపుగా జనం మొగ్గు కనిపించింది. దానికి తోడు పవన్ టూర్ చేసి వెళ్ళిపోయాక దాన్ని కంటిన్యూ చేసే పార్టీ నాయకుడు కానీ, పార్టీ నిర్మాణం కానీ ఎక్కడా లేకపోవడం వల్ల జనసేన ఊపు పాల పొంగులా చప్పున చల్లారిపోయినట్లయింది.

మాజీ మంత్రి చేరినా…..

ఇక కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పనిచేసి రెండు మార్లు ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా కూడా పనిచేసిన పసుపులేటి బాలరాజు జనసేనలో రెండు నెలల క్రితం చేరారు. దాంతో పార్టీకి కొత్త ఊపు వచ్చిందనుకున్నారు. ఈ దెబ్బతో విశాఖ జిల్లాలో కదలికలు ఉంటాయని, సీనియర్లు, ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరుతారని కూడా ఆశించారు. అయితే జనసేన వైపుగా ఇతర పార్టీల నాయకుల అడుగులు పడడంలేదు. ఇక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సైతం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే నాలుగైదు చోట్ల అభ్యర్ధులు తప్ప మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. విశాఖలో మూడు ఎంపీ సీట్లు ఉంటే ఇప్పటి వరకూ ఎంపీ క్యాండిడేట్లు కూడా ఆ పార్టీలో చర్చకు రావడంలేదు.

జాబితాలు తరువాతేనా…

ఇక జనసేన ఇపుడు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది టీడీపీ, వైసీపీ అసంతృప్తుల మీదనే. ఆ రెండు పార్టీలు ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పుకొస్తున్నాయి. దాంతో అక్కడ కనుక టికెట్ రాని వారు ఉంటే వారికి బెస్ట్ ఆప్షన్ గా జనసేన ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ కూడా ప్రధాన పార్టీలు తెలివిగా రాజకీయం చేయాలనుకుంటున్నాయి. పోటీ లేని చోట్ల, గెలుపు అవకాశాలు బాగా ఉన్న చోట్ల మాత్రమే అభ్యర్ధులను ప్రకటించి మిగిలిన వాటిని పెండింగులో పెట్టనున్నాయి. వాటిని ఎన్నికలు దగ్గర చేసి ప్రకటిస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే జనసేన పెట్టుకున్న వలసల ఆశలు పెద్దగా నెరవేరే అవకాశాలు ఉండవని అంటున్నారు. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నా అసెంబ్లీ సీట్లలో బాధ్యులను నియమించపోవడం పట్ల కూడా పార్టీలో అసంత్రుప్తి వ్యక్తం అవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*