పవన్ చెంతకు చేరతారా… !!

pawan kalyan janasena telugudesamparty

దాదాపు నాలుగైదు నెలల తరువాత మళ్ళీ ఉత్తరాంధ్ర జిల్లాలపై జనసేన దృష్టి సారించింది. పవన్ కళ్యాణ్ గత ఏడాది జూన్, జూలై నెలల్లో ఈ మూడు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. అప్పట్లో కొంతమంది నేతలు కూడా పార్టీలో చేరారు. ఆ తరువాత పవన్ మళ్ళీ ఇటువైపు అసలు చూడ‌లేదు. ఇదిలా ఉండగా పవన్ ఇక్కడ టూర్ చేసినపుడు కనిపించినంత ఆదరణ తరువాత లేకపోవడంతో పాటు, పార్టీలోకి పెద్దగా చేరికలు కూడా లేకుండా పోయాయి. దాంతో పట్టున్న చోట బలపడాలన్న ఉద్దెశ్యంలో జనసేనాని ఈ మూడు జిల్లాలపైన తాజాగా కన్నేశారని తెలుస్తోంది.

త్వరలో భారీ మీటింగ్….

పండుగ తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకులు, క్యాడర్ తో పవన్ కళ్యాణ్ భారీ మీటింగ్ ఒకటి నిర్వహించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఆ మీటింగ్ ద్వారా మొత్తం 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లలో పార్టీ పరిస్థితి ఏంటన్న దానిపై పూర్తిగా సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడ మరమ్మ‌తులు చేపడతారని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీలోకి మరిన్ని చేరికలను కూడా ప్రోత్సహించాలని పవన్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది టీడీపీ, వైసెపీ నాయకులు టికెట్ దక్కుతుందా, లేదా అన్న సంశయంతో ఉన్నారు. అటువంటి వారిని టార్గెట్ చేయడం ద్వారా గట్టి నాయకత్వాన్ని ఎక్కడికక్కడ తయారుచేసుకోవాలని పవన్ భావిస్తున్నారుట.

తటస్థులపైనా మొగ్గు….

ఇక మేధావులు, విద్యావంతులైన వారు, వివిధ రంగాల్లో పేరున్న వారిని కూడా ఈ దఫా పర్యటనలో ఆకట్టుకోవాలని, పార్టీకి వెన్నుదన్నుగా వారిని చేసుకోవడం ద్వారా బలమిన నాయకత్వాన్ని తయారుచేయాలని కూడా పవన్ ఆలోచనగా ఉంది. ఇదిలా ఉండగా వైసీపీ, టీడీపీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలో టికెట్ ఇస్తే చేరుతామని రాయబేరాలు పంపుతున్నట్లుగా భోగట్టా. ఆ విధంగా విశాఖ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ సీట్లతో పాటు, విజయనగరం, శ్రీకాకుళం నుంచి కూడా జనసేనకు వర్తమానాలు వస్తున్నాయని తెలుస్తోంది. మరి పవన్ పర్యటనలో వీరికి క్లారిటీ ఇస్తే చేరికలు బాగానే ఉంటాయని అంటున్నారు. ఇక జనసేనకు పూర్వ రూపం ప్రజారాజ్యం పార్టీకి కూడా ఉత్తరాంధ్రలో మంచి ఆదరణ ఉన్న సంగతి విధితమే. అప్పట్లో ఏకంగా నాలుగు సీట్లు ఒక్క విశాఖలోనే గెలుచుకోవడం జరిగింది. దాంతో మళ్ళీ ఇక్కడే జెండా పాతాలని జనసేన ప్రణాళికలు రూపొందించుకుంటోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*