ముద్ర‌గ‌డ ఇలాకాలో రాజ‌కీయం వేడెక్కిందే..

తూర్పుగోదావ‌రి జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచీ మూడు కుటుంబాలే ఏలుతున్నాయి. ముద్ర‌గ‌డ‌, ప‌ర్వ‌త‌, వ‌రుపుల కుటుంబాల చుట్టూ రాజ‌కీయం తిరుగుతోంది. ఈసారి మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా ఉన్న బీసీల‌కే టికెట్లు ఇవ్వాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చితే ఈసారి ఇక్క‌డ భిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితులు ఉన్నాయి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, జ‌న‌సేన, బీజేపీలు ప్ర‌ధాన పోటీదారులుగా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరుసార్లు గెలిచిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిలిందే. అయితే, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఈసారి పోటీకి దిగుతారా..? లేదా అన్న విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు.

టీడీపీ టిక్కెట్ కుటుంబంలోనే పోటీ

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి బ‌రిలోకి దిగిన వ‌రుపుల సుబ్బారావు టీడీపీ అభ్య‌ర్థి ప‌ర్వ‌త చిట్టిబాబుపై కొద్దిపాటి తేడాతో విజ‌యం సాధించారు. రెండేళ్ల‌ త‌ర్వ‌త చిట్టిబాబు హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే వ‌రుపుల సుబ్బారావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ ఎవ‌రికి వ‌స్తుంద‌న్న‌దే అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. అయితే ఆయ‌న‌ మనవడు, డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా కూడా టిక్కెట్ రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తన తండ్రి పేరున వరుపుల తమ్మారావు ఫౌండేషన్‌ స్థాపించి సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వైద్య శిబిరాలు, జాబ్‌ మేళాలు, లైసెన్స్‌ మేళాలు వంటివి నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

వైసీపీ టిక్కెట్ ఎవరికో..?

మ‌రోవైపు పర్వత చిట్టిబాబు కుటుంబీకులు కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. పర్వత రాజుబాబు, ఆయన సతీమణి జానకిదేవి, మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును క‌ల‌వ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌మ‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. వైసీపీ నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్‌కు టికెట్ ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఇక‌ జనసేన పార్టీ కూడా చాపకింద నీరులా విస్త‌రిస్తోంది. కొందరు కాపు సామాజిక వర్గీయులు పార్టీ బలోపేతానికి క‌ష్ట‌ప‌డుతున్నారు. ఆ పార్టీ టికెట్ కోసం వరుపుల కుటుంబానికి చెందిన ఏలేశ్వరం మండల మాజీ అధ్యక్షుడు వరుపుల తమ్మయ్యబాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

వారసుడి ఎంట్రీ కోసం ముద్రగడ ప్రయత్నాలు

ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి అభ్య‌ర్థుల విష‌యంలో ఇప్ప‌టికైతే స్ప‌ష్ట‌త లేదు. కాంగ్రెస్‌ తరుపున ఉమ్మిడి వెంకటరావు, ధరణాలకోట శ్రీను పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ స‌భ్యులుగా కొన‌సాగుతున్న వీరిలోనే ఎవ‌రికో ఒక‌రికి టికెట్ వ‌స్తుంద‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. బీజేపీ నుంచి అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు పింగిలిదేవి సత్తిరాజు పేరు వినిపిస్తోంది. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆరుసార్లు ముద్రగడ కుటుంబీకులు, నాలుగుసార్లు పర్వత కుటుంబీకులు, మూడుసార్లు వరుపుల కుటుంబీకులు గెలిచాయి. ఈసారి ఏ కుటుంబం నుంచి ఎవ‌రు గెలుస్తారో చూడాలి మ‌రి. ఇదిలా ఉంటే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సైతం త‌న కుమారుడి పొలిటిక‌ల్ ఎంట్రీ కోసం అంత‌ర్గ‌తంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఎలా ఫ‌లిస్తాయో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*