
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన నిన్న మొన్నటి వరకూ ఆప్తమిత్రులే. ఇప్పటికీ ప్రభుత్వంలో అవి కలసి పనిచేస్తూనే ఉన్నాయి. అయితే వచ్చే లోక్ సభ, శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటున్నాయి. సెంటిమెంట్ రాజకీయాలకు ఒకరు దిగితే…. ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలని మరొకరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాలన్న కాంక్షతో హామీలు ఇచ్చేది ఒకరయితే…. బీజేపీ మాట తప్పిందంటూ మరొకరు కార్యాచరణను సిద్ధం చేసుకోవడం మహారాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
మరాఠాలకు రిజర్వేషన్లు…..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా మరాఠా సామాజిక వర్గాన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. మరాఠాలు ఎప్పటి నుంచో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతున్నారు. తమను వెనకబడిన వర్గంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఫడ్నవిస్ సర్కార్ వారికి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే వెనుకబడిన వర్గాల కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఫడ్నవిస్ చెబుతున్నారు. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఆమోదించింది.
కీలకమైన సామాజికవర్గాన్ని…..
అయితే ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది ఇంకా తేల్చకున్నా ఆ బాధ్యతను మంత్రివర్గ ఉప సంఘంపై మహారాష్ట్ర సర్కార్ పెట్టింది. మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశముందన్నది బయటకు పొక్కిన సమచారాన్ని బట్టి తెలుస్తోంది. మహారాష్ట్రలో దాదాపు 30 శాతం మంది మరాఠాలున్నారు. వీరు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఎక్కువ శాతం మంది బీజేపీ, శివసేన వైపే ఉన్నప్పటికీ వీరిని తమవైపునకు మాత్రమే తిప్పుకోవాలన్నది బీజేపీ ప్రయత్నంగా కన్పిస్తోంది. రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని తెలిసినా, సుప్రీంకోర్టు తీర్పు ఉందని తెలిసినా వచ్చే ఎన్నికల కోసమే మరాఠాల రిజర్వేషన్లు తెరపైకి వచ్చాయన్న వాదన బలంగా విన్పిస్తోంది.
శివసేన కొత్త ఎత్తు……
మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా మరోసారి రామమందిర నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికలకు ముందు బీజేపీ ఎటూ ఈ నినాదం ఎత్తుకుంటుందని తెలిసిన ఉద్దశ్ ఈ నెల 23వ తేదీన అయోధ్య వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయోధ్య విషయం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ఐదేళ్లుగా రామమందిరం కోసం బీజేపీ చేసిందేమీ లేదని చెప్పడానికే ఉద్ధవ్ ఈ పర్యటనను ఉపయోగించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయోధ్య సందర్శన, సరయూ నదీ తీరంలో పూజలతో ఉద్ధవ్ ఠాక్రే మరోసారి బీజేపీ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉద్ధవ్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. మరి రేపు ఏంజరుగుతుందో చూడాలి. మొత్తం మీద ఎన్నికల వేళ మహారాష్ట్రలో మిత్రులుగా ఉన్న బీజేపీ, శివసేనలు ఇప్పటి నుంచే ఓట్ల వేటలో పడ్డాయనే చెప్పక తప్పదు.
Leave a Reply