పేట‌ మూవీ రివ్యూ

petta new record

బ్యానర్: స‌న్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, సిమ్ర‌న్‌, త్రిష‌, విజ‌య సేతుప‌తి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా త‌దిత‌రులు
సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: తిరు
ఎడిటింగ్‌: వివేక్ హ‌ర్ష‌న్
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బ‌రాజు

సౌత్ లో నెంబర్ వన్ స్టార్.. సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన అభిమాన గణాన్ని కొలమానంలో కొలవడం కూడా కష్టమే. బాషా దగ్గర నుండి నరసింహ వరకు.. రోబో దగ్గర నుండి 2.ఓ వరకు సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులతో పాటుగా సామాన్య ప్రేక్షకుడు ఆయన సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తాడు. రజనీకాంత్ స్టయిల్, ఆయన మ్యానరిజాన్ని ఇష్టపడని వారుండరు. రజనీకాంత్ సినిమా మొదలవుతుంది అంటేనే.. బోలెడంత క్రేజ్ ఆ సినిమాని చుట్టేస్తోంది. సినిమా విడుదల టైంకి ఆ అంచనాలు భారీ సాయిలోకి వచ్చేస్తాయి. అయితే కొంతకాలంగా అభిమానుల అంచనాలు అందుకోవడంలో రజనీకాంత్ వరసగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. దర్శకుల ఎంపికలో పొరబాటో… కథను అంచనా వెయ్యడంలో పొరబాటో తెలియడం లేదు కానీ.. రజనీకాంత్ మాత్రం గత ఎనిమిదేళ్లుగా హిట్ అనే పదానికే దూరమైపోయాడు. ఆఖరుకి గత ఏడాది భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ భారీగా విడుదలైన 2.ఓ సినిమా కూడా టార్గెట్ రీచ్ అవలేక చేతులెత్తేసింది. ఇక రజనీకాంత్ సినిమాలు కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లోనూ విడుదలవుతుంటాయి. తెలుగు ప్రేక్షకుల్లోనూ రజనీకాంత్ అంటే మంచి క్రేజుంది. అందుకే తెలుగు నిర్మాతలు రజనీ సినిమాలకు బోలెడు డబ్బు ఖర్చు పెట్టి హక్కులు కొనేస్తారు. ఇక ఈ పొంగల్ కి కోలీవుడ్ లో కేవలం అజిత్ విశ్వాసంతో పోటీపడుతున్న పేట సినిమా తెలుగులో మాత్రం గట్టి పోటీ ఎదుర్కోబోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు థియేటర్స్ లో సందడి చేస్తుంటే… శుక్రవారం వినయ విధేయ రామ, శనివారం ఎఫ్ 2 చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి వీటి మధ్యలో రజనీకాంత్ పేట చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంక్రాంతి పోటీలో పేట పరిస్థితి ఏమిటీ అనేది సమీక్షలో చూద్దాం.

కథ

పేట(రజనీకాంత్) ఒక హాస్టల్ లో కాళీ పేరుతొ వార్డెన్ గా పని చేస్తుంటారు. ఆ హాస్టల్ లో ఏర్పడే ప్రతి సమస్యని కాళీ చాలా చాకచక్యంగా తనదైన స్టయిల్ లో పరిష్కరిస్తారు. అందులో భాగంగానే ఒక ప్రేమ జంట‌ను కూడా క‌లుపుతాడు. అక్కడే ప్రాణిక్ హీలర్ గా పనిచేసే రజిని(సిమ్రాన్) పరిచయం అవుతుంది. అనుకోని ప‌రిస్థితుల్లో లోక‌ల్ గూండాతో గొడ‌వ పెట్టుకుంటాడు. అప్పుడే అత‌ని పేరు కాళీ కాదు… పేట అని, పేట ది ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ అని తెలుస్తుంది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సింహాచ‌లం(న‌వాజుద్దీన్‌) అనే రాజ‌కీయ నాయ‌కుడితో పేటకి విభేదాలు ఉంటాయి. అసలు రజనీ పై దాడి చేసిన ఆ గ్యాంగ్ ఎవరు? అసలు అక్కడ వార్డెన్ గా పని చేస్తున్న రజనీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో త్రిష, విజయ్ సేతుపతి ఎందుకున్నారు? సింహాచ‌లంకి, పేటకి మధ్యన ఉన్న గొడవేమిటి? ఇవన్నీ తెలియాలంటే పేటని వెండితెర మీద వీక్షించాల్సిందే.

petta

నటీనటుల నటన:

దర్శకులు రజనీకాంత్ కి తన రోల్ గురించి చెప్పాలి గానీ… రజనీ ఆ పాత్రలోకి దూరిపోయి నటించేస్తాడు. అందులోనూ రజనీ స్టయిల్ మరే ఇతర హీరోల్లో మనం చూడలేము. ఈ వయసులోనూ రజనీకాంత్ తన ఎనర్జిటిక్ నటనతో చెలరేగిపోతూనే ఉన్నాడు. ఇక పేటలో కాళీ, పేట పాత్రలు చెయ్యడం అనేది ర‌జ‌నీకాంత్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. కాకపోతే రజనీకాంత్ లోని న‌టుడిని స‌వాల్ చేసే స‌న్నివేశం ఈ చిత్రంలో ఒక్క‌టి కూడా క‌నిపించ‌దు. అంత ఈజీగా తన పాత్రను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక కుర్రాడిలా ర‌జ‌నీకాంత్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ మాత్రం కాస్త ఎంట‌ర్‌టైన్ చేస్తాయి. హీరోయిన్స్ సిమ్రాన్ కి, త్రిషకి ఓ అన్నంత పాత్రలు దక్కలేదు. వారి నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్రలే వారికి దక్కాయి. కాకపోతే రజనీ భార్యగా త్రిష, స్నేహితురాలిగా సిమ్రాన్ ఉన్నంతలో పర్వాలేదనిపించారు. విలన్ గా నటించిన న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ‌ సేతుప‌తి లాంటి పెద్ద న‌టుల‌కు దర్శకుడు ఈ క‌థ‌లో చోటిచ్చాడు… కానీ వాళ్ల స్థాయికి త‌గ్గ‌ట్టు ఆ పాత్ర‌ల‌ను తీర్చిదిద్ద‌లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 96 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి ఇలాంటి ఒక క్యారెక్టర్ కి ఎందుకు ఒకే చెప్పాడో ఆయనకే తెలియాలి. రజనీ సినిమాలో చిన్న పాత్ర అయినా చాలన్నట్టుగా ఉంది విజయ్ పాత్ర. ఇక నాగ్, మేఘా ఆకాష్ లు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

rajanikanth petta

విశ్లేషణ:

రజనీకాంత్ పనిచేసే దర్శకులంతా తమ క్రియేటివిటీని మర్చిపోయి.. రజనీ స్టైల్ లోకి వెళ్ళిపోయి… రజనీని మెప్పించేందుకు కథలు తయారు చేసుకుని సినిమాలు చేస్తున్నారా అనే ఫీలింగ్ ఈ మధ్యన రజనీ సినిమాలు చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడుకి కలుగుతుంది. ఇక రజనీకాంత్ కూడా కథల ఎంపిక శ్రద్ద పెట్టకుండా.. అభిమానుల కోసమే సినిమాలు ఎడాపెడా చేస్తున్నాడనిపిస్తుంది. దర్శకుడు చెప్పింది చేసుకుపోతూ.. సినిమాలో విషయం ఉందా.. లేదా.. అనే విషయాన్ని రజనీ పక్కన పెట్టేస్తున్నాడనిపిస్తుంది. కుర్ర దర్శకులకు అవకాశాలిస్తుంటే.. వాళ్లేమో తమ క్రియేటివిటీని పక్కన పడేసి రజనీని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కార్తీక్ సుబ్బా రాజు.. పేట అనే రొటీన్ కథతో రజినీకాంత్ ని డైరెక్ట్ చేసాడు. కాలా, కబాలి, 2.ఓ సినిమాల్లో రజనీకాంత్ మార్క్ స్టయిల్ ని అభిమానులు చూడలేకపోయారు. ఆయా కథల తీరు అలా ఉంది మరి. అందుకేనేమో ఈసారి తన స్టయిల్, మ్యానరిజం చూపించే పేట కథని రజనీ ఎన్నుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజు కూడా రజనీ స్టయిల్ నే ఫాలో అవుతూ కథను రాసుకున్నాడు. అందుకే సినిమా మొదలు కాగానే… ర‌జ‌నీ ఎంట్రీ సీన్స్, హాస్ట‌ల్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు కేవ‌లం ర‌జ‌నీ అభిమానుల‌ను మెప్పించ‌డానికే అన్నట్టుగా అనిపిస్తాయి. ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా రజనీ స్టయిల్లోనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో కథను పరిచయం చెయ్యకుండా కేవలం రజనీకాంత్ కోసమే సినిమాని చేసినట్టుగా.. రజనీ స్టయిల్ చూపించే సీన్స్ కే పరిమితం చేసాడు దర్శకుడు. ఇక సిమ్ర‌న్‌తో జ‌రిగే ట్రాక్ మొత్తం వింటేజ్ ర‌జ‌నీకాంత్‌ను మ‌న‌కు చూపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఒక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని… అదే పేట.. కాళీగా మార‌డానికి కార‌ణ‌మై ఉంటుంద‌ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యే లోపు… అది కూడా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ స‌న్నివేశాల‌తో నింపేసాడు. సినిమా మొత్తంగా చూస్తే ఇదో రివేంజ్ డ్రామా. తొలి స‌గంలో ర‌జ‌నీ మేన‌రిజ‌మ్స్‌, స్టైల్‌పై ఆధార‌ప‌డిన ద‌ర్శ‌కుడు, సెకండాఫ్ మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్‌, త‌ను తీర్చుకునే ప‌గ‌తో పూర్తి చేశాడు. కాకపోతే బ‌ల‌మైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటే ఇలాంటి క‌థ‌లు అదిరిపోతాయి. కానీ, అదే ఈ సినిమాకు కాస్త లోపంగా మారింది. మరి ఈ సినిమా ఫలితం కూడా కాలా, కబాలి లిస్ట్ లోకి వెళుతుందా లేదా అనేది ఈ వీకెండ్ కల్లా తెలిసిపోతుంది.

సాంకేతిక వర్గం పనితీరు:

రజనీకాంత్ సినిమాకి మొదటిసారిగా పనిచేసిన అనిరుధ్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. రజనీకాంత్ స్టయిల్ కి సరిపడా నేపథ్య సంగీతంతో అనిరుధ్ ఆకట్టుకున్నాడు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. మాసు మరనం పాటతో అదరగొట్టినా మిగతా పాటలతో పర్వాలేదనిపించాడు. తిరు సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ అనేలా చాలా బాగుంది. చాలా సన్నివేశాలను తిరు అందంగా కెమెరాలో బంధించాడు. ఎడిటింగ్ లో చాలా లోపాలున్నాయి. అక్కడక్కడా కొన్ని సీన్స్ లాగ్ గా అనిపిస్తాయి. సన్ పిక్చర్స్ రజనీని నమ్ముకుని బాగానే ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్: ర‌జ‌నీ స్టైల్‌, ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీన్స్, రజని – సిమ్రాన్ ల ట్రాక్, అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: క‌థా, క‌థ‌నం, సెకండ్ హాఫ్, తమిళ నేటివిటీ, విజయ్ సేతుపతి

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*