పొన్నాల ఓడి గెలిచారా …?

మూడున్నర దశాబ్దాల పార్టీ తో అనుబంధం పొన్నాల లక్ష్మయ్యది. గత ఎన్నికల్లో ఆయన చేతుల మీదుగానే టికెట్లు పంపిణి చేశారు. ఎందరికో పార్టీ టికెట్ కి టిక్ పెట్టింది ఆయనే. కానీ ఆయన ఈ ఎన్నికల్లో తన టికెట్ కోసం ఎదురీతే ఈదారు. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ను స్వయంగా రుచి చూశారు. నాలుగు రోజులు హస్తినలో మకాం వేసి తన పాతివ్రత్యాన్ని అధిష్టానం ముందు నిరూపించుకోవాలిసిన పరిస్థితి ని ఎదుర్కొన్నారు. ఒక సీనియర్ నేత పరిస్థితే ఇలా ఉంటే కాంగ్రెస్ రాజకీయాలు తెలంగాణాలో ఏ స్థాయిలో నడిచాయో చెప్పనక్కర్లేదు.

అడ్డొస్తారనే ….

పొన్నాల ఇలా చుక్కలు చూడడానికి సొంత పార్టీలోని సీనియర్ నేతలంతా కారణం అనే వాదన కూడా వినవస్తుంది. ముఖ్యమంత్రి రేసులో వుండే పొన్నాల, మర్రి శశిధర రెడ్డి వంటి వారిని వ్యూహాత్మకంగా పొత్తు పేరుతో చెక్ చెప్పాలనే ఎత్తుగడల అమల్లో లక్ష్మయ్య కి ఈ దుస్థితి దాపురించింది అంటున్నారు పరిశీలకులు. కిందా మీదా పడి కాళ్ళు అరిగేలా తిరిగి ఒక జూనియర్ నాయకుడు అనుభవించే అన్ని కష్టాలు చవిచూసిన సీనియర్ నేత పొన్నాల అనుభవం రాజకీయాల్లో వుండే వారికి ఒక చక్కని గుణపాఠం అనే చెప్పొచ్చు.

కోదండరాం ఎత్తుగడ ఫలించింది …

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం జనగాం సీటుపై కన్నేయడం వెనుక ఒక ప్రత్యేక వ్యూహమే ఉందన్న టాక్ వినవస్తుంది. కాకలు తీరిన పొన్నాల సీటు ఎలాగూ తనకు వచ్చే పరిస్థితి ఉండదని తెలిసిన ఆయన అదే సీటు కావాలని చివరివరకు పోరాడే ఎత్తు వేశారు. దీనికి రీజన్ రాహుల్ నుంచి స్పష్టమైన హామీ పొందడమే అన్నది తేలింది. మహాకూటమి అధికారం లోకి వస్తే ఎవరికీ ఎలాంటి స్థానం కల్పించబడుతుందో అందులో వున్న పార్టీలకు క్లారిటీ లేదు.

పీట ముడి వేస్తేనే…..

పొత్తుల స్థానాల దగ్గర నుంచి టికెట్ల ప్రకటన వరకు స్నేహ హస్తం అందించిన వారికి కాంగ్రెస్ చుక్కలు లెక్కపెట్టించింది. ఈ పరిస్థితి గమనించిన కాంగ్రెస్ అధినేత నుంచి నాకేంటి అని క్లియర్ గా లెక్క తేల్చుకోవాలంటే కీలకమైన సీటు విషయంలో పీట ముడి వేస్తేనే పని జరుగుతుందని ప్రొఫెసర్ ముందు చూపుతో అడుగు వేశారని ఆయన శిబిరంలో వినవస్తున్న టాక్. మొత్తానికి అటు పొన్నాల కోరుకున్నది కోదండం అనుకున్నది జనగాం ఇచ్చింది. ఈ ఎపిసోడ్ లో పొన్నాల ఓడి గెలిస్తే కోదండరాం ఆట ఆడకుండానే తన మనసులో అనుకున్నది సాధించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*