పోలవరం బాబుకు వరం కదా…?

సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పోల‌వ‌రం బ‌హుళార్థక సాధ‌క ప్రాజెక్టు నిర్మాణం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. తొలుత ఈ నిర్మాణ కాంట్రాక్టును పొందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, న‌ర‌స‌రావు పేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అల్లుడికి చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థ‌.. త‌ర్వాత అనేక కొర్రీలు వేసింది. దీంతో కాంట్రాక్ట‌ర్‌ను మార్చేందుకు చంద్ర‌బాబు వ్యూహ ర‌చ‌న చేశారు. అయితే, దీనికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌లేదు. ఫ‌లితంగా ఆ న‌ష్ట‌మేదో తానే భ‌రిస్తానంటూ.. న‌వ‌యుగ‌ను రంగంలోకి దింపారు. అయినా కూడా ఇప్పుడు మ‌ళ్లీ పోల‌వరం గుదిబండ‌గా మారింద‌ని అంటున్నారు అధికారులు. విష‌యంలోకి వెళ్తే.. పోల‌వ‌రం ప‌నులు ద‌క్కించుకున్న కాంట్రాక్టు సంస్థ‌.. సీఎం చంద్ర‌బాబుపైనే తిరుగుబాటుకు రెడీ అయింద‌ట‌!

ట్రాన్స్ ట్రాయ్ దక్కించుకున్నా…..

కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టు టెండర్లు పిలవగా ట్రాన్స్ స్ట్రాయ్ ఈ పనులు దక్కించుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన‌ప్ప‌టి నుంచి అధికారులు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం ట్రాన్స్ స్ట్రాయ్‌నే కొన‌సాగిస్తున్నారు. వాస్త‌వానికి ఈ ప‌నుల కోస‌మే రాయ‌పాటి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేశార‌నే వాద‌న కూడా ఉంది. ఇక‌, ఈ సంస్థతో ప‌నులు జ‌ర‌గ‌వ‌ని గుర్తించిన చంద్ర‌బాబు నవయుగను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం నవయుగకు ఇచ్చిన పనులకూ ఫ్రెష్ గా టెండర్లు పిలవాలని చూస్తే కేంద్రం మోకాలడ్డింది. దీంతో పాతరేట్లకే నవయుగను తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే సుమారు 1250 కోట్ల రూపాయలకు సంబంధించిన స్పిల్ వే పనులను ఆ సంస్థకు అప్పగించారు.

కేంద్రం అనుమతి లేకుండా…..

తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతి లేకుండా మరో 921 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. దీనికి సంబంధించి కేంద్రం అనుమతి కూడా తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను కూడా 60 సీ కింద నోటీసులు ఇచ్చి ట్రాన్స్ స్ట్రాయ్ నుంచి తప్పించాలని నిర్ణయించారు. 2015-16 అంచనాల ప్రకారం ఈ కాంపొనెంట్ విలువ 2729 కోట్ల రూపాయలు. ఈ పనులను ట్రాన్స్ స్ట్రాయ్ నుంచి తప్పించి నిర్మాణ రంగంలోని అగ్రశ్రేణి సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వర్క్ ఆర్డర్ కూడా సిద్ధమైంది. అయితే, ఈ విష‌యంలోనే ఇప్పుడు ట్రాన్స్‌స్ట్రాయ్ బాబుపై యుద్ధానికి రెడీ అయింది. ఈ ప‌నుల‌ను కూడా తామే చేస్తామ‌ని దీనికి వేరే సంస్థ‌తో క‌లిసి ముందుకు వెళ్తామ‌ని ఈ సంస్థ ప్ర‌భుత్వానికి చెబుతోంది.

కోర్టుకు వెళతామని….

కాదు..కూడదని రద్దు చేస్తే కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సర్కారు ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. అన్ని పనులను ఇతరులకు సర్కారు దగ్గరుండి అప్పగిస్తుండటంతో సంస్థ ఎండీ శ్రీధర్(రాయ‌పాటి అల్లుడు) సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సాగునీటి శాఖ వర్గాలు తెలిపాయి. కోట్ల రూపాయలు కమీషన్లు తీసుకుని అసలు కాంట్రాక్ట్ సంస్థను ఇంతలా వేధిస్తారా? అంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం తొలి దశను 2018 డిసెంబర్ కు పూర్తి చేస్తామని పలుమార్లు ప్రకటించారు. కానీ ఇది 2019 డిసెంబర్ కు రెడీ అయినా గొప్పేనని ఇంజనీర్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామం.. చంద్ర‌బాబును మ‌రో ఇర‌కాటంలోకి నెట్టిన‌ట్టేన‌ని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*