దాదా….వచ్చేయ్…..!

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టాలంటే సామాన్య విషయం కాదు. విపక్షాల ఐక్యత ఎంత అవసరమో….ప్రధాని అభ్యర్థి ఎంపిక కూడా అంతే అవసరం. మోదీకి ధీటైన అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాల్సి ఉంటుంది.అయితే ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తొలుత విపక్షాల్లో ఐక్యత అవసరమని, ఎన్నికల తర్వాతనే ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.కాని అలా ప్రధాని అభ్యర్థిని ప్రకటించక పోతే ప్రజలు ఆదరిస్తారా? అన్న అనుమానం కూడా విపక్షాల్లో నెలకొని ఉంది. ప్రధాని అభ్యర్థిగా విపక్షాల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు. అందరూ ఉద్దండులే. కాకలు తీరిన రాజకీయ నేతలే. కాని వీరిలో ఎవరు ప్రధాని అభ్యర్థి అయినా మరొకరు సహకరిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

విపక్షాలన్నీ కలిపి…..

వచ్చే ఎన్నికలు ప్రధానంగా మోడీ వర్సెస్ అదర్స్ మధ్యనే జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ తన మిత్రపక్షాలన్నింటితో కలసి బరిలోకి దిగాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆ యా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విపక్షాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. నిన్న మొన్నటి వరకూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరు ప్రధాని అభ్యర్థిగా విన్పించింది. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను లోక్ సభ ఎన్నికల్లో కైవసం చేసుకుంటే తాను ప్రధాని అవుతానని స్పష్టంగా చెప్పారు. అయితే ఇటీవల ఆర్ఎస్ఎస్ నేపథ్యంలేని విపక్షాల నుంచి ఎవరు ప్రధాని అభ్యర్థిగా వచ్చినా స్వాగతిస్తామని రాహుల్ తెలపడం విశేషం. ఈ ప్రకటన కాంగ్రెస్ కు ఆత్మహత్యాసదృశ్యమేనన్నది పార్టీలో కొందరి వాదన.

వ్యూహాత్మక తప్పిదమే…..

అతిపెద్ద చరిత్ర కలిగిన,జాతీయ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి కాకుండా ప్రాంతీయ పార్టీ నేతలకు ఇస్తే కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిందం చేసినట్లు అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూసి ప్రాంతీయ పార్టీల నేతలు ప్రధాని అభ్యర్థి కావాలని ఉబలాటపడుతున్నారు. ఇందులో మమత బెనర్జీ ఒకరు. అయితే ఆమె తాను ప్రధాని పదవి రేసులో లేనని చెప్పారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఒక్కసారి ప్రధాని అవ్వాలన్న ఆశతో ఉన్నారు. వీరితోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాని చంద్రబాబుకు రాష్ట్రమే ముఖ్యం. తన తనయుడు లోకేష్ అందివచ్చిన తర్వాతనే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశముంది.

అందుకే ప్రణబ్ పేరు….

అయితే వీరిందరితో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ఉందన్న ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికే దేశ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ దాదా ఇందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ప్రణబ్ ముఖర్జీ అయితే అందరి వాడు అని కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమబెంగాల్ కుచెందిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని ఇటు మమతతో పాటుగా మాయవతి, చంద్రబాబు, నవీన్ పట్నాయక్ వంటి వారు మద్దతు తెలుపుతారని, అందుకే దాదా పేరును తెరపైకి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్న వాదన విన్పిస్తోంది. అదే నిజమైతే మోదీకి సరైన అభ్యర్థి ప్రణబ్ దాదాయే అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*