ప్రశాంత్ కిషోర్ దడ పుట్టిస్తున్నాడే..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ పార్టీలు గెలుపోటముల‌పై అంచ‌నాలు వేస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీల‌తోపాటు సొంతంగా కూడా అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయించు కుంటున్నాయి. కులాల వారీగా బ‌లాబ‌లాలు చూస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం ముమ్మ‌రంగా వేట మొద‌లు పెట్టాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఎవ‌రికి ఇవ్వాలి..? ఎక్క‌డ ఇవ్వాలి..? సామాజిక స‌మీక‌ర‌ణాలు క‌లిసివ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గాలు ఏవి..? ప‌్ర‌జ‌ల్లో క‌లిసిపోయే నాయ‌కులు ఎవ‌రు..? జ‌నాన్ని వ‌దిలేసి అధినేత వ‌ద్ద జ‌బ్బ‌లు చ‌రిసే నాయ‌కులు ఎవ‌రు..? ఇలా అనేక కోణాల్లో ప‌రిశీల‌న‌లు చేసిన త‌ర్వాత‌నే టికెట్‌ల కేటాయించేందుకు అన్నిపార్టీలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఈ విష‌యంలో ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద రెండు మూడు అభ్య‌ర్థుల‌ జాబితాలు ఉన్న‌ట్లు స‌మాచారం. దాదాపుగా వాటి నుంచే పేర్ల ఖరారు ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

బాబు ఇప్పటికే……

చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌తో పాటు మ‌రో రెండు పేర్ల‌తో కూడిన ప్రాబ‌బుల్స్ రెడీ చేసుకున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న పార్టీ సొంత స‌ర్వేల‌తో పాటు ఇంటిలిజెన్స్ సర్వేల‌ను బాగా వాడుకుంటున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలో మాత్రం ఈ ప‌రిస్థితి కొంచెం ఘాటుగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఆ పార్టీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త పీకే త‌న టీమ్‌తో చేయించిన స‌ర్వేతో ప‌లువురు నాయ‌కుల్లో గుబులు మొద‌లైంద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రికొంద‌రు మాత్రం సెగ‌లు క‌క్కుతున్నారట‌. ఎందుకంటే.. సొంత పార్టీ శ్రేణుల‌కు తెలియ‌కుండా.. ప‌క‌డ్బందీగా పీకే ఈ స‌ర్వే చేయించార‌ట‌.

ప్రజా నాడి ఆధారంగా…..

కేవ‌లం ప్ర‌జ‌ల్లో క‌లిసి పోయి.. వారి నాడి ఆధారంగా ఆయ‌న స‌ర్వే నివేదిక త‌యారు చేశార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి..? ఎవ‌రికి ప్ర‌జాబ‌లం ఉంది..? ప‌్ర‌జ‌లతో మ‌మేకం అవుతున్న‌ది ఎవ‌రు..? ప‌్ర‌జ‌ల్లోకి పార్టీని బ‌లంగా తీసుకెళ్ల‌కుండా.. కేవ‌లం జ‌గ‌న్ మెప్పు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌దెవ‌రు..? ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాల్లో సామాజిక స‌మీక‌ర‌ణాలు ఏమిటి..? అన్న విష‌యాలపై పీకే నివేదిక ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏపీలోని మొత్తం 175అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పీకే టీమ్ స‌ర్వే చేసిన‌ట్లు తెలుస్తోంది. పీకే టీం ఇప్ప‌టిక విడ‌త‌ల వారీగా రెండు మూడు సార్లు స‌ర్వేలు కంప్లీట్ చేసింది. ప్ర‌ధానంగా ఈసారి సామాజిక స‌మీక‌ర‌ణాలే కీల‌కంగా ప‌నిచేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

పీకే నివేదికే కీలకమా?

ఉత్త‌రాంధ్ర‌లో కాపుల మ‌ద్ద‌తు కోసం జ‌నసేన అధినేత ప‌వ‌న్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక బీసీవ‌ర్గాలు కూడా అత్యంత కీల‌కం. ఇప్ప‌టికే జాతీయ బీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ‌బ‌ద్ధ హోదా పేరుతో బీజేపీ జ‌నంలోకి వ‌స్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పీకే అందించిన నివేదిక‌ ద్వారానే వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కేటాయిస్తార‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ స‌ర్వేతో చాలా మంది నేత‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌లువురు మాత్రం ఈ స‌ర్వ‌తో అస‌లు సిస‌లు నాయ‌కుల‌కే టికెట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆనంద‌ప‌డుతున్నార‌ట‌. ఇంకొంద‌రు పీకే స‌ర్వేపై గుర్రుగా ఉన్నార‌ట‌. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*