పళనికి పన్నీర్ నుంచే ముప్పు….?

అసలే ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి హైకోర్టు ఆదేశంతో పదవికి ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. పళనిస్వామిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో దీనిపై ప్రాధమిక నివేదికను అందజేయాలని కూడా సీబీఐని కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విపక్షాల నుంచి సీఎం పదవి నుంచి పళని స్వామి తప్పుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రధానంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వెంటనే పళనిస్వామి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి సీబీఐ విచారణకు సహకరించాలని కోరుతున్నారు.

సొంత పార్టీ నుంచే…..

విపక్షాలు సహజంగానే ఆ డిమాండ్ ను కోరతాయి. అందులో వింతేమీ లేదు. పైగా ఈ కేసును మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసింది డీఎంకేనే కాబట్టి వారి డిమాండ్ సహేతుకమే. అయితే ఇప్పుడు అన్నాడీఎంకేలోనే హైకోర్టు ఆదేశం ముసలం పుట్టించేలా ఉంది. పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నుంచే నినాదాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే పళనిస్వామికి పదవీ గండం సొంత పార్టీ నుంచే ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

రంగంలోకి పన్నీర్ దళం……

ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దీన్ని ఆసరాగా చేసుకుని మరోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలని బలమైన కోరికతో ఉన్నారు. అమ్మ జయలలిత నమ్మిన బంటుగా పేరుపొందిన పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా సంతృప్తికరంగా లేరు. తాను అమ్మ ఏకైక వారసుడినని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే కొద్ది రోజుల క్రితం పళనిస్వామిని దించేందుకు శశికళ మేనల్లుడు దినకరన్ తో పన్నీర్ భేటీ అయ్యారన్నది పార్టీ వర్గాల్లోనే విన్పిస్తున్న టాక్. తాను దినకరన్ ను కలిసింది వాస్తవమేనని చెబుతున్న పన్నీర్ సెల్వం పళనిని పదవి నుంచి దించడానికి కాదని చెబుతుండటాన్ని ఎవరూ విశ్వసించడం లేదు.

అసమ్మతి చెలరేగుతుందా?

ఇప్పటికే అన్నాడీఎంకు కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరినట్లే కన్పిస్తోంది. అనర్హత వేటుకు భయపడి వారు ఆ శిబిరంలోకి వెళ్లలేదు కాని, పళని ప్రభుత్వంపై కరుణాన్ లాంటి ఎమ్మెల్యేలు బహిరంగంగానే కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇప్పటికే మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న నేతలు సీఎం పళనిస్వామిపై హైకోర్టు ఆదేశాన్ని అనువుగా మలుచుకునేందుకు సిద్దమయ్యారన్న వార్తలు ఎడప్పాడి వర్గంలో కలవరం పుట్టిస్తున్నాయి. ఒకవైపు పళనిని దించేందుకు దినకరన్, స్టాలిన్ కాచుక్కూర్చుని ఉండగా అన్నాడీఎంకేలోనూ అసమ్మతి ఊపందుకుంటుందన్నది సమాచారం. మరి దీని నుంచి పళని ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*