పుంగనూరు…పెద్దిరెడ్డికి…ఈసారి….?

వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మెజార్టీ స్థానాల్లో పాగా వేసి ఆధిపత్యం చూపించుకునేందుకు టీడీపీ చాప కింద నీరులా తన వ్యూహాలకు ప‌దును పెడుతోంది. చిత్తూరు జిల్లా సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయినా గత దశాబ్దంన్నర కాలానికి పైగా అక్కడ టీడీపీ పడుతూ లేస్తోంది. గత మూడు ఎన్నికల్లోనూ అక్కడ టీడీపీ వెన‌కంజ‌లోనే ఉంటోంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే గత ఎన్నికల్లో వైసీపీ కంటే వెనకబడే ఉంది. మూడు ఎన్నికల్లోనూ ప్రత్యర్థుల పార్టీలతో పోలిస్తే టీడీపీ మెజార్టీ స్థానాలను దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లోనూ చిత్తూరు ఎంపీ సీటుతో పాటు కేవలం ఆరు అసెంబ్లీ సీట్ల‌కే పరిమితం అయ్యింది.

పట్టు చిక్కని పరిస్థితుల్లో……

చిత్తూరు జిల్లాలో పశ్చిమ చిత్తూరులోని మదనపల్లి, పీలేరు, పుంగనూరు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోయింది. దశాబ్దం కాలానికి పైగా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ సెగ్మెంట్లలో టీడీపీకి పట్టు చిక్కడం లేదు. అలాగే ఆ పార్టీ తరుపున ఇక్కడ బలమైన అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. ఎట్టకేలకు మాజీ మంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడంతో పీలేరులో ఇప్పటికి టీడీపీకి బలమైన అభ్యర్థి దొరికినట్లు అయ్యింది. ఇక ఇదే క్రమంలో పుంగనూరు నియోజకవర్గం నుంచి ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న అమర్‌నాధ్‌ రెడ్డి మరదలను రంగంలోకి దించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

పెద్దిరెడ్డిపై పోటీకి……

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో బలమైన నేతగా ఉన్నారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి చెక్‌ పెట్టేందుకు టీడీపీ గట్టి అభ్యర్థి కోసం కొద్ది రోజులుగా అన్వేషణ చేస్తుంది. ఈ నియోజకవర్గంలో మూడు మండలాలతో అమర్‌నాధ్‌ రెడ్డి కుటుంబానికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గాల పున‌ర్విభజన తర్వాత ఆయన పలమనేరుకు వెళ్లారు. పుంగునూరులోని పలు ప్రాంతాలతో అమర్‌నాధ్‌ రెడ్డి కుటుంబానికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. అమర్‌నాధ్‌ రెడ్డి కుటుంబం నుంచి పుంగనూరులో పెద్దిరెడ్డిపై ఎవరినైనా పోటీకి పెడితే గట్టి పోటీ ఉంటుందని టీడీపీ అధిష్టానం ప్లాన్‌.

ఆమెను పోటీకి దింపితే…..

ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన మహిళా నేతగా ఉన్న అమ‌ర్‌నాధ్ రెడ్డి మ‌ర‌ద‌లు అనూష రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే చంద్ర‌బాబు అనూష రెడ్డి భర్త శ్రీనాధ్‌ రెడ్డిని పిలిపించుకుని పలమనేరులో పోటీ చేసే విష‌యంలో వారి ఆసక్తిని కూడా తెలుసుకున్నారు. అయితే అదే నియోజకవర్గం నుంచి పార్టీ తరుపున టిక్కెట్‌ ఆశిస్తున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు బాబురెడ్డిని కూడా పిలిపించి చంద్రబాబు మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థిగా ఎవరిని పోటీలో పెట్టినా వారి గెలుపుకు సహకరించాలని… మీ భవిష్యత్తు నాదని బాబు రెడ్డికి ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పుంగనూరులో అనూష రెడ్డి రంగంలోకి దిగితే మాజీ మంత్రి వర్సెస్‌ మంత్రిగారి మరదలి మధ్య ఆసక్తికర పోరు తప్పేలా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*