జనసేన టిక్కెట్లు డిసైడ్‌ అయ్యాయా ..!

వచ్చే ఎన్నికల్లో ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఊరించి ఊరించి పవన్‌ జనసేన తొలి అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణ పేరు ఖ‌రారు చేశారు. నిన్నటివరకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న బాలకృష్ణ ఆ పార్టీలో సీటు దక్కే ఛాన్సులు లేకపోవడంతో జనసేనలోకి జంప్‌ చేసిన వెంటనే పవన్‌ ఆయనకు ముమ్మడివరం సీటు ఖ‌రారు చేశారు. ఇదిలా ఉంటే జనసేన బలంగా ఉంటుందని అందరూ భావిస్తున్న‌ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించకపోయినా చాలా చోట్ల ఓ కొలిక్కి వచ్చినట్టే కనపడుతుంది.

ఈసీట్లలో వారే పోటీ….

తాజాగా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక‌ వరప్రసాద‌రావు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. త్వరలోనే జనసేనలో చేరనున్న రాపాక‌ వచ్చే ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యనున్నారని.. దాదాపుగా ఆయన అభ్యర్థిత్వం ఖాయం అయ్యినట్టు తెలుస్తోంది. ఇక తూర్పు గోదావరి జిల్లాల్లో కీలక నగరమైన రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్‌ జనసేన అభ్యర్థుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. రాజమహేంద్ర‌వ‌రం రూరల్‌ సీటుకు ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌కు ఇస్తున్నట్టు సమాచారం. దుర్గేష్‌ ఆ హామీతోనే ఏకంగా వైసీపీ నుంచి జనసేనలోకి జంప్‌ చేసేశారు. ఇక రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ లేదా ఆయన భార్య లక్ష్మిలలో ఎవరో ఒకరు పోటీ చేయనున్నారు. ఈ రెండు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారు అయ్యినట్టే. ఆకుల ఇప్ప‌టికే ప‌వ‌న్‌కు ట‌చ్‌లో ఉన్నారు.

పవనే పోటీ చేస్తారా?

తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ సిటీలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో కాకినాడ సిటీ సీటు నుంచి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ‌ లేదా ఆయన తనయుడు ముత్తా శశిధర్‌ల‌లో ఎవరో ఒకరు రంగంలో ఉండనున్నారు. ఇక్కడ జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది వీరిద్దరే తేల్చుకోవాల్సి ఉంది. కాకినాడ రూర‌ల్‌ సీటు నుంచి పలువురు పేర్లు వినిపిస్తున్నా పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సైతం స్వయంగా పోటీ చేస్తారని మరో టాక్‌ కూడా వినిపిస్తోంది.మండపేటలో గిరిజాల వెంకటస్వామినాయుడు లైన్‌లో ఉన్నారు.

చివరి నిమిషంలో జంప్ చేసి……

మరో కీలక నియోజకవర్గమైన పెద్దాపురంలో ప్రస్తుత టీడీపీ నేత బొడ్డు భాస్కరరావుకు టీడీపీ సీటు దక్కని పక్షంలో ఆయన జనసేనలోకి జంప్‌ చేసి పెద్దాపురం జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటారని బొడ్డు అభిమానులే స్వయంగా చెబుతున్నారు. ఇక పిఠాపురం సీటు నుంచి ఇటీవల వైసీపీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉండి జనసేనలోకి జంప్‌ చేసిన సంగిశెట్టి అశోక్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాకినాడ ఎంపీగా ఉన్నా తోట నరసింహం చివరిలో జనసేనకు జంప్‌ చేసి పిఠాపురం నుంచి తాను లేదా తన భార్య తోట వాణిలలో ఎవరో ఒకరు రంగంలోకి దిగే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అలాగే కొత్తపేటలో కూడా జనసేన నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులే రంగంలో ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం గెలిచిన పెద్దాపురం, కాకినాడ రూరల్‌, పిఠాపురంలలో ఆ పార్టీ ప్ర‌ధాన పార్టీల‌కు పోటీ ఇచ్చేంత‌ బలంగా ఉన్నట్టే కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*