వ్యూహమా…? లౌక్యమా..?

pawankalyan-janasenaparty

నేను పూర్తికాలపు రాజకీయ కార్యకర్తను అని ప్రకటించుకున్నారు పవన్ కల్యాణ్. సినిమాల జోలికి వెళ్లేది లేదని తెగేసి చెప్పేశారు. తన అన్న స్థాపించిన ప్రజారాజ్యానికి , జనసేనకు చాలా అంతరం ఉందని గుట్టువిప్పారు. ఆనాటి అనుభవాలే పాఠంగా తన పార్టీని నిర్మిస్తున్నానన్నారు. నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదని అభిమానులు, కార్యకర్తల కేంద్రంగానే పార్టీని నడుపుతానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ముచ్చట లేదు. పదికాలాలపాటు పార్టీని నడపడమే ధ్యేయమని భవిష్యత్తును ప్రకటించారు. మొత్తమ్మీద చూస్తే పక్కా ప్రణాళికతోనే ముందుకు నడుస్తున్నట్లు చెప్పుకోవచ్చు. కానీ జనసేనకు ఇంకా బాలారిష్టాలు తీరలేదు. ప్రజారాజ్యం పెట్టిన కొత్తల్లో 30 శాతం వరకూ ఓటర్లు మొగ్గుచూపుతున్నట్లుగా అంచనాలు వెలువడ్డాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి, కాంగ్రెసు బలంగా తలపడటంతో ప్రజారాజ్యం ఆదరణ క్రమేపీ క్షీణించి 17 శాతం ఓట్లతో మూడో పక్షంగా మిగిలిపోయింది. పార్టీని నడపడం చేతకాక కాంగ్రెసులో కలిపేశారు. జనసేనకు ఇంతవరకూ ప్రజారాజ్యం నాటి ఊపు లేదు. రెండు మూడు సర్వేలు చేసినప్పటికీ ఏ ఒక్కటీ ఏడు శాతానికి మించి ప్రజామద్దతు చూపించడం లేదు. వైసీపీ,టీడీపీలు హోరాహోరీగా తలపడనున్న తరుణంలో ఎన్నికల్లో ఈ మద్దతు సైతం మరింతగా క్షీణించే అవకాశం ఉంది.

పవన్ పొలిటికల్ ప్లాన్…

పవన్ కు ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. మాట తీరు కఠినంగా ఉన్నప్పటికీ పెద్దల పట్ల, రాజకీయాల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. అయినప్పటికీ పార్టీని నడపటానికి, నిలబెట్టడానికి , ప్రజల్లోకి వెళ్లడానికి ఈ వైఖరి సరిపోదు. ఎత్తుగడలు అవసరమే. మిత్రులుగా చేయిచాస్తున్న వామపక్షాలకు దూరదృష్టి తక్కువ. క్షేత్రస్థాయి వాస్తవాలను విడిచిపెట్టి నేలవిడిచి సాము చేస్తుంటాయి. ఫలితంగానే ఆపార్టీలు క్రమేపీ క్షీణించిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు జనసేనను ఆధారంగా చేసుకుంటూ పునరుజ్జీవం పొందాలని చూస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలతో పెద్దగా కలిసొచ్చేదేమీ లేదని పవన్ కూ తెలుసు. బీజేపీ పట్ల దూరం పాటిస్తానని చాటిచెప్పడానికి, బలహీనవర్గాల పట్ల వామపక్షాల కమిట్ మెంట్ తనకూ ఉందని వెల్లడించడానికి మాత్రమే లెఫ్ట్ తో చేయి కలుపుతున్నారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి లిద్దరూ ప్రత్యక్షంగా పవన్ తో చేయి కలపాలనుకోవడం లేదు. పరోక్ష మద్దతును ఆశిస్తున్నారు. ఇది ప్రజల్లోకి చెడు సంకేతాలు పంపుతుందని గ్రహించిన జనసేనాని వారి భావనను తిప్పికొట్టడంపైనే దృష్టి పెట్టారు. చంద్రబాబు వదిలిన ఫీలర్లను ఖండించడంతోపాటు అసలు రాష్ట్రసమస్యలకు టీడీపీయే కారణమని ఆరోపించారు. 2014లో తాను వ్యూహాత్మకంగానే టీడీపీకి మద్దతిచ్చానన్నారు. వైసీపీ నేతలు టీఆర్ఎస్ ద్వారా మంతనాలు జరుపుతున్నారని లోగుట్టు విప్పేశారు. ఇది చాలాకీలకమైన అంశమే. తమ పార్టీ బలంగా ఉండటం వల్లనే వైసీపీ ఈరకమైన యత్నాలు చేస్తోందని ప్రజల్లో పెట్టడం ద్వారా ఆపార్టీకి చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

కమలానికి వల…

వైసీపీ, టీడీపీల నుంచి పెద్దగా నాయకులు వచ్చి జనసేనలో చేరే అవకాశాలు లేవు. అధికారం కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. పెద్ద నాయకులు అక్కడే తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటారు. జనసేన మూడో పార్టీగానే ఉంటుందని రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికీ తెలుసు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందనే భావన బాగా వ్యాపించింది. అందువల్ల ఇప్పటికీ ఆపార్టీని పట్టుకుని వేలాడుతున్న పెద్ద నాయకులు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు . వారికి జనసేన శరణార్థ శిబిరంగా కనిపిస్తోంది. పవన్ కు యువత అండదండలు బాగానే ఉన్నాయి. రాజకీయాల్లో రాటుతేలిన వారి అవసరం కొంత ఉంది. బీజేపీ నేతలు వస్తే ఆ కొరత కూడా తీరుతుంది. ఇదే ఉద్దేశంతో బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. సామాజిక సమీకరణలతో ఈ యత్నం ఫలిస్తోంది. పెద్ద ఎత్తున బీజేపీ నుంచి వలస నేతలు ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వామపక్షాలు, మరోవైపు మాజీ బీజేపీ నాయకులు జనసేనకు రక్షణ కవచాలుగా మారబోతున్నారు. ఇంతవరకూ జనసేన ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో వెనకబడే ఉంటోంది. పవన్ స్పందించడం మినహా మిగిలిన నాయకుల మాటకు మీడియాలో ప్రాధాన్యం లభించడం లేదు. లెఫ్ట్ తో పొత్తు ఖరారైపోయి, బీజేపీ నుంచి అనుభవం ఉన్న నాయకులు వచ్చి చేరితే ఈ ఇబ్బంది తొలగిపోతుంది. కాగల కార్యాన్ని వారే చూసుకుంటారు.

ప్రారంభ వేదిక…

జనసేన నెగ్గుతుందనే నమ్మకం లేకపోయినా పార్టీ పట్ల నాయకుల్లో ఆసక్తి ఉంది. పవన్ కల్యాణ్ కు మీడియాలో ప్రాధాన్యం ఉంది. పార్టీని భుజాన వేసుకుని నడిపే చానల్ ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంది. అందువల్ల యువత జనసేనను తమ రాజకీయాలకు స్టెప్పింగ్ స్టోన్ గా భావిస్తున్నారు. ఇంకా కార్యవర్గాల ఏర్పాటు, నియోజకవర్గ బాధ్యతల పంపిణీ వంటివి జరగలేదు. వీటికోసం నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే పెద్ద నాయకుల కోసం జనసేనాని ఎదురుచూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలలో గతంలో కీలకంగా వ్యవహరించిన వారు జనసేనలోకి వస్తే కీలక బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. జిల్లా, నియోజకవర్గ బాధ్యతల్లో వారికి పెద్ద పీట వేయాలనుకుంటున్నారు . 50 శాతం మేరకు యువతకు, మరో 50 శాతం అనుభవజ్ణులైన సీనియర్లకు కేటాయిస్తామని పవన్ ఇప్పటికే ప్రకటించారు. అనుభవజ్ఝుల కోటా పూర్తిగా ఇతర పార్టీ ల నుంచి వచ్చినవారికి ఉద్దేశించిందే. పార్టీని నడపడం, మీడియాను మేనేజ్ చేయడంలో సీనియర్లకు ఉండే చొరవ యువతకు తక్కువనేది జనసేనలో అభిప్రాయం. అందువల్లనే కార్యవర్గాల ఏర్పాటు ఆలస్యమవుతోంది. ఈ ఒత్తిడి పైకి కనిపించకుండా చూసేందుకు ముందుగా శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*