ప్రశాంత్ కిషోర్ పక్కా స్ట్రాటజీ….!

ఈసారి ఎలాగైనా అధికారం దక్కాలి. ఏ చిన్న అవకాశమూ వదులుకోకూడదు. తమ అధినేత ఎండనక వాననక ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే…. పార్టీని మరింతగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు మంచి స్పందనే లభిస్తుంది. రాయలసీమ నుంచి కోనసీమ వరకూ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుంది. రాయలసీమ ను మించి కోనసీమలో జనహోరు పాదయాత్రలో ఎక్కువగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న తెలియని పరిస్థితుల్లో మరిన్ని చర్యలకు దిగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

సోషల్ మీడియాలో…..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. జగన్ పార్టీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేశారు. వాళ్లు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పనులను తక్షణమే ప్రజల దృష్టికి తీసుకెళుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ల ద్వారా వైసీపీ లక్ష్యాలను, సిద్ధాంతాలతో పాటు ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు, జగన్ పాదయాత్ర విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నారు.

వింగ్ ను బలోపేతం చేయడానికి…..

అయితే సోషల్ మీడియా వింగ్ ను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ భావించారు. తూర్పు గోదావరి జిల్లాలోని తాటిపాక టౌన్ లో సోషల్ మీడియా టీం సభ్యులతో సమావేశమయ్యారు. దాదాపు మూడు వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి వైసీపీ అధినేత జగన్ కూడా హాజరై వారికి దిశానిర్దేశం చేశారు. పక్కా స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలని వారికి సూచనలు అందాయి. నియోజకవర్గ స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలను పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచించారు.

ప్రత్యేక యాప్ ల ద్వారా…..

ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ల ద్వారా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడానికి కారణం, వారికి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు, తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంతో నేటికీ కొనసాగిస్తున్న మంతనాలను ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరును, ఆ నియోజకవర్గంలో నిలిచిపోయిన పనులు, సమస్యలతో ప్రత్యేకంగా ప్రచారం చేయనున్నారు. మొత్తం మీద ఇక సోషల్ మీడియాలో వైసీపీ ఉధృతంగా వెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ పకడ్బందీగా ప్రణాళిక రూపొందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*