పీకే తెచ్చిన మార్పేనా?

ప్రశాంత్ కిషోర్ సలహాలను జగన్ తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. అందుకు జగన్ టోన్ మారడమే ఉదాహరణ. జగన్ పాదయాత్ర 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావస్తోంది. కడప జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకూ వైసీపీ అధినేత జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. చంద్రబాబును టార్గెట్ గా చేసుకునే జగన్ ప్రసంగాలు కొనసాగాయి. చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు జగన్. ఆ ఆరోపణలను పట్టుకుని తెలుగుదేశం పార్టీ ప్రజల్లో సానుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తోంది.

టీడీపీకి సానుభూతి పెరుగుతుందని…..

అయితే తాజాగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో కొంత సానుభూతి పెరుగుతున్నట్లు పీకే టీం గమనించింది. బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి లాభం లేదని ప్రశాంత్ కిషోర్ స్వయంగా జగన్ కు సలహా ఇచ్చారట. చంద్రబాబును వ్యక్తిగతంగా తిట్టడం వల్ల పార్టీకి ప్రయోజనం కన్నా నష్టమే చేకూరుతుందని, జగన్ ప్రసంగాలు మాత్రమే కాకుండా పార్టీ నేతలు కూడా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండేలా చూడాలని పీకే సూచించారని తెలుస్తోంది. దీంతో గత రెండు రోజులుగా జగన్ స్వరంలో మార్పు వచ్చిందంటున్నారు.

పీకే సలహాతోనే….

వ్యక్తులను టార్గెట్ చేసినందు వల్ల ప్రయోజనం ఉండదని, విధానాలను ఎండగట్టే విధంగా ప్రసంగాలు ఉండేలా చూసుకోవాలన్న ప్రశాంత్ కిషోర్ సలహాను జగన్ హుందాగా స్వీకరించారంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ జగన్ చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ అయిందని, జగన్ వ్యాఖ్యలను అధికార తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మలచుకుని విజయం సాధించగలిగిందంటున్నారు. అందుకే గత రెండు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరు, అందులో జరుగుతున్న అవినీతిని మాత్రమే జగన్ ఎండగడుతున్నారు.

విధానాలను ఎండగట్టేంత వరకే….

చంద్రబాబు గత ఎన్నికల మ్యానిఫేస్టో లో పెట్టిన హామీల అమలు, నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించే గత రెండు రోజులుగా జగన్ ప్రస్తావిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ప్రజలు తక్షణం స్పందించే ఇసుక మాఫియాపై కూడా మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీస్తున్నారు. దీంతోపాటు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనున్నారో చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబుపైనే విమర్శలు ఎక్కుపెట్టిన జగన్ ఇప్పుడు ఆయన విధానాలను ఎండగడుతుండటం విశేషం. ఇది పీకే తెచ్చిన మార్పేనంటారా?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*