కుల పోట్ల‌కు బ‌ల‌వుతున్నారటగా.!

pithani-satyanarayana-vs-telugudesam-leaders

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో ఐదు రోజుల్లో వెలువ‌డ‌నున్నాయి. పోటీ చేసిన అభ్య‌ర్థ‌ులు ఎవ‌రికి వారు ఫ‌లితాల‌పై లెక్క‌ల్లో మునిగితేలుతున్నారు. గెలుపు మాదే అన్న ధీమా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక‌ల్లో ఐదేళ్ల‌లో మంత్రులుగా ప‌ని చేసిన వారిలో ప‌ది మందికి పైగా తాము పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏటికి ఎదురీదుతోన్న మాట వాస్త‌వం. ఎంపీలుగా వెళ్లిన ఆదినారాయ‌ణ రెడ్డి, శిద్దా రాఘ‌వ‌రావు ప‌రిస్థితి ఘోరంగా ఉంది. వీళ్లిద్ద‌రూ తాము ఎందుకు ఎంపీలుగా పోటీ చేశామో ? అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ప‌రిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులు ఐదేళ్లపాటు ప్రజలను పట్టించుకోకపోవడంతో వారి నుంచి వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. టిడిపిలో కొంతమంది సీనియర్ నేతలకు, మంత్రులకు సొంత పార్టీ నేతల నుంచి వెన్నుపోట్లు ఎదురైనట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

మూడు సార్లు గెలిచి….

ఈ లిస్టులోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సైతం ఉన్నారట. ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పితాని గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో పాటు… రెండేళ్ల క్రితం జరిగిన కేబినెట్ ప్రక్షాళనలో మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. మంత్రి పదవి వచ్చాక పితాని జిల్లాలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించార‌న్న టాక్ ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే, జిల్లా స్థాయిలో కీలక పదవిలో ఉన్న మరో నేత కలిసి ఈ సారి పితానిని ఓడించేలా ఆచంట నియోజకవర్గంలో తమ సామాజిక వర్గ నేతల ద్వారా పావులు కదిపారని తెలుస్తోంది. మళ్లీ పితాని గెలిస్తే తమకు కాకుండా ఆయనకే మంత్రి పదవి వస్తుందని… జిల్లాలో ఉన్న సామాజిక సమీకరణ‌ల నేపథ్యంలో మళ్ళీ పితాని మంత్రి పదవి దక్కించుకోవ‌డం ఖాయ‌మని వారు భావించారు.

చాప కింద నీరులా…

అదే జ‌రిగితే రాజకీయంగా తాము వెనుకబడిపోతామన్న ఆందోళనతో ఉన్న ఆ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు పితాని ఓడించేందుకు చాపకింద నీరులా ప్రణాళికలు వేసినట్టు సమాచారం. పితాని గతంలో కాంగ్రెస్ నుంచి మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో టిడిపికి చెందిన ప్రజా ప్రతినిధులను గట్టిగా టార్గెట్ చేశారు. టిడిపికి కొమ్ముకాసే ఆ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఎంతక్యాస్ట్ ఫీలింగ్ ఉందో… పితానికి సైతం అంతే స్థాయిలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంద‌న్న టాక్ జిల్లాలో ఎప్ప‌టి నుంచో ఉంది. పితాని టీడీపీలోకి వచ్చినా ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ఓపెన్‌గానే పదే పదే విమర్శలు చేయటం సైతం ఆ సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమైంది. మెట్ట ప్రాంతంలో రిజ‌ర్వుడ్‌ సెగ్మెంట్లలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గ‌త రెండు మూడు ఏళ్లల్లో ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌కు ఆ సామాజిక‌వ‌ర్గ‌మే కార‌ణమ‌ని సైతం పితాని అధిష్టానానికి నివేదిక ఇచ్చారు.

పితానిపై ఆగ్రహానికి….

ఇక ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓ యువ‌ ప్ర‌జా ప్ర‌తినిధికి, పోలీసుల‌కు మ‌ధ్య ఏర్ప‌డిన వివాదంలో పితాని ఆ సామాజిక‌వ‌ర్గం ప్ర‌జాప్ర‌తినిధిని త‌ప్పు ప‌డుతూ చంద్ర‌బాబుకు నివేదిక ఇవ్వ‌డం లాంటి అంశాలు ఆ సామాజిక‌వ‌ర్గంలో పితానిపై ఆగ్ర‌హానికి కార‌ణం అయ్యాయి. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టిడిపి శ్రేణుల‌పై ఎన్నో కేసులను పెట్టించ‌డం వెన‌క‌ పితాని ఉన్నారన్నది టిడిపి ఆరోపణ. ఇప్పుడు టిడిపిలోకి వచ్చి కూడా మంత్రిగా తమపై రాజకీయ ఆధిపత్యం చెలాయించాలని చూస్తుండడం వీరు సహించలేకపోయారు. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో పితాని గెలవకూడదని డిసైడ్ అయిన‌ జిల్లా టిడిపిలోని ఆ సామాజిక‌వ‌ వర్గం(కొంద‌రు నేత‌లు మాత్ర‌మే) ఆయన నియోజకవర్గంలో తమ సామాజిక వర్గం నేతలను అప్రమత్తం చేసిందట.

విస్మరించినందువల్లే…

నియోజకవర్గ కేంద్రంలో బలంగా ఉన్న ఆ సామాజిక వర్గం గతంలో పితాని కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు టిడిపిని బతికించింది. టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యాక పితాని వారిని పూర్తిగా విస్మరించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న గ్యాప్ క్యాష్ చేసుకున్న టిడిపి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పితానికి వ్య‌తిరేకంగా ఓటు వేసేలా, ఎంపీ సీటు టీడీపీ న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థి క‌లువ‌పూడి శివ‌కి ఓటు వేసేలా టీడీపీ వాళ్లే పితానికి వ్య‌తిరేఖంగా ప‌ని చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటి వరకు మూడు ఎన్నికల్లోనూ కేవలం తన కుల బలాన్ని నమ్ముకొని వరుస విజయాలు సాధిస్తున్న పితానికి ఈ సారి సొంత సామాజిక వర్గంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయ‌న సామాజిక వర్గంలో ఆయన వర్గం నుంచి కీలక నేతలు వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా సహకరించారు. గత ఎన్నికల్లో పితానికి సహకరించిన కాపు సామాజిక వర్గం ఓట్లు జనసేన వైపు చీలిపోవటం, పితాని పదేళ్ళలో చాలా మందిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడంతో వారంతా ఇప్పుడు వైసీపీకి సహకరించారు. పితాని తీరుతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ టిడిపి హార్డ్ కోర్ అభిమానులు కూడా పైన మనకు టిడిపి ప్రభుత్వం వస్తే చాలు.. ఇక్కడ పితాని మాత్రం ఓడిపోవాలని ప్రత్యర్థి వర్గానికి సహకరించారు. ఏదేమైనా ఈసారి మంత్రిగా పితాని కుల పోట్లకు బ‌లి అయ్యే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 16592 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*